బినామీల ముసుగు తొలగించేలా! | ACB writes to IT on benami properties in key cases registered this year | Sakshi
Sakshi News home page

బినామీల ముసుగు తొలగించేలా!

Aug 23 2026 4:10 AM | Updated on Aug 23 2026 4:10 AM

ACB writes to IT on benami properties in key cases registered this year

అవినీతి అధికారులపై ఫోకస్‌.. ఆస్తుల లెక్కలు తేల్చనున్న ఐటీ 

ఈ ఏడాది నమోదైన కీలక కేసుల్లో బినామీ ఆస్తులపై ఐటీకి లేఖ రాసిన ఏసీబీ  

ఇప్పటికే వందల కోట్ల ఆస్తులు గుర్తించిన అధికారులు  

బినామీ యాక్ట్‌ కింద కేసులు నమోదు  

సాక్షి, హైదరాబాద్‌: వందల కోట్ల రూపాయల సొమ్ము పోగేసిన అవినీతి అధికారుల బినామీల ముసుగు తొలగించేలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ఇటీవల ఏసీబీ దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆదాయపన్నుశాఖ ఈ కేసులలో ఎంట్రీ ఇవ్వబోతోంది. భారీ మొత్తంలో ఆస్తులు పోగేసిన అవినీతి అధికారులపై నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల చిట్టాను ఏసీబీ అధికారులు ఐటీకి పంపినట్లు తెలిసింది. 

ప్రధానంగా రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన కీలక కేసులలో ఏసీబీ గుర్తించిన ఆస్తులు, లెక్కల్లో చూపని నగదు, బినామీల పేర్లతో ఉన్న ఆస్తులపై విచారణ చేయాలని ఐటీకి లేఖ రాసినట్లు ఏసీబీ అధికార వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఐటీకి సమాచారం ఇవ్వడంతో త్వరలోనే ఆదాయపన్నుశాఖలోని బినామీ ప్రొహిబిషన్‌ యూనిట్‌ అధికారులు చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది.  

వంద కోట్లు దాటిన కేసులన్నీ... 
భారీ మొత్తంలో అవినీతి ఆర్జనతో ఇటీవల ఏసీబీకి చిక్కిన అధికారుల జాబితా చూస్తే..రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు చెందిన అక్రమాస్తులు అధికారిక లెక్కల ప్రకారమే రూ.27.65 కోట్లు కాగా..బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ రవీందర్‌ ఆస్తుల విలువ దాదాపు రూ.90 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇక డీజీపీ కార్యాలయంలో పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ డీఎస్పీ సంకిరెడ్డి భీమారెడ్డిపై జూలై 2న 16 ప్రాంతాల్లో సోదాలు చేసి..విల్లాలు, ఫ్లాట్లు, కమర్షియల్‌ భవనాలు, పలు చోట్ల వ్యవసాయ భూములు, బంగారం, వెండి, నగదు కలిపి మొత్తం రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించారు. అదేవిధంగా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి రావుపై నమోదు చేసిన డీఏ కేసులోనూ మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ.150 కోట్ల ఆస్తులు గుర్తించారు. 

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌ నాయక్‌పై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సోదాల్లోనూ ఏసీబీ అధికారులు బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఈ మొత్తం కేసులలో చాలా వరకు ఆస్తులు అవినీతి అధికారులు తమ కుటుంబ సభ్యులు, సమీప బంధులు, స్నేహితులు, నమ్మకస్తులు ఇలా పలువురిని బినామీలుగా పెట్టుకుని వారి పేర్లపై నమోదు చేసి ఆ పత్రాలను తమ వద్ద భద్రపర్చుకున్నారు.  

ఆస్తుల కొనుగోలుపై ఆరా.. 
ఏసీబీ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఆయా ఆస్తుల కొనుగోలుకు వినియోగించిన సొమ్ముపై ఆరా తీశారు. ఆ లెక్కల్లో భారీ వ్యత్యాసాలు ఉండడంతో ఏసీబీ అధికారులు ఈ వివరాలను ఐటీకి పంపారు. వీటిపై ప్రొహిబిషన్‌ ఆఫ్‌ బినామీ ప్రాపర్టీస్‌ ట్రాన్సాక్షన్‌ యాక్ట్‌ ప్రకారం ఆస్తుల లెక్కలపై ఐటీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం. బినామీలుగా పేర్కొన్న వారికి ఆస్తులు ఎలా సంక్రమించాయి? అనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఐటీకి అందించాలి. ఇందులో భాగంగా ఏసీబీ సోదాల్లో స్వాదీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తి పత్రాలు, బ్యాంక్‌ ఖాతాలు సహా బినామీ ఆస్తులకు సంబంధించి ఐటీ అధికారులు ముందస్తుగా నోటీసులు జారీ చేయనున్నారు. 

ఆ తర్వాత విచారణలో నిందితుడు అందించే ఆధారాలు, వివరణ అసంతృప్తికరంగా ఉన్న పక్షంలో అతనిపై బినామీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తారు. బినామీదారుగా ఉన్న వారు సైతం తమ పేరిట ఉన్న ఆస్తుల లెక్కలు చెప్పకపోతే కేసులో కీలక నిందితుడితో పాటు బినామీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. బినామీగా నేరం రుజువైతే సంబంధిత వ్యక్తికి ఏడేండ్ల పాటు శిక్షతో పాటు ఆయా బినామీ ఆస్తులపై మార్కెట్‌ విలువ ప్రకారం 25 శాతం జరిమానా విధించే అవకాశాలుంటాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement