సాక్షి, చెన్నై: ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టిన నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరాలను అందించే తల్లి మేనమామ బంగారు ఉంగరం పథకం (Thaimaman Thanga Mothiram Scheme) కొనుగోలు ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం ఖరారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ (టీఎన్‌ఎంఎస్‌సీ) 70:30 నిష్పత్తిలో జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్‌కు 1,28,499 బంగారు ఉంగరాలు సరఫరా చేసేందుకు వర్క్ ఆర్డర్‌లను జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రకటించిన ఈ పథకం ప్రకారం జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆస్పత్రులలో పుట్టిన శిశువులకు ఈ పథం వర్తిస్తుంది. ఈ మేరకు జ్యుయల్లరీ సంస్థలకు 70:30 నిష్పత్తిలో వర్క్ ఆర్డర్లు జారీ అయ్యాయి. జూన్ నుండి సెప్టెంబర్ నాలుగు నెలల వరకు ఉన్న లబ్ధిదారుల కోసం మొదటి విడతలో జూన్ నుండి లబ్ధిదారులకు 1,28,499 బంగారు ఉంగరాలను ఈ రెండు సంస్థలు సరఫరా చేస్తాయి.
టెండర్ ప్రక్రియలో జాయ్ అలుక్కాస్ సంస్థ 1 గ్రాము బంగారు ధర మినహాయించి, తయారీ, రవాణా, ఇన్సూరెన్స్, BIS హాల్‌మార్కింగ్ చార్జీల కోసం కేవలం 0.01 (1 పైసా) అత్యల్ప ధరగా బిడ్ దాఖలు చేసింది. తమిళనాడు పారదర్శక టెండర్ల చట్టం ప్రకారం, కళ్యాణ్ జువెలర్స్ కూడా అతి తక్కువ ధరకు అంగీకరించడంతో 30శాతం వాటా దక్కించుకుంది.
ఇదీ చదవండి: రూ. 150 కోట్ల అవినీతి : బార్ కౌన్సిల్ ఛైర్మన్‌పై సంచలన ఆరోపణలు
కాగా తమిళ సంస్కృతిలో పుట్టిన బిడ్డకు మేనమామ బంగారు ఉంగరం తొడగడం ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఈ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ,మగ లేదా ఆడ అనే లింగ బేధం లేకుండా, అలాగే ఎన్నో కాన్పు అనే పరిమితి లేకుండా పుట్టిన ప్రతి బిడ్డకు ఈ ఉంగరాన్ని అందిస్తారు.ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా రూ. 755.83 కోట్లు కేటాయించింది.ప్రభుత్వ వైద్య విధానంపై ప్రజలకు నమ్మకాన్ని పెంచడం , ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని సీఎం విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: దారుణం బిల్‌పై బాడీ షేమింగ్ వివాదం : స్పందించిన కెఫే


