చెత్తను బ‌ట్టే చార్జీ వ‌సూలు! | BNCMC Proposes Hike Monthly Garbage Collection Charges Details | Sakshi
Sakshi News home page

చెత్త ఎంత ఉంటే.. ఛార్జీ అంత!

Nov 23 2026 7:53 PM | Updated on Nov 23 2026 7:53 PM

BNCMC Proposes Hike Monthly Garbage Collection Charges Details

రోజువారీ చెత్త పరిమాణాన్ని బట్టి నెలవారీ రుసుము వసూలు

భివండీలో వ్యాపార సంస్థలకు ప్రత్యేక చెత్త సేకరణ వ్యవస్థ

హోటళ్లు, మాల్స్‌ తదితర సంస్థల నుంచి ప్రత్యేకంగా వ్యర్థాల సేకరణ

23 వార్డుల్లో ప్రత్యేక కాంట్రాక్టర్ల నియామకానికి కార్పొరేషన్‌ ప్రతిపాదన

భివండీ: పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడంతోపాటు ఘన వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు మహారాష్ట్ర థానే జిల్లాలోని భివండీ కార్పొరేషన్‌ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, క్యాటరింగ్‌ సంస్థలు, కూరగాయలు, పండ్ల విక్రయ కేంద్రాలు, మార్కెట్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, మాల్స్, సూపర్‌ మార్కెట్ల నుంచి వెలువడే చెత్తను ప్రత్యేకంగా సేకరించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం న‌గ‌రంలోని 23 వార్డుల పరిధిలో ప్రత్యేక కాంట్రాక్టర్లను నియమించి, ఆయా వ్యాపార సంస్థల నుంచి నెలవారీ రుసుము వసూలు చేయాలనే ప్రతిపాదనను పరిపాలనా విభాగం తదుపరి సర్వసభ్య సమావేశం ఆమోదం కోసం ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం భివండీ న‌గ‌రంలో ప్రతిరోజూ సుమారు 450 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. పెరుగుతున్న జనాభా, కొత్త నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా చెత్త పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే చెత్త సేకరణకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, ఇతర యంత్రసామాగ్రి తగినంతగా లేకపోవడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. మరోవైపు కాలువల్లో చెత్త వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడంతోపాటు ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది.

చెత్త పరిమాణాన్ని బట్టి రుసుములు 
ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 ప్రకారం తడి, పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి సేకరించేందుకు 1 నుంచి 23 వార్డుల వరకు ప్రత్యేక సంస్థలను నియమించాలని కార్పొరేషన్‌ ప్రతిపాదించింది. ఈ సంస్థలు వ్యాపార సంస్థల నుంచి తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి తరలించే బాధ్యతలు చేపట్టనున్నాయి. రోజువారీగా ఉత్పత్తి అయ్యే చెత్త పరిమాణాన్ని బట్టి నెలవారీ రుసుములను నిర్ణయించాలని ప్రతిపాదించారు.

రాత్రివేళ రోడ్లపై చెత్త వేస్తుండటంతో చర్యలు 
హోటళ్లు, కార్యాలయాల నుంచి వెలువడే చెత్తను కొందరు నిర్వాహకులు అర్ధరాత్రి వేళల్లో రోడ్ల పక్కన పడేస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన, అపరిశుభ్రత ఏర్పడటంతోపాటు ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న పారిశుద్ధ్య వ్యవస్థకు అదనంగా ప్రత్యేక చెత్త సేకరణ విధానాన్ని తీసుకురావాలని కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఈ వివరాలను భివండీ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ (హెడ్‌క్వార్టర్స్‌) విక్రమ్‌ దరాడే వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు సర్వసభ్య సమావేశంలో ఆమోదం లభించిన అనంతరం కొత్త విధానం అమల్లోకి రానుంది అని తెలిపారు.

ప్రతిపాదిత రుసుముల వివరాలు ఇలా ఉన్నాయి
రోజుకు 10 కిలోల వరకు చెత్త ఉంటే నెలకు రూ.600 
10 నుంచి 20 కిలోల వరకు రూ.1,200 
20 నుంచి 50 కిలోల వరకు రూ.1,800 
50 నుంచి 100 కిలోల వరకు రూ.2,400

ఇదీ చ‌ద‌వండి: దాదర్‌ మెట్రో స్టేషన్‌కు ‘చైత్యభూమి’గా పేరు!

అయితే ఈ ప్రత్యేక చెత్త సేకరణ సేవలను వినియోగించుకోవడం వ్యాపార సంస్థలకు తప్పనిసరి కాకుండా ఐచ్ఛికంగా ఉంచాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement