మైక్రోసాఫ్ట్ సర్వర్లలో ఏర్పడిన సమస్య.. ఇప్పుడు విమానయాన రంగంపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే అవుట్‌లుక్, టీమ్స్ వంటి సేవలు పనిచేయక యూజర్లు ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా భారత్‌లో కొన్ని విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది.
మూడు విమానాలు రద్దు
స్పైస్‌జెట్‌కు చెందిన మూడు విమానాలను శుక్రవారం ఉదయం రద్దు చేశారు. ఢిల్లీ నుంచి పుణె, లేహ్, ముంబై వెళ్లాల్సిన విమానాలు ఈ సాంకేతిక సమస్య కారణంగా రద్దయ్యాయి. అంతేకాకుండా.. ఢిల్లీ నుంచి దర్భంగా, ముంబై వెళ్లాల్సిన మరో రెండు విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎయిర్ ఇండియా ఊరట
అయితే.. ఎయిర్ ఇండియా ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చింది. మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని నిశితంగా గమనిస్తున్నామని, ప్రస్తుతం తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేసింది. తమ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా సాధారణంగానే పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రయాణికుల నుంచి వచ్చే ఈమెయిల్స్ మిస్ కాకుండా ఉండేందుకు వాటిని తాత్కాలికంగా మరో మార్గం ద్వారా మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా 24 గంటల్లోనే ఈమెయిల్స్‌కు సమాధానం ఇస్తున్నామని పేర్కొంది.
ఇండిగో, ఆకాసా ఎయిర్ ఇలా..
ఇక ఇండిగో, ఆకాసా ఎయిర్ సంస్థలు కూడా ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమాన సమయాలు, రాకపోకలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. ఢిల్లీ విమానాశ్రయం కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్‌ను ఒకసారి పరిశీలించాలని తెలిపింది. ఎందుకంటే సాంకేతిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో విమానాల షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
మైక్రోసాఫ్ట్ సమస్య కారణంగా.. పలు సేవల్లో అంతరాయం ఏర్పడింది.దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్.. సాంకేతిక సమస్యను గుర్తించామని, పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది. సర్వర్లలో ఏర్పడిన సమస్య కారణంగా కనెక్టివిటీ ఇబ్బందులు తలెత్తినట్లు వెల్లడించింది.


