Microsoft Outage: 18 గంటల అంతరాయానికి కారణం ఏంటంటే? | Microsoft Apologises After Global Outage And Check The Reasons | Sakshi
Sakshi News home page

Microsoft Outage: 18 గంటల అంతరాయానికి కారణం ఏంటంటే?

Nov 14 2026 7:10 AM | Updated on Nov 14 2026 7:22 AM

Microsoft Apologises After Global Outage And Check The Reasons

మైక్రోసాఫ్ట్ ఎదుర్కొన్న సాంకేతిక సమస్య కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు పలు సేవలను ఉపయోగించుకోలేకపోయారు. అవుట్‌లుక్‌, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలెట్ వంటి ముఖ్యమైన సేవలు దాదాపు 18 గంటల పాటు సరిగ్గా పనిచేయకపోవడంతో.. ఈ అంతరాయం ప్రపంచవ్యాప్తంగా 74కు పైగా దేశాలపై ప్రభావం చూపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.

ఈ సమస్య కారణంగా.. ఉద్యోగులు తమ ఆఫీస్ పనులు చేయలేకపోయారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార సంస్థలు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా అవుట్‌లుక్‌ ద్వారా ఈమెయిల్స్ పంపడం, స్వీకరించడం సాధ్యం కాకపోవడం, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా ఆన్‌లైన్ మీటింగ్స్ నిర్వహించలేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఈ అంతరాయానికి సైబర్ దాడి లేదా ఏఐ ఏజెంట్స్ కారణం కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

గతంలో సంస్థ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన అప్‌గ్రేడ్ సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపం, ఇటీవల నెట్‌వర్క్‌లో చేసిన మార్పు కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐపై ప్రభావం
మైక్రోసాఫ్ట్ సమస్య విమానయాన రంగాన్ని ప్రభావితం చేసింది. ప్రపంచవ్యాప్తంగా విమాన కార్యకలాపాల్లో ఇబ్బందులు తలెత్తడంతో కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు సూచనలు జారీ చేశాయి. భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. మరోవైపు ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు ఉపయోగించే కొన్ని ఏఐ సర్వీస్ కనెక్టర్లపైనా ఈ అంతరాయం ప్రభావం చూపింది.

డౌన్‌డిటెక్టర్‌ గణాంకాలు
అవుట్‌లుక్‌ సేవపై వచ్చిన ఫిర్యాదులు.. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏకంగా 1,38,058కు చేరుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ గురువారం సాయంత్రానికి 34,490కు చేరాయి. మైక్రోసాఫ్ట్ 365, టీమ్స్ సేవలపై కూడా వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయని డౌన్‌డిటెక్టర్‌ గణాంకాలు పేర్కొన్నాయి.

మైక్రోసాఫ్ట్ స్పందన
ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ.. వినియోగదారులు, భాగస్వాములకు క్షమాపణలు చెప్పింది. సమస్యకు కారణమైన సాంకేతిక లోపాన్ని గుర్తించి పరిష్కరించామని, సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నామని ప్రకటించింది. అయితే.. అన్ని సేవలను ఒకేసారి పునరుద్ధరించకుండా, ఒక్కో దశలో తిరిగి ప్రారంభించి అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించినట్లు తెలిపింది.

ప్రస్తుతం తమ సేవలు చాలా వరకు సాధారణ స్థితికి చేరుకున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాత, సమస్య ఎలా ఏర్పడింది, దాని ప్రభావం ఎంతవరకు ఉంది, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటామనే వివరాలతో కూడిన నివేదికను విడుదల చేస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement