275 కిలోల బరువున్న 16 ఏళ్ల బాలుడికి సర్ గంగారామ్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీకి చెందిన బాలుడు 16 ఏళ్లకే సుమారు 275 కిలోల తీవ్రమైన బరువు పెరిగాడు. అతడి బాడీ మాస్ ఇండెక్ (BMI) దాదాపు 100. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఢిల్లీలోని 'సర్ గంగారామ్ ఆస్పత్రి' వైద్యులు ఆయనకు విజయవంతంగా బేరియాట్రిక్ శస్త్రచికిత్స (ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టోమీ) నిర్వహించి ప్రాణం పోశారు.
సాధారణ పిల్లలు అటూ ఇటూ పరుగెత్తుతూ, నవ్వుతూ, చదువుకోవాల్సిన వయసులో, ఈ పదహారేళ్ల బాలుడు తన సొంత ఇంటి నాలుగు గోడలకే పరిమితమయ్యాడు. అధిక బరువు కారణంగా అతను తన కదలికలన్నింటినీ కోల్పోయాడు. తీవ్రమైన ఆయాసం ,చర్మ ఇన్ఫెక్షన్ కారణంగా చివరకు అతడిని ఆసుపత్రికి తరలించడం ఒక సవాలుగా మారింది. సాధారణ కారులో గానీ, అంబులెన్స్‌లో గానీ తరలించడం సాధ్యపడలేదు. చివరకు, అతడిని ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి 'మెటాడోర్' అనే సరుకు రవాణా వాహనంలో తీసుకువెళ్లారంటేనే అతని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
దీనికి తోడు బాలుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, నిద్రలో శ్వాస ఆడకపోవడం (స్లీప్ ఆప్నియా), తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్లతో అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతడిని వెంటనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు.రెండు వారాల కఠోర శ్రమ తర్వాత, అనేక పరీక్షలు 20 మంది వైద్య నిపుణులు తర్జన భర్జనలు సిబ్బంది అతడిని శస్త్రచికిత్సకు రెడీ అయ్యారు.

50 కిలోలు తగ్గాడు
బాలుడి వయస్సు, విపరీతమైన బరువును దృష్టిలో ఉంచుకుని వివిధ విభాగాలకు చెందిన 20 మంది వైద్య నిపుణులు కేసును పరిశీలించారు. ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు బారియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గమని తేల్చారు. డాక్టర్ దక్ష్ సేథీ, డాక్టర్ సుధీర్ కలహన్ బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ ప్రక్రియలో కడుపులో ఎక్కువ భాగాన్ని తొలగించి, దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. దీనివల్ల అతను తినే ఆహారంపై నియంత్రణ సాధ్యమవుతుంది. సర్జరీ అనంతరం బాలుడు రెండు వారాల పాటు పీడియాట్రిక్ ఐసియు (PICU)లో చికిత్స పొందాడు. ఆశ్చర్యకరంగా, ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స జరిగిన కేవలం మూడు రోజుల తర్వాత అతన్ని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాతి రెండు నెలల్లో అతను సాధించిన పురోగతి వైద్యులను, కుటుంబాన్ని ఎంతగానో సంతోషపరిచింది. కేవలం 60 రోజుల్లో, అతని బరువు 275 కేజీల నుండి 223 కేజీలకు తగ్గింది! అంటే దాదాపు 50 కేజీల బరువు తగ్గింది. కేవలం బరువు తగ్గించడమే కాకుండా, బాలుడికి మెరుగైన జీవన నాణ్యతను అందించడమే ఈ శస్త్రచికిత్స ప్రధాన లక్ష్యమని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !
మంచి డైట్, వ్యాయామంతో కూడిన నిరంతర వైద్య పర్యవేక్షణలో ఒకపుడు నిస్సహాయంగా , సొంతంగా నడవలేని స్థితి నుంచి నెమ్మదిగా కోలుకున్నాడు. అతని వెయిల్‌లాస్, ఆరోగ్య ప్రయాణం వైద్య ప్రపంచానికి ఒక గొప్ప విజయ గాథ ఇలా అనూహ్యమైన బరువుతో పోరాడుతున్న వేలాది మందికి ఒక గొప్ప ఆశాకిరణం.
ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు


