ముగ్గురు కెమిస్టులు మృతి.. 8 మందికి తీవ్రగాయాలు
ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం!
గత నెలలో జరిగిన ప్రమాదంలోనూ ఒకరు మృతి
సాక్షి, యాదాద్రి, భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని హెజెలో ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ పేలిపోవడంతో ఇద్దరు కెమిస్టులు అక్కడికక్కడే మృతి చెందగా, హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరో కెమిస్ట్ మృతిచెందాడు. ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన చెన్ను నాగిరెడ్డి (31), ఖమ్మం జిల్లా చౌడారం గ్రామానికి చెందిన నాగనబోయిన నరేశ్‌కుమార్ (29), సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన రణబోతు రాజశేఖర్ రెడ్డి (38) ఉన్నారు.
నాగిరెడ్డి ఏడాదిన్నర క్రితం నుంచి, నరేశ్‌కుమార్ మూడేళ్లుగా, రాజశేఖర్‌రెడ్డి (38) నాలుగేళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వారిని పరామర్శించారు. నాగిరెడ్డి, నరేశ్‌కుమార్‌ల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
ప్రమాదం ఎలా జరిగింది..
హెజెలో కంపెనీలో శుక్రవారం రాత్రి షిఫ్ట్ మార్పు సమయంలో రసాయనాల మిశ్రమ నిష్పత్తిలో తేడా రావడం, ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగి కూలెంట్ వ్యవస్థ విఫలం కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కూలెంట్ వ్యవస్థ ఆ వేడిని నియంత్రించలేకపోవడంతో ఒక రియాక్టర్ దెబ్బతిని, పక్కనే ఉన్న మరో రియాక్టర్‌ను ఢీకొన్నట్లు సమాచారం. రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు, మంటలు ఎగిసిపడ్డాయి. శబ్ద తీవ్రతకు చుట్టుపక్కల దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
కంపెనీని సీజ్ చేయాలని ఆదేశం
వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ఫార్మా కంపెనీని సీజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీఎస్పీ మధుసూదన్‌రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు ప్రమాదం జరిగిన కంపెనీని సందర్శించారు. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలు తెలుసుకుని పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. కాగా, రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2.80 కోట్ల ఎక్స్‌గ్రేషియాను కంపెనీ యాజమాన్యం చెల్లించాలని, గాయపడిన కార్మికులకు వైకల్యం తీవ్రత ఆధారంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపేదీ?
ఇదే కంపెనీలో జూలై 16న రసాయన వాయువులు పీల్చడం వల్ల అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉలికల్లు గ్రామానికి చెందిన ఆలుమూరు కృష్ణారెడ్డి (42) మృతి చెందారు. ఆ ఘటన జరిగి నెల రోజులు కాకముందే రియాక్టర్ పేలడంతో కంపెనీ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


