రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌లో కీలక మార్పులు రాబోతున్నాయా? | Indian Railways RAC Ticket Rules Change RAC System Set to Be Scrapped | Sakshi
Sakshi News home page

రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌లో కీలక మార్పులు రాబోతున్నాయా?

Nov 13 2026 5:46 PM | Updated on Nov 13 2026 6:05 PM

Indian Railways RAC Ticket Rules Change RAC System Set to Be Scrapped

రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టమే. అయితే రోజూ లక్షలాది మంది ప్రయాణించే రైళ్లలో కన్ఫమ్‌ సీట్లు, బెర్తులు పొందడం అంత సులువు కాదు. క్లిష్టమైన రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థలో త్వరలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా అమల్లో ఉన్న రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ (RAC) సదుపాయాన్ని రద్దు చేసే అంశాన్ని భారతీయ రైల్వే పరిశీలిస్తోంది.

ఈ విధానంలో ఇద్దరు ప్రయాణికులకు ఒకే బెర్త్ కేటాయిస్తుండగా.. ఇద్దరి నుంచి పూర్తి టికెట్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. సగం బెర్త్ మాత్రమే పొందుతున్న ప్రయాణికుల నుంచి పూర్తి ధర తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని పునఃపరిశీలించాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

RAC టికెట్లపై పూర్తి ఛార్జీలు వసూలు చేయడాన్ని పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) గతంలో తప్పుబట్టింది. 2026 ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదికలో.. చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా RAC స్థితిలోనే ఉండి, పూర్తి బెర్త్ పొందని ప్రయాణికులకు టికెట్ ఛార్జీలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానం తీసుకురావాలని రైల్వే శాఖకు సూచించింది.

RAC వచ్చిందిలా..

గతంలో రైల్వే టికెట్ రిజర్వేషన్లు ఎక్కువగా మాన్యువల్ విధానంలో జరిగేవి. టికెట్ల రద్దుతో ఖాళీ అయ్యే బెర్తులను ఎప్పటికప్పుడు గుర్తించి ఇతరులకు కేటాయించే సాంకేతిక వ్యవస్థ అందుబాటులో ఉండేది కాదు. దీంతో ఖాళీ అయ్యే బెర్తులను సమర్థంగా వినియోగించుకోవడానికి RAC విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఇద్దరు ప్రయాణికులకు ఒక సైడ్ లోయర్ బెర్త్ కేటాయిస్తారు. ఎవరైనా కన్ఫమ్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే.. RAC ప్రయాణికుల్లో ఒకరికి పూర్తి బెర్త్ కేటాయించే అవకాశం ఉంటుంది.

RAC బెర్తులను ఇద్దరు పంచుకోవాల్సి రావడం వల్ల రాత్రి ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అపరిచిత పురుషులు, మహిళలకు ఒకే బెర్త్ కేటాయించినప్పుడు మరింత అసౌకర్యం తలెత్తుతోంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని RAC విధానాన్ని కొనసాగించాలా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలా? అనే అంశాలను రైల్వే శాఖ పరిశీలిస్తోంది.

ఇదీ చదవండి: ఈ రైళ్లు ఎక్కాలంటే కన్ఫర్మ్‌ టికెట్‌ ఉండాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement