సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, కో–చైర్, ‘ఫ్రూగల్ ఏఐ’ సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ వెంకట శిరీష్ గండికోట
రాష్ట్రంలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యానికి ప్రతిష్టాత్మక వర్సిటీ సంసిద్ధం
యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, స్టార్టప్‌ల అభివృద్ధికి కూడా సహకారం
ప్రత్యేక సహకార వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంబ్రిడ్జ్ నిర్ణయం
విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం సమావేశం
లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాల్లో భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి
అక్టోబర్‌లో రానున్న ప్రతినిధులు
షార్ట్ కోర్సుల నిర్వహణకు ఇంపీరియల్ కళాశాల మొగ్గు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో లండన్‌లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం శనివారం ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో సమావేశమైంది. తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించింది. హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలతోపాటు పరిశోధనల నిర్వహణ, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారం వంటి రంగాల్లో తెలంగాణ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కలిసి పనిచేసేందుకు ఒక ప్రత్యేక సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించాయి. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌లో భారత ప్రభుత్వం తరఫున సేవలందిస్తున్న మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే సంస్థకు చెందిన కో–చైర్, ‘ఫ్రూగల్ ఏఐ’ సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ వెంకట శిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఉన్న అవకాశాలపై వారు సానుకూలంగా స్పందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను తెలంగాణ రైజింగ్ బృందం.. కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించింది. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్య, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ రైజింగ్ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూర్చనుందని సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
అక్టోబర్‌లో రాష్ట్రానికి లివర్‌పూల్ బృందం...
లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ సంస్థ ఆసక్తి చూపింది. లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్, లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పలువురు ప్రతినిధులు లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. లివర్‌పూల్‌తో భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేయడానికి ఆ సంస్థ ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శించనుంది.
ఇంపీరియల్ కళాశాల ఆధ్వర్యంలో షార్ట్ కోర్సులు..
హైదరాబాద్ సహా తెలంగాణలో షార్ట్‌టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని లండన్‌లోని ప్రతిష్టాత్మక ఇంపీరియల్ కళాశాల అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమాండా వోల్తుయిజెన్ తెలిపారు. పరిశోధన రంగంలో భాగస్వామ్యం, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉందని వెల్లడించారు. లండన్‌లోని ఇంపీరియల్ కళాశాలను సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు సందర్శించి అమాండా వోల్తుయిజెన్, దక్షిణాసియా, ఆస్ట్రాలాసియా ప్రాంతాల సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ రొసాన్నా గిల్లెస్పీతో సమావేశమయ్యారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు విచ్చేయాలని ఇంపీరియల్ కళాశాల ప్రతినిధులను ఆహ్వానించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ (స్టెమ్), బిజినెస్ ఎడ్యుకేషన్ రంగాల్లో ఇంపీరియల్ కాలేజీ ప్రపంచంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.


