అధిక బరువుతో ఆరోగ్య కష్టాలు మాత్రమే కాదు, సామాజికంగా నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అమ్మాయిలైతే ఇక చెప్పేదేముంది. సన్నబడితే జీవితం అన్నంతగా పరిస్థితి మారిపోతుంది. ఇవి చాలదన్నట్టు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక, అనేక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా చేరతాయి. అవమానాలు, శారీరక, మానసిక సంఘర్షణను తట్టుకోలేక బేరియాట్రిక్ శస్త్రచికిత్స (Bariatric Surgery) తో శారీరకంగా ఎంతో చిత్రవధ అనుభవించినప్పటికీ, అంత తీవ్ర ఒత్తిడి నుంచి బయట పడి ఒక యువతి ఆసక్తికరమైన వెయిట్ లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.
1996లో పుట్టిన నిధి చిన్నతనం నుంబే బొద్దుగా ఉండటంతో మూడేళ్ల వయసు నుంచే వేధింపులు, హింస మొదలయ్యాయి. ఆమెను బాడీనే మొదటగా అందరూ గమనించి కామెంట్స్ చేసేవారు. గేలి చేసేవారు. చివరికి ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. టీనేజ్‌లో ఎంతో ఉత్సాహంగా ధృడంగా, కల్చరల్‌గా యాక్టివ్‌గా ఉండే అమ్మాయి కాస్తా, మౌనంగా, బేలగా మారిపోయింది. 2018లో ఒక క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సహాయంతో, సుమారు 35 కిలోల బరువు తగ్గినా, మళ్లీ పాత అలవాట్లతో తగ్గిన బరువంతా మళ్లీ వచ్చేసింది. 2019లో కాలేజీ తరువాత వ్యాపారాన్ని ప్రారంభించినా అది సక్సెస్ కాకపోవడంతో తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన చుట్టుముట్టింది. చివరికి ఊరిలోని ఒక సైకియాట్రిస్ట్‌ను కలిసినపుడు ఆమెకు బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అటు ఉద్యోగం లేక, ఇటు అనారోగ్యంతో తీవ్రమైన భావోద్వేగాల మధ్య రెండేళ్ల పాటు చికిత్స తీసుకుంది.
2022 నాటి, 26 ఏళ్లకే, బరువు 120 కిలోలకు చేరింది. అందరూ సోమరి అని గేలి చేసేవారు తప్పితే ఆ బరువు వెనుకున్న విషయం గురించి ఆలోంచేవారు కాదు. ఇలా ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులు, తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన, చికిత్స చేయని మానసిక ఆరోగ్య సమస్యతో జీవిస్తూ, వీటిన నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని అనేక అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లతో జీవితం దుర్భరంగా మారింది. మానసిక అనారోగ్యం, ఈటింగ్ డిజార్డర్స్‌తో తిండే ఒక ఆసరాగా (Coping mechanism) మారి పోయింది.
ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు
బేరియాట్రిక్ సర్జరీ- నరకం
సాంప్రదాయ మార్వాడీ కుటుంబానికి చెందిన ఆమె, సన్నబడితేనే వివాహం, ఉద్యోగం, సమాజంలో గుర్తింపు లభిస్తాయని నమ్మింది. బంధువుల్లో ఒకరు సర్జరీ చేయించుకుని పెళ్లి చేసుకోవడం చూసి ఆమె కూడా ఆ దారి ఎంచుకోవాల్సి వచ్చింది. పెళ్లి అవ్వాలంటే బరువు తగ్గాలనే ఒత్తిడి మధ్య బేరియాటిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది.ఎందుకుంటే కఠినమైన డైట్ చేసి, పోషకాహార సహాయంతో అప్పటికే 35 కిలోలు తగ్గినా మళ్లీ 120 కిలోలకు చేరింది. ఇక డైట్‌లతో పనికాదని అర్థం చేసుకుంది. సర్జరీ తరువాత బరువు తగ్గినప్పటికీ నరకం చూసింది.
బేరియాట్రిక్ శస్త్రచికిత్స తర్వాత నిధి అగర్వాల్ ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక సవాళ్లు ఎదుర్కొంది. అలాగే సర్జరీకి ముందు తాను వాడుతున్న మానసిక ఆరోగ్య మందులను ఒక్కసారిగా ఆపేయడంతో ఆమె తీవ్ర ఆందోళన, భయానికి గురయ్యారు. సర్జరీ గురించి ఎవరికీ చెప్పకూడదని, వ్యాయామం, ఆహార నియమాల వల్లే బరువు తగ్గినట్లు చెప్పాలని కుటుంబం ఒత్తిడి తీసుకొచ్చింది. 120 కిలోల నుండి 50 కిలోలకు తగ్గిన క్రమంలో ముప్పావు వంతు జుట్టు రాలిపోయింది. నీరసం, కండరాల క్షీణత, ఎసిడిటీ, అల్సర్లు, డంపింగ్ సిండ్రోమ్ లాంటి సమస్యలు. 2025లో గాల్ బ్లాడర్ తొలగింపు సర్జరీ కూడా చేయించు కోవాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు
ఎట్టకేలకు సానుకూల మార్పులు:
120 కిలోల బరువు ఉన్నప్పుడు ఆయాసపడే ఆమె, ఇప్పుడు ఆయాసం లేకుండా సులభంగా మూడు అంతస్తులు ఎక్క కలుగుతోంది. ఆహారంపై నియంత్రణ సాధించి, ఆరోగ్యకర ఆహార అలవాట్లను పెంపొందించు కుంది. 2023లో థెరపిస్ట్ సహాయంతో, 2026 నాటికి న్యూట్రిషనిస్ట్ మార్గదర్శకత్వంలో శారీరక దృఢత్వాన్ని తిరిగి నిర్మించుకుంటూ, తనను తాను ప్రేమించుకుంటూ తన జీవితాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంది.
నోట్: మనిషి విలువ, లభించే గౌరవం అనేది శరీరం బరువుపై ఆధారపడి ఉండదు. అయితే అధిక బరువును తగ్గించుకోవడం అనేది నిపుణుల సాయంతో, ఆరోగ్య అంచనాలతో స్థిరంగా సాగాల్సిన ప్రక్రియ. కానీ విపరీతంగా పెరిగిన శారీరక బరువు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి బారియాట్రిక్ సర్జరీ జీవితాన్ని మారుస్తుంది, కానీ అది మానసిక ఆరోగ్య సమస్యలను లేదా ఆలోచనా విధానాన్ని దానంతట అదే మార్చలేదు. దీనికి ఎంతో నిబ్బరం, సహనం, కుటుంబ సభ్యులు తోడ్పాటు ఎంతో అవసరం. సర్జరీ అనేది నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చివరి మార్గం మాత్రమే అనేది గమనించాలి.


