మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర పరిధిలోని నగలా చంద్రభాన్ గ్రామంలో విషాద చోటుచేసుకుంది. విధవరాలైన వదినతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న 18 ఏళ్ల గౌరవ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి ముందు అతడు తన మొబైల్‌లో ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అందులో తన వదిన, ఆమె బాబాయి, ఒక పొరుగింటి వ్యక్తి తనను మానసికంగా వేధించారని, చంపేస్తామని బెదిరించారని తీవ్ర ఆరోపణలు చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. గౌరవ్ సోదరుడు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అనంతరం గౌరవ్‌కు, అతని విధవరాలైన వదినకు మధ్య ప్రేమ సంబంధం మొదలైంది. ఈ విషయం తెలిసిన సదరు మహిళ పుట్టింటి వారు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లిపోయి, వీరి బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల ఆ మహిళ బాబాయి, మరొక పొరుగింటి వ్యక్తి గౌరవ్‌ను పిలిపించి వదినకు దూరంగా ఉండాలని హెచ్చరించారని, ప్రాణాలతో వదలబోమని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీరి బెదిరింపులు, మానసిక ఒత్తిడి కారణంగా గౌరవ్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు.
ఈ క్రమంలో గౌరవ్ తన గదిలోకి వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి వదిన, ఆమె బాబాయి, పొరుగింటి వ్యక్తే కారణమని పేర్కొన్నాడు. ఆ తర్వాత చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు గది తలుపులు తెరచి చూడగా గౌరవ్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న హైవే పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ వీడియోను దర్యాప్తులో కీలకంగా పరిగణిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: హిమాలయాల్లో 188 సరస్సుల విస్పోటనం?


