‘22ఏ’పై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్
ధరణికన్నా భూభారతితోనే ఎక్కువ దోపిడీ జరుగుతోందని ఆరోపణ
భూదందా బాధితులకు ఉచిత న్యాయ సాయం అందిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భూభారతి పేరిట లక్షలాది ఎకరాల ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి దందా చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత రెండు, మూడేళ్లలో 22ఏలో చేర్చిన, తొలగించిన భూములపై విచారణ జరగాలన్నారు. బాధితులకు మండలస్థాయి నుంచి హైకోర్టు వరకు బీజేపీ లీగల్ సెల్ ద్వారా పూర్తిగా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. భూభారతిని అడ్డుపెట్టుకొని 22ఏ నిషేధిత జాబితా పేరిట భూదోపిడీ, సెటిల్‌మెంట్ల దందా జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో అక్రమాలు జరిగిన ధరణి కంటే ఇప్పుడు భూభారతి పేరుతో అంతకంటే తీవ్రమైన దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు. పీనుగలు తినేవాడు పోయి ఏనుగులు తినేవాడు వచ్చినట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారైందన్నారు.
కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 4 లక్షల ఎకరాల భూములను రాత్రికి రాత్రే అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ, దేవాదాయ భూములు మాత్రమే ఉండాల్సిన 22ఏలోకి దశాబ్దాలుగా మున్సిపల్ అనుమతులు పొంది, పన్నులు కడుతూ నివాసముంటున్న ప్రైవేటు ఇళ్లు, స్థలాలను ఉద్దేశపూర్వకంగా చేర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ‘భూముల క్లియరెన్స్‌కు గతంలో 10 శాతం బీఆర్‌ఎస్ వాటా తీసుకుంటే ఇప్పుడు 50 శాతం వాటా తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఆర్.ఆర్. రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారు. వంద ఎకరాల భూమి క్లియరెన్స్ కావాలంటే 50 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు’అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో భూదందాలు, సెటిల్‌మెంట్లు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు.
ఉచిత బియ్యంపై రాష్ట్రం ప్రచారం మానకపోతే ప్రత్యామ్నాయం చూస్తాం...
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా కేంద్రమే 70 శాతానికిపైగా సబ్సిడీ భరిస్తూ ధాన్యం కొనుగోలు, రవాణా చేసి డీలర్ల కమీషన్ భరిస్తూ పేదలకు ఐదేసి కేజీల చొప్పున ఉచిత బియ్యం అందిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ లోగోను ముద్రిస్తుంటే తెలంగాణలో మాత్రం ప్రధాని మోదీ పేరు, కేంద్ర ప్రభుత్వ లోగో లేకుండా కేవలం సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలే వేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకోవడం మానుకోకపోతే కేంద్రమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లబి్ధదారులకు బియ్యం పంపిణీ ఏర్పాట్లను పరిశీలిస్తుందని హెచ్చరించారు.


