రాజకీయ సన్యాసం ప్రశ్నే లేదు: మమత | Mamata Banerjee dismissed rumours of her retirement | Sakshi
Sakshi News home page

రాజకీయ సన్యాసం ప్రశ్నే లేదు: మమత

Aug 25 2026 6:23 AM | Updated on Aug 25 2026 6:40 AM

Mamata Banerjee dismissed rumours of her retirement

కోల్‌కతా: రాజకీయాల నుంచి తాను వైదొలిగే ప్రశ్నే లేదని, బీజేపీ గద్దె దిగేదాకా పోరాటం కొనసాగుతుందని టీఎంసీ అధినేత్రి, బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌ ప్రజలకు కేవలం నాలుగు నెలల్లోనే బీజేపీ అసలు స్వరూపం ఏమిటో తెలిసి వచ్చందన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో హనీమూన్‌ ముగిసి, మనీ–మూన్‌ దశ మొదలైందంటూ ఎద్దేవా చేశారు. 

‘నన్ను అడుగడుగునా అడ్డుకుంటున్న బీజేపీ ప్రభుత్వం, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పొరపాటు పడుతోంది. బీజేపీ ప్రభుత్వం రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకునే దాకా పోరాటం ఆపేది లేదు’అని మమత సోమవారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో స్పష్టం చేశారు. ‘మమతా బెనర్జీ వర్గం టీఎంసీని సమర్థించ వద్దంటూ పోలీసులే ప్రజలకు చెబుతున్నారు. టీఎంసీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. పోలీస్‌ ఎస్‌పీలు, జిల్లా బీజేపీ అధ్యక్షుడుల మాదిరిగా తయారయ్యారు.

 ఇప్పటి దాకా కనీసం 14 వేల మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. కొందరు మోసగాళ్ల అండ చూసుకుని బీజేపీలో చేరాలంటూ ప్రచారం చేస్తున్నారు’అని మమత ధ్వజమెత్తారు. జాదవ్‌పూర్‌ వర్సిటీ ప్రాంగణంలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలకు కాషాయ పార్టీయే కారణమని ఆమె నిందించారు. 

రాజకీయ పార్టీలతో ఎటువంటి చర్చలు జరపకుండానే జనగణన ప్రక్రియను చేపట్టారని, దీని ద్వారా జాతీయ పౌర రిజిస్టర్‌ను అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జనగణన దరఖాస్తులపై సంతకం చేసేముందు, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ఆమె హెచ్చరించారు. అందులో వెల్లడించే వ్యక్తిగత సమాచారంతో బ్యాంకు అక్కౌంట్లలో దాచుకున్న మొత్తాలు కూడా మాయమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్‌ సమయంలో తొలగింపునకు గురైన లక్షలాది నిజమైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్పించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మమత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement