బెంగళూరులోని ఓ కేఫ్‌లో కస్టమర్లు కేవలం రూ.150 విలువైన కాఫీ తాగి గంటల తరబడి టేబుళ్ల వద్దే కూర్చుంటుండడంతో యజమాని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత రోజంతా అక్కడే కూర్చుని ల్యాప్‌టాప్‌లపై పని చేస్తుండటంతో కొత్తగా వచ్చే కస్టమర్లకు కూర్చోవడానికి స్థలం దొరకడం లేదు. దీంతో వ్యాపారం దెబ్బతింటోందని యజమాని ఆందోళన చెందుతున్నారు.
బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఇటీవల ఓ వ్యక్తి కేఫ్ ప్రారంభించారు. ఇందుకోసం సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఆయనకు ఎదురైన ప్రధాన సమస్య కాఫీ నాణ్యత లేదా అమ్మకాల విషయంలో కాదు. కస్టమర్లు టేబుళ్లను ఎక్కువ సమయం ఆక్రమించడమే అసలు సమస్యగా మారింది.
ఈ విషయాన్ని విక్రమాదిత్య శుక్లా అనే ఎక్స్ యూజర్ సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. తన పాఠశాల స్నేహితుడు ఎదుర్కొంటున్న సమస్యను ఆయన వివరించారు. కొందరు కస్టమర్లు సుమారు రూ.150 విలువైన ఒక్క కాఫీ ఆర్డర్ చేసి, ల్యాప్‌టాప్‌లు తెరిచి గంటల తరబడి అక్కడే ఉంటున్నారని తెలిపారు. కొన్నిసార్లు దాదాపు రోజంతా కేఫ్‌లోనే గడుపుతున్నారని పేర్కొన్నారు.
ఇంటి నుంచి పని చేసే వారికి ఇలాంటి కేఫ్‌లు ప్రత్యామ్నాయ కార్యాలయాలుగా ఉపయోగపడుతున్నాయి. ఉచిత ఇంటర్నెట్ సదుపాయం, సౌకర్యవంతమైన కుర్చీలు, పానీయాలు అందుబాటులో ఉండటంతో చాలామంది వీటిని ఎంచుకుంటున్నారు. అయితే ఒక్క ఆర్డర్‌తో గంటల తరబడి టేబుల్‌ను ఆక్రమిస్తే ఇతర కస్టమర్లకు అవకాశం ఉండటం లేదు. కేఫ్ నిండిపోవడంతో కొత్తగా వచ్చినవారు ఆర్డర్ ఇవ్వకుండానే వెనుదిరుగుతున్నారు.
కస్టమర్లను వెళ్లిపోవాలని అడిగితే నెగిటివ్ గూగుల్ రివ్యూలు వస్తాయనే భయం యజమానిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, థర్డ్ వేవ్ కాఫీ వంటి పెద్ద సంస్థల ధరల విధానాన్ని శుక్లా ప్రస్తావించారు. పానీయం ధరలో కస్టమర్ కూర్చునే సమయానికి సంబంధించిన ఖర్చు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కస్టమర్ల నుంచి వచ్చిన సూచనలివే
ఈ సమస్య పరిష్కారానికి పలువురు సామాజిక మాధ్యమ వినియోగదారులు పలు సూచనలు చేశారు. కేఫ్‌లో గడిపే ప్రతి గంటకు ఒక కాఫీ కొనాలనే నిబంధన పెట్టాలని కొందరు సూచించారు. పానీయాల వారీగా కాకుండా గంటల ప్రాతిపదికన రుసుము వసూలు చేయాలని మరికొందరు ప్రతిపాదించారు. ఆ రుసుములో కాఫీ, చిరుతిళ్లను చేర్చవచ్చని తెలిపారు. మెరుగైన కూర్చునే సదుపాయాలకు ఎక్కువ ధర నిర్ణయించవచ్చని సూచించారు.
కేఫ్‌లలో ల్యాప్‌టాప్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ల్యాప్‌టాప్‌లు వాడకూడదనే సూచికలు ఏర్పాటు చేయాలని, తరచూ టేబుళ్లను శుభ్రం చేయడం ద్వారా ఎక్కువసేపు కూర్చునేవారిని నిరుత్సాహపరచవచ్చని పేర్కొన్నారు.
మరో సూచన ప్రకారం, వారపు రోజుల ఉదయం వేళల్లో ల్యాప్‌టాప్‌లతో పని చేసేవారికి అనుమతించి, సాయంత్రాలు, వారాంతాలను భోజనానికి, స్నేహితులతో గడిపేందుకు వచ్చే కస్టమర్లకు కేటాయించవచ్చు. బిల్లు మొత్తాన్ని బట్టి కేఫ్‌లో ఉండేందుకు అనుమతించే సమయాన్ని నిర్ణయించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.
అయితే అన్ని కేఫ్‌లకు ఒకే విధానం సరిపోదని ఈ చర్చ స్పష్టం చేస్తోంది. కేఫ్ పరిమాణం, ప్రాంతం, కస్టమర్ల సంఖ్య, రద్దీ వేళలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్లకు సౌకర్యం కల్పిస్తూనే వ్యాపారానికి నష్టం కలగకుండా కేఫ్ యజమానులు ఎలాంటి నిబంధనలు అమలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


