మెస్సీ ఈవెంట్‌ టికెట్ల రగడ.. 33000 మంది డబ్బులు వెనక్కి! | Lionel Messi Kolkata Event Row, CM Announces Ticket Refunds For 33,000 Fans After 2025 Chaos, Check Details Inside | Sakshi
Sakshi News home page

మెస్సీ ఈవెంట్‌ టికెట్ల రగడ.. 33000 మంది డబ్బులు వెనక్కి!

Aug 30 2026 11:28 AM | Updated on Aug 30 2026 1:07 PM

CM Suvendu Says Messi event ticket money will be refunded to 33000

కోల్‌కత్తా: ప్రముఖ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ కోల్‌కత్తా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న గందరగోళం మరోసారి తెరపైకి వచ్చింది. 2025 డిసెంబర్‌ 13న యువ భారతి స్టేడియంలో జరిగిన మెస్సీ ఈవెంట్‌కు టికెట్లు కొనుగోలు చేసిన 33 వేల మంది అభిమానుల డబ్బును తిరిగి చెల్లిస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర క్రీడల బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు.

అయితే, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నబన్నాలో నిర్వహించిన కార్యక్రమంలో సువేందు అధికారి ఈ ప్రకటన చేశారు. మెస్సీకి ఉన్న భారీ అభిమానగణాన్ని ప్రస్తావిస్తూ.. రూ.4 వేలు, రూ.6 వేల చొప్పున టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు డబ్బు తిరిగి ఇవ్వడం తన లక్ష్యమని చెప్పారు. 

కాగా, 2025 డిసెంబర్‌లో మెస్సీ.. కోల్‌కత్తా పర్యటనకు వచ్చిన సమయంలో యువ భారతి స్టేడియానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే కార్యక్రమ నిర్వహణలో గందరగోళం నెలకొనడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు నిరసనకు దిగారు. అప్పట్లో టికెట్ల డబ్బులు తిరిగి చెల్లించాలని అభిమానులు డిమాండ్‌ చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఆ డిమాండ్‌ నెరవేరలేదు. ఈ వ్యవహారంలో అప్పటి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ క్రీడల మంత్రి అరూప్‌ బిస్వాస్‌ వ్యవహారశైలిపై కూడా విమర్శలు వచ్చాయి. అనంతరం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

క్రీడలకు రూ.400 కోట్ల బడ్జెట్‌..
గత తృణముల్‌ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో క్రీడా రంగాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఒడిశా, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్‌, ఆసియా క్రీడలు, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం ఉంటుండగా.. బెంగాల్‌ నుంచి ప్రాతినిధ్యం దాదాపు లేకుండా పోయిందన్నారు. ఈ సందర్భంగా క్రీడా రంగానికి రూ.400 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినీ ఇండోర్‌ స్టేడియాలు నిర్మించాలన్నది తమ ప్రభుత్వ ప్రణాళిక అని చెప్పారు. ఇందులో టెన్నిస్‌ కోర్టులు, బ్యాడ్మింటన్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 100 స్టేడియాల నిర్మాణం చేపడతామని తెలిపారు.

చదవండి: ఎన్డీయేలో రగడ.. రాజీనామా చేయాలని కేంద్రమంత్రుల డైలాగ్‌ వార్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement