ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించండి.. | TEJAC notice to Telangana government | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించండి..

Aug 23 2026 5:29 AM | Updated on Aug 23 2026 5:29 AM

TEJAC notice to Telangana government

ప్రభుత్వానికి టీఈజేఏసీ నోటీసు 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓలో సమర్పణ 

లేకుంటే ఈనెల 27 నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలు 

10న చలో హైదరాబాద్, ఉద్యోగుల మహాధర్నా

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలపై తెలంగాణ ఉద్యోగ జేఏసీ (టీఈజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులకు నోటీసులను సమర్పించింది. ఈనెల 27లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు, నిరసనలకు దిగుతామని ఇటీవల విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం టీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ ప్రతినిధులు ఆందోళనలకు సంబంధించిన నోటీసులు సమర్పించారు. వాటి పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. 

ఆందోళనలపై తగ్గేదే లేదు... 
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఈసారి వెనక్కు తగ్గేది లేదని టీఈజేఏసీ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఉద్యోగులంతా ముక్తకంఠంతో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో జేఏసీ సైతం వెనక్కు తగ్గొద్దని, ప్రభుత్వంతో చర్చలు జరిపేది లేదని, సమస్యల పరిష్కారం అయినప్పుడే నిరసనలకు బ్రేక్‌ పడుతుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ముందుగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు, ఆ తర్వాత క్రమంగా ఆందోళనలను తీవ్రతరం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా కాకుండా ఐక్యంగా ఉద్యమించాలని నిర్ణయించిన టీఈజేఏసీ... ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చింది. 

నిరసన కార్యక్రమాలు ఇలా... 
–ఈ నెల 27న అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక రోజు మహాధర్నా నిర్వహించనుంది. 
–ఈ నెల 27నుంచి పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ప్రకటించే వరకు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నారు.  
–టీఈజేఏసీ జిల్లాల్లో పర్యటించనుంది. ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు సంబంధించిన అంశాలతో సన్నాహక సదస్సులు నిర్వహించనుంది. 
–సెప్టెంబర్‌ 1 పెన్షన్‌ విద్రోహ దినంగా ప్రకటించింది. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌తో సెప్టెంబర్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది.  
–సెప్టెంబర్‌ 10న ఉద్యోగుల చలో హైదరాబాద్‌ నిర్వహించనుంది. అనంతరం ఉద్యోగులతో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనుంది. 

డిమాండ్లు ఇవీ... 
–ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)ను సమర్థవంతంగా అమలు చేయాలి. 
–ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డుల వినియోగంలో ఇబ్బందులు లేకుండా చూడాలి.  
–పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని ఫిట్‌మెంట్‌ను ప్రకటించి అమలు చేయాలి. 
–ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను ఏకకాలంలో విడుదల చేయాలి. 
–ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల కోసం ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తున్న రూ.2వేల ప్యాకేజీని బకాయిలు పూర్తయ్యే వరకు ప్రతినెలా కొనసాగించాలి.  
–సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలి. 
–ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించాలి. 
–317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి. 190 జీఓను విద్యాశాఖ, పోలీసుశాఖతో పాటు అన్ని శాఖల్లో అమలు చేయాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement