బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కేఫ్‌లో ఆహారం ఆర్డర్ చేసిన తర్వాత పొందిన బిల్లును చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. బిల్లుపై అతడి పేరుకు బదులుగా "లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్" (పొట్టిగా, లావుగా ఉన్న నల్ల చొక్కా వ్యక్తి) అని రాయడం వివాదాస్పదమైంది. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న 'సుబ్‌కో ది క్రాఫ్టరీ' (Subko The Craftery) కేఫ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఉదంతాన్ని బాధితుడు బిల్‌తో సహా రెడ్డిట్‌లో పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లను గుర్తు పట్టడానికి పేర్లు, టేబుల్ నంబర్లు లేదా ఆర్డర్ వివరాలు ఉపయోగించవచ్చు కానీ, ఇలా శరీర రూపాన్ని బట్టి గేలి చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన పేరు గానీ కనీసం టేబుల్ 12 వద్ద ఉన్న మనిషి అని కాకుండా, ఉద్దేశపూర్వకంగానే సిస్టమ్‌లో తనను బాడీ షేమింగ్ చేయడం బాధ పెట్టిందన్నారు. పురుషులపై జరిగే బాడీ షేమింగ్‌ను సాధారణ జోక్‌గా తీసిపారేయకూడదని సూచించాడు.
ఇదీ చదవండి: మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది, కానీ నరకం!
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో కేఫ్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కస్టమర్ రూపాన్ని లేబుల్‌గా వాడటం అసభ్యకరమని నెటిజన్లు మండి పడ్డారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు, గూగుల్ రివ్యూ రాయండి, తద్వారా మేనేజర్‌కు దీని గురించి తెలుస్తుంది. గుణ పాఠం నేర్చుకుంటారని ఒకరు, “ఓరి దేవుడా ఇది చాలా దారుణం! మీరు ఇలాంటి ఎదుర్కోవలసి వచ్చినందుకు క్షమించండి” అంటూ మరొకరు విమర్శించారు.
ఇదీ చదవండి: పెళ్లిలో అనూహ్య పరిణామం : పెళ్లి దుస్తుల్లోనే వధువు చికిత్స
రెస్టారెంట్ క్షమాపణలు
వివాదం పెద్దది కావడంతో 'సుబ్‌కో కాఫీ రోస్టర్స్' ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పింది. ''ఫ్యాట్ షేమింగ్ అనేది ఏ రూపంలో ఉన్నా తప్పే. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవ''ని కేఫ్ స్పష్టం చేసింది. ఈ సమస్యను దాచకుండా బహిరంగంగానే తప్పును ఒప్పుకుంటున్నామని, తమ సంస్థలోని 'అంతర్గత ఫిర్యాదుల కమిటీ' (ICC) ద్వారా కస్టమర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు


