breaking news
Beriyatrik Surgery Obesity
-
మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది, కానీ నరకం!
అధిక బరువుతో ఆరోగ్య కష్టాలు మాత్రమే కాదు, సామాజికంగా నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అమ్మాయిలైతే ఇక చెప్పేదేముంది. సన్నబడితే జీవితం అన్నంతగా పరిస్థితి మారిపోతుంది. ఇవి చాలదన్నట్టు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక, అనేక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా చేరతాయి. అవమానాలు, శారీరక, మానసిక సంఘర్షణను తట్టుకోలేక బేరియాట్రిక్ శస్త్రచికిత్స (Bariatric Surgery) తో శారీరకంగా ఎంతో చిత్రవధ అనుభవించినప్పటికీ, అంత తీవ్ర ఒత్తిడి నుంచి బయట పడి ఒక యువతి ఆసక్తికరమైన వెయిట్ లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.1996లో పుట్టిన నిధి చిన్నతనం నుంబే బొద్దుగా ఉండటంతో మూడేళ్ల వయసు నుంచే వేధింపులు, హింస మొదలయ్యాయి. ఆమెను బాడీనే మొదటగా అందరూ గమనించి కామెంట్స్ చేసేవారు. గేలి చేసేవారు. చివరికి ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. టీనేజ్‌లో ఎంతో ఉత్సాహంగా ధృడంగా, కల్చరల్‌గా యాక్టివ్‌గా ఉండే అమ్మాయి కాస్తా, మౌనంగా, బేలగా మారిపోయింది. 2018లో ఒక క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సహాయంతో, సుమారు 35 కిలోల బరువు తగ్గినా, మళ్లీ పాత అలవాట్లతో తగ్గిన బరువంతా మళ్లీ వచ్చేసింది. 2019లో కాలేజీ తరువాత వ్యాపారాన్ని ప్రారంభించినా అది సక్సెస్ కాకపోవడంతో తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన చుట్టుముట్టింది. చివరికి ఊరిలోని ఒక సైకియాట్రిస్ట్‌ను కలిసినపుడు ఆమెకు బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అటు ఉద్యోగం లేక, ఇటు అనారోగ్యంతో తీవ్రమైన భావోద్వేగాల మధ్య రెండేళ్ల పాటు చికిత్స తీసుకుంది.2022 నాటి, 26 ఏళ్లకే, బరువు 120 కిలోలకు చేరింది. అందరూ సోమరి అని గేలి చేసేవారు తప్పితే ఆ బరువు వెనుకున్న విషయం గురించి ఆలోంచేవారు కాదు. ఇలా ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులు, తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన, చికిత్స చేయని మానసిక ఆరోగ్య సమస్యతో జీవిస్తూ, వీటిన నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని అనేక అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లతో జీవితం దుర్భరంగా మారింది. మానసిక అనారోగ్యం, ఈటింగ్ డిజార్డర్స్‌తో తిండే ఒక ఆసరాగా (Coping mechanism) మారి పోయింది.ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడుబేరియాట్రిక్ సర్జరీ- నరకంసాంప్రదాయ మార్వాడీ కుటుంబానికి చెందిన ఆమె, సన్నబడితేనే వివాహం, ఉద్యోగం, సమాజంలో గుర్తింపు లభిస్తాయని నమ్మింది. బంధువుల్లో ఒకరు సర్జరీ చేయించుకుని పెళ్లి చేసుకోవడం చూసి ఆమె కూడా ఆ దారి ఎంచుకోవాల్సి వచ్చింది. పెళ్లి అవ్వాలంటే బరువు తగ్గాలనే ఒత్తిడి మధ్య బేరియాటిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది.ఎందుకుంటే కఠినమైన డైట్ చేసి, పోషకాహార సహాయంతో అప్పటికే 35 కిలోలు తగ్గినా మళ్లీ 120 కిలోలకు చేరింది. ఇక డైట్లతో పనికాదని అర్థం చేసుకుంది. సర్జరీ తరువాత బరువు తగ్గినప్పటికీ నరకం చూసింది.బేరియాట్రిక్ శస్త్రచికిత్స తర్వాత నిధి అగర్వాల్ ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక సవాళ్లు ఎదుర్కొంది. అలాగే సర్జరీకి ముందు తాను వాడుతున్న మానసిక ఆరోగ్య మందులను ఒక్కసారిగా ఆపేయడంతో ఆమె తీవ్ర ఆందోళన, భయానికి గురయ్యారు. సర్జరీ గురించి ఎవరికీ చెప్పకూడదని, వ్యాయామం, ఆహార నియమాల వల్లే బరువు తగ్గినట్లు చెప్పాలని కుటుంబం ఒత్తిడి తీసుకొచ్చింది. 120 కిలోల నుండి 50 కిలోలకు తగ్గిన క్రమంలో ముప్పావు వంతు జుట్టు రాలిపోయింది. నీరసం, కండరాల క్షీణత, ఎసిడిటీ, అల్సర్లు, డంపింగ్ సిండ్రోమ్ లాంటి సమస్యలు. 2025లో గాల్ బ్లాడర్ తొలగింపు సర్జరీ కూడా చేయించు కోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారుఎట్టకేలకు సానుకూల మార్పులు:120 కిలోల బరువు ఉన్నప్పుడు ఆయాసపడే ఆమె, ఇప్పుడు ఆయాసం లేకుండా సులభంగా మూడు అంతస్తులు ఎక్క కలుగుతోంది. ఆహారంపై నియంత్రణ సాధించి, ఆరోగ్యకర ఆహార అలవాట్లను పెంపొందించు కుంది. 2023లో థెరపిస్ట్ సహాయంతో, 2026 నాటికి న్యూట్రిషనిస్ట్ మార్గదర్శకత్వంలో శారీరక దృఢత్వాన్ని తిరిగి నిర్మించుకుంటూ, తనను తాను ప్రేమించుకుంటూ తన జీవితాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంది.నోట్: మనిషి విలువ, లభించే గౌరవం అనేది శరీరం బరువుపై ఆధారపడి ఉండదు. అయితే అధిక బరువును తగ్గించుకోవడం అనేది నిపుణుల సాయంతో, ఆరోగ్య అంచనాలతో స్థిరంగా సాగాల్సిన ప్రక్రియ. కానీ విపరీతంగా పెరిగిన శారీరక బరువు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి బారియాట్రిక్ సర్జరీ జీవితాన్ని మారుస్తుంది, కానీ అది మానసిక ఆరోగ్య సమస్యలను లేదా ఆలోచనా విధానాన్ని దానంతట అదే మార్చలేదు. దీనికి ఎంతో నిబ్బరం, సహనం, కుటుంబ సభ్యులు తోడ్పాటు ఎంతో అవసరం. సర్జరీ అనేది నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చివరి మార్గం మాత్రమే అనేది గమనించాలి. -
మరీ బొద్దుగా ఉంటే...
పేరెంటింగ్ పిల్లలు బొద్దుగా, ముద్దుగా ఉంటే బాగుంటారు. అదే... బొద్దు ఎక్కువై, మరీ లావుగా కనిపిస్తే? అప్పటి దాకా ముద్దు అనుకున్నది కాస్తా, ముప్పుగా మారుతుంది. ఆరేళ్ళ వయసు పిల్లలకే ‘టైప్ 2’ డయాబెటిస్ వచ్చిందనీ, నిండా పన్నెండేళ్ళు కూడా లేని అమ్మాయికి... లావు తగ్గడం కోసం ‘బేరియాట్రిక్ సర్జరీ’ చేయించారని ఇటీవల షాకింగ్ వార్తలు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే, మన దేశంలో ఇప్పుడు స్థూలకాయం ఓ పెద్ద సమస్యగా మారుతోంది. రెండు నుంచి 17 ఏళ్ళ లోపు పిల్లల్లో దాదాపు నూటికి 18 మందికి పైగా స్థూలకాయంతో బాధపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే, చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలు స్థూలకాయులన్న విషయం గుర్తించరు. ఇలాంటి పిల్లల్లో చిన్న వయసులోనే అధిక రక్తపోటు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కాళ్ళ నొప్పులు, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరకు ఇవన్నీ గుండె సంబంధమైన ఇబ్బందులకు దారి తీయవచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఇటీవల పిల్లల్లో స్థూలకాయం ఎక్కువగా కనిపిస్తోంది. సందు సందుకీ ఏదో ఒక జంక్ ఫుడ్ స్టాల్ రావడం, వాటి తిండికి పిల్లలు అలవాటుపడడం, పిల్లల ఆహారపుటలవాట్లను పట్టించుకొనే తీరిక, ఓపిక తల్లితండ్రులకు లేకపోవడం - లాంటివన్నీ ఈ సమస్యకు కారణాలే. శారీరక ఆరోగ్యాన్నే కాక, స్నేహితుల మధ్య ఎగతాళికి గురవడం ద్వారా పిల్లల మానసిక స్థైర్యాన్ని కూడా స్థూలకాయం దెబ్బతీస్తుంది. అందుకే, పిల్లలు కాస్త స్థూలకాయంతో కనిపిస్తున్నారంటే, పెద్దలు వెంటనే అప్రమత్తం కావాలి. అలాంటి సందర్భంలో పెద్దలు చేయాల్సిందేమిటంటే... ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. పిల్లలు ముద్దుగా, బొద్దుగా ఉన్నారని సరిపెట్టుకుంటూ, వాస్తవాన్ని విస్మరించకూడదు. ఉండాల్సిన దాని కన్నా పిల్లలు లావుగా కనిపిస్తే, తల్లితండ్రులు తక్షణమే దాని మీద దృష్టి పెట్టాలి.స్థూలకాయాన్ని ఒక సమస్యగా గుర్తించిన తరువాత, పిల్లలు వెంటనే లావు తగ్గిపోవా లని కంగారు పడితే కుదరదు. సహనంతో విషయాన్ని డీల్ చేయాలి. ముందుగా పిల్లలకు సమస్య పట్ల అవగాహన కల్పించాలి. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్ల గురించి పిల్లలకు నచ్చజెప్పాలి. ఆహార విహారాల విషయంలో పిల్లలకు పెద్దలే ఆదర్శంగా నిలవాలి. జంక్ ఫుడ్‌కు తాము దూరంగా ఉంటూ, పిల్లలు కూడా దూరంగా ఉండేలా వాళ్ళకు నష్టాలను వివరించాలి. ఒకసారి అలవాటైపోయిన ఆహారాన్ని మార్చడం అంత సులభం కాదు. ముఖ్యంగా, పిల్లలకు ఒకటి అలవాటైతే, దాన్ని మాన్పించడం అప్పటికప్పుడు కష్టం. కాబట్టి, రాత్రికి రాత్రికి జంక్‌ఫుడ్ మానుకొమ్మని బలవంత పెడితే, మొదటికే మోసం రావచ్చు. అందుకని, పిల్లలకు నిదానంగా నచ్చజెప్పాలే తప్ప, వారిని తిట్టడం, కొట్టడం లాంటివి చేయకండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజు వారీ తిండిలో భాగం చేయాలి. శారీరక శ్రమ చేయడం ముఖ్యం. పిల్లలు శారీరకంగా ఎంత చురుకుగా ఉండి, ఎంతగా ఆటపాటల్లో పాల్గొంటే అంత మంచిది. ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, జాగింగ్, టెన్నిస్ - బ్యాడ్మింటన్ లాంటివి ఆడడం - ఇలా శారీరక శ్రమ ఉండే ఆటల్లో పిల్లల్ని ప్రోత్సహించాలి. దాని వల్ల స్థూలకాయం సమస్యను బలంగా ఎదుర్కోవచ్చు. రోజూ కనీసం అరగంట పైన శారీరక శ్రమ చేస్తే, పిల్లలు ఇట్టే లావు తగ్గిపోతారు. పిల్లలకు ఆదర్శంగా ఉండాలంటే, తల్లితండ్రులు కూడా ఉదయాన్నే లేచి, కుటుంబమంతా కలసి వ్యాయామం చేయడం మంచిది.రోజు వారీ భోజనంలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్నే అందించాలి. జంక్ ఫుడ్‌కు బదులు ప్రత్యామ్నాయాలను చూపాలి. పిల్లలకు కొవ్వు తక్కువగా ఉండే పాలు, గింజ ధాన్యాలు, పండ్లు, తాజా కాయగూరలు పెట్టాలి. వీటి వల్ల పిల్లలకు తగినన్ని పోషకపదార్థాలు అందుబాటులోకి వస్తాయి. చిన్న పిల్లల డాక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు పిల్లల ‘బాడీ - మాస్ ఇండెక్స్’ను లెక్కించాలి. బాడీ ఫ్యాట్‌కు ప్రమాణమైన ఈ లెక్కను బట్టి, ఎప్పటికప్పుడు ఏ మేరకు స్థూలకాయం తగ్గిందీ తెలుసుకోవచ్చు.రోజువారీ ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం కలగలిస్తే - పిల్లల్లో స్థూలకాయం తగ్గుతుంది. దీని వల్ల పిల్లల్లో మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆ దోవలో పిల్లల్ని ప్రోత్సహించి, వాళ్ళకు ఆద్యంతం అండగా నిలవాల్సింది తల్లితండ్రులే! - మహతి


