తమిళనాడులో డీలిమిటేషన్ అంశం మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ విషయంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ వైఖరి మారిందంటూ అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం విజయ్ తన వైఖరిని సడలించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు విజయ్ మిత్రపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తారని నిలదీస్తున్నాయి..
డీఎంకే ఎంపీ దయానిధి మారన్, సీఎం విజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో డీలిమిటేషన్ బిల్లుపై ఓ పెద్ద జాతీయ పార్టీ డీఎంకేను ‘‘తమిళనాడు ద్రోహులు’’గా అభివర్ణించిందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే ఎప్పుడూ తన వైఖరిని మార్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ వైఖరిలో మార్పు కనిపిస్తోందని ఆరోపించారు.
‘‘అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఒక తీర్మానం, అసెంబ్లీలో మరో తీర్మానం చేసి డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నిలిచిన విజయ్.. ఇప్పుడు న్యాయమైన డీలిమిటేషన్ కావాలని చెబుతున్నారు. మరి విజయ్‌ను రాహుల్‌గాంధీ ద్రోహి అంటారా?’’ అంటూ దయానిధి మారన్ ప్రశ్నించారు.
అర్ధరాత్రి భేటీతో మార్పు వచ్చిందా?
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విజయ్ భేటీ అయిన తర్వాతే ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని డీఎంకే ఆరోపిస్తోంది. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన టీవీకే.. ఇప్పుడు ‘‘న్యాయమైన డీలిమిటేషన్’’ అంటూ కొత్త వైఖరి తీసుకుందని విమర్శించింది. ఈ పరిణామాలను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుంటూ విజయ్ స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఇది పూర్తి యూటర్న్: అన్నాడీఎంకే
విజయ్ వైఖరిపై అన్నాడీఎంకే కూడా తీవ్రంగా స్పందించింది. టీవీకే ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుందని ఆరోపించింది. ‘‘ఇప్పుడు మీరు చెబుతున్నదే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత మాట మార్చడం ఎందుకు?’’ అంటూ అన్నాడీఎంకే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. డీలిమిటేషన్ అంశంపై టీవీకే ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అన్నాడీఎంకే ‘‘రాజకీయ డ్రామా’’గా అభివర్ణించింది.
టీటీవీ దినకరన్ విమర్శలు
అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్ కూడా విజయ్‌పై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీవీకే అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆరోపించారు. డీలిమిటేషన్ అంశంలో విజయ్ వైఖరి మారడంతో ఆ రాజకీయ వ్యూహం బయటపడిందని వ్యాఖ్యానించారు.

మా వైఖరిలో మార్పు లేదు: టీవీకే
విమర్శల నేపథ్యంలో టీవీకే ఐటీ విభాగం స్పందించింది. డీలిమిటేషన్ అంశంపై పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని, న్యాయమైన డీలిమిటేషన్ కోసం మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది.
డీలిమిటేషన్‌పై కొత్త రాజకీయ సమరం
డీలిమిటేషన్ అంశం ఇప్పటికే తమిళనాడులో సున్నితమైన రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందనే ఆరోపణలు రావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ముప్పేట విమర్శలు గుప్పిస్తుండగా.. టీవీకే మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. దీంతో రానున్న రోజుల్లో డీలిమిటేషన్ అంశం తమిళనాడు రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: డీలిమిటేషన్.. కేంద్రం కీలక నిర్ణయం


