కోల్‌కతా: కోల్‌కతాలోని కేథడ్రల్ రోడ్‌లో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కలకత్తా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ తృణమూల్ ఛాత్ర పరిషత్ నిర్వాహకులపై హేస్టింగ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 28న కేసు నంబర్ 112 నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 61(2), 223, 125(ఏ), 132, 285 కింద ఈ కేసు నమోదు చేశారు. హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ అపూ బైద్య సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం.. డబ్ల్యూటీఎంసీపీ కార్యక్రమ నిర్వాహకులతో కలిసి బెనర్జీ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, దాని అమలులో భాగంగా 2026 నాటి డబ్ల్యూఈపీ నంబర్ 21728కు సంబంధించిన కలకత్తా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఆగస్టు 28న కేథడ్రల్ రోడ్‌లో నిర్వహించిన డబ్ల్యూటీఎంసీపీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఈ ఉల్లంఘన జరిగినట్లు ఆరోపించారు. ఫిర్యాదులో పేర్కొన్న అనుమతి, ఆదేశాల ప్రకారం కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరగాల్సి ఉంది.
మద్దతుదారులను రెచ్చగొట్టిన మమత
కార్యక్రమంలో బెనర్జీ, నిర్వాహకులు తమ మద్దతుదారులను రెచ్చగొట్టారని, దీంతో అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను జనసమూహం పక్కకు నెట్టివేసిందని పోలీసులు ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో జనసమూహం తోపులాటకు దిగిందని, దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో ఆరోపించారు.
పోలీసుల కథనం ప్రకారం, కేథడ్రల్ రోడ్డులో ఒక వైపు వాహనాల రాకపోకలకు కూడా జనసమూహం అడ్డంకిగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల ప్రకారం అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా.. నిర్వాహకులు కార్యక్రమాన్ని కొనసాగించారని పోలీసులు ఆరోపించారు.
ఈ కేసులో నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఉద్యోగి అధికారికంగా జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించడం, ఇతరుల ప్రాణాలు లేదా వ్యక్తిగత భద్రతకు ప్రమాదం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి లేదా నేరపూరిత బలప్రయోగం, ప్రజా మార్గాలకు సంబంధించి నిర్లక్ష్యపూరిత ప్రవర్తనకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత నిబంధనలను చేర్చారు. మమతా బెనర్జీపై లీగల్ యాక్షన్‌కు సీఎం సువేందు అధికారి ఆదేశించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.


