ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నవంబర్ 12న ప్రారంభమైన ఈ సమస్యతో 74 దేశాల్లోని వినియోగదారులు ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్ వంటి సేవలను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలపైనా ప్రభావం పడింది. 15 గంటలకు పైగా గడిచినా సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇటీవల ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థల ఏఐ ఏజెంట్లు నియంత్రణ తప్పి ప్రవర్తించిన ఘటనల నేపథ్యంలో ఈ అంతరాయానికి కూడా అదుపు తప్పిన 'ఏఐ ఏజెంట్' కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగింది?
మైక్రోసాఫ్ట్ ప్రాథమిక సమాచారం ప్రకారం.. కొన్ని సర్వర్లు ఆటోమేటెడ్ హెల్త్ చెక్‌లలో విఫలమై అనూహ్యంగా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో మిగిలిన సర్వర్లపై ఒక్కసారిగా భారం పెరిగింది. ముఖ్యంగా సురక్షిత కనెక్షన్లను ఏర్పాటు చేసే ప్రక్రియలోని కొన్ని భాగాలు అధిక ఒత్తిడికి గురై అభ్యర్థనలను ప్రాసెస్ చేయలేకపోయాయి. ఇటీవల చేసిన నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ మార్పులు కూడా సమస్యకు కారణమై ఉండొచ్చని సంస్థ పరిశీలిస్తోంది.
ప్రభావిత సర్వర్లను పునఃప్రారంభించినప్పటికీ, వాటిపై ట్రాఫిక్ తిరిగి పెరిగినప్పుడు మళ్లీ స్పందించడం ఆగిపోయింది. దీంతో సేవల పునరుద్ధరణ ఆలస్యమైంది. సమస్యను పరిష్కరించేందుకు పాత సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్‌తో కొన్ని సర్వర్లను పునర్నిర్మించడం, ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించడం వంటి చర్యలు చేపట్టింది. నవంబర్ 13న సర్వర్ల స్థిరత్వం మెరుగుపడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
ఏఐ ఏజెంట్లపై ఎందుకీ అనుమానాలు?
ఇటీవల ఏఐ ఏజెంట్ల సామర్థ్యాలు, వాటి నియంత్రణపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2026 జులైలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ పరీక్షల్లో ఓపెన్‌ఏఐకి చెందిన కొన్ని పరిశోధక ఏఐ ఏజెంట్లు తమకు కేటాయించిన పరిమితులను దాటి, హగ్గింగ్ ఫేస్ సహా ఇతర వ్యవస్థల్లోకి ప్రవేశించినట్లు సంస్థ వెల్లడించింది. కొన్ని సర్వర్లలో ఉన్నత స్థాయి యాక్సెస్ కూడా పొందాయి. ఈ ఘటన ఏఐ వ్యవస్థలకు అతిగా అనుమతులు ఇస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలియజేసింది.
మైక్రోసాఫ్ట్ అంతరాయానికి ఏఐ కారణమా?
అయితే ప్రస్తుత అంతరాయానికి ఏఐ ఏజెంట్లు కారణమయ్యాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సైబర్ దాడి జరిగినట్లు తమకు సమాచారం లేదని మైక్రోసాఫ్ట్ కూడా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా హోంశాఖ మంత్రి టోనీ బర్క్ సైతం మైక్రోసాఫ్ట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఇది సైబర్ దాడి కాదని, 2024లో క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా తలెత్తిన అంతరాయాన్ని పోలి ఉండొచ్చని పేర్కొన్నారు.
టెక్ కంపెనీలకు కొత్త సవాల్
ప్రపంచవ్యాప్తంగా కీలక సంస్థలు ఒకే క్లౌడ్ సేవలపై ఆధారపడటం వల్ల ఎదురయ్యే ముప్పును ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. భవిష్యత్తులో సర్వర్ల భద్రతతోపాటు ఏఐ ఏజెంట్లకు ఇచ్చే అనుమతులు, వాటి కార్యకలాపాలపై పర్యవేక్షణ, ప్రత్యామ్నాయ వ్యవస్థల ఏర్పాటు టెక్ కంపెనీలకు కీలక సవాళ్లుగా మారనున్నాయి.


