రూ. 20.20 లక్షల విలువైన 2,279 లీటర్ల నెయ్యి సీజ్
దీపావళి పండగ సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో పతంజలి సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించిన 19 ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులను ఎఫ్‌డీఏ రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 114 సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు. సుమారు రూ.9 కోట్లకు పైగా విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న వాటిలో ప్రముఖ 'పతంజలి ఆయుర్వేద్' సూపర్ డిస్ట్రిబ్యూటర్ వద్ద లభించిన వేల లీటర్ల నెయ్యి కూడా ఉండటం గమనార్హం.
సోమవారం ఎఫ్‌డీఏ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం... మహారాష్ట్రలోని ఏడు విభాగాల పరిధిలో ఉన్న 114 ఆహార సంస్థలపై దాడులు నిర్వహించి, దాదాపు 3.53 లక్షల కిలోల ఆహార పదార్థాలను (రూ. 9.01 కోట్ల విలువైనవి) జప్తు చేశారు.
పతంజలి ఆవు నెయ్యి జప్తు
యోగా గురు రాందేవ్ నేతృత్తంలోని పతంజల సంస్థకు ఆవు నెయ్యిపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కొరడా ఝళిపించింది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని పతంజలి ఆయుర్వేద్ సూపర్ డిస్ట్రిబ్యూటర్ 'మెసర్స్ దివ్య మహావితరక్' సంస్థపై దాడి చేసి, 2,279.7 లీటర్ల పతంజలి నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.20.20 లక్షలు. కల్తీ తప్పుడు లేబులింగ్ (మిస్‌బ్రాండింగ్) అనుమానంతో 2,279.7 లీటర్ల పతంజలి ఆవు నెయ్యిని (రూ. 20.20 లక్షల విలువైనది) స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 (FSS Act) ప్రకారం మొదటి దృష్ట్యానే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ఎఫ్‌డీఏ గుర్తించింది.
19 సంస్థల లైసెన్సులు రద్దు:
శుభ్రత లోపించడం, ఆహార భద్రతా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడంతో ముంబై, అమరావతి, ఛత్రపతి శంభాజీనగర్ పరిధిలోని 19 స్వీట్లు, నామ్‌కీన్ మరియు మసాలా తయారీ యూనిట్ల లైసెన్సులు/రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో పనిచేయడం, కీటకాల నియంత్రణ (Pest control) రికార్డులు లేకపోవడం, ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం వంటివి ఈ చర్యలకు కారణమని తెలిపారు.
ఇదీ చదవండి: ఇది కదా సంబరాల దీపావళి ... సెలవులే సెలవులు!
టాటా 1mg, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నోటీసులు:
మరోవైపు, 'టాటా 1mg మెరైన్ కొల్లాజెన్ పౌడర్' ప్రకటనలు, లేబులింగ్‌లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై టాటా 1mg హెల్త్‌కేర్, ఏసిఎఫ్ఓ ఫార్మాస్యూటికల్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: దారుణం : భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు!
అయితే,ఈ వ్యవహారంపై పతంజలి ఫుడ్స్ స్పందించింది. నెయ్యి నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం సేకరించారని, కానీ నాణ్యతలో లోపాలు ఉన్నట్లు నిర్ధారించే అధికారిక నివేదిక తమకు ఇంకా అందలేదని స్పష్టం చేసింది. నెయ్యి కల్తీ అయిందని ఇప్పుడే నిర్ధారించలేమని తెలిపింది. అంతేకాదు, ఈ ఆదేశాలు నేరుగా పతంజలి కంపెనీకి కాకుండా, నెయ్యి సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్‌కు జారీ అయ్యాయని వెల్లడించింది.
ఇదీ చదవండి : డాగ్ ఎటాక్ : రక్తసిక్తమైన నటి ముఖం, మాయని మచ్చ..అందుకే!


