ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరీక్షల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రాణాలను కాపాడుతుందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు నిరూపించారు. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకపోయినప్పటికీ, సాధారణ హెల్త్ చెకప్‌తో ఓ వ్యక్తికి ప్రాణాంతక కిడ్నీ కేర్‌ను గుర్తించి విజయవంతంగా చికిత్స అందించారు.
నగరానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు (బీపీ, షుగర్ వంటివి) లేవు. ధూమపానం అలవాటు కూడా లేదు. అయితే, ఇటీవల ఆయన చేయించుకున్న సాధారణ మాస్టర్ హెల్త్ చెకప్‌లో భాగంగా చేసిన అబ్డామినల్ అల్ట్రాసౌండ్ పరీక్షలో ఎడమ కిడ్నీలో సుమారు 8 సెంటీమీటర్ల మేర పెరిగిన గడ్డ (మాస్) బయటపడింది. వెంటనే సీటీ స్కాన్ నిర్వహించగా అది కిడ్నీ కేన్సర్‌గా నిర్ధారణ అయింది.
AINU యూరాలజీ హెచ్‌ఓడి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస నారాయణం నేతృత్వంలోని బృందం ఆ రోగికి రాడికల్ నెఫ్రెక్టమీ (సర్జరీ ద్వారా కిడ్నీ తొలగింపు) నిర్వహించింది. పరీక్షల్లో అది 'క్లియర్ సెల్ రీనల్ సెల్ కార్సినోమా'గా తేలింది. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస నారాయణం మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 4.3 లక్షల కొత్త కిడ్నీ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి.
విచారకరమైన విషయం ఏమిటంటే.. 70 నుంచి 80 శాతం కిడ్నీ కణితులు ఎటువంటి లక్షణాలు లేకుండానే పెరుగుతాయి. మూత్రంలో రక్తం రావడం, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే అది వ్యాధి ముదిరినట్లు లెక్క. అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం" అని వివరించారు. ధూమపానం, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారికి ముప్పు ఎక్కువ. కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు.
చిన్న గడ్డలను 'పార్షియల్ నెఫ్రెక్టమీ' ద్వారా కిడ్నీని కాపాడుతూనే తొలగించవచ్చు. పెద్ద గడ్డలకు మొత్తం కిడ్నీ తొలగించాల్సి ఉంటుంది. ఏడాదికి ఒకసారి కనీసం అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఇలాంటి సైలెంట్ కిల్లర్స్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా స్కానింగ్‌లో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే నిపుణులైన యూరాలజిస్టులను సంప్రదించాలని AINU యాజమాన్యం కోరింది.
(చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!)


