సెటైర్ల సంగ్రామం.. ఉదయనిధి వర్సెస్‌ టీవీకే | No Ordinary Sarcasm: Udhayanidhi vs TVK War Erupts in TN Assembly | Sakshi
Sakshi News home page

సెటైర్ల సంగ్రామం.. ఉదయనిధి వర్సెస్‌ టీవీకే

Aug 21 2026 1:30 PM | Updated on Aug 21 2026 1:52 PM

No Ordinary Sarcasm: Udhayanidhi vs TVK War Erupts in TN Assembly

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడీవేడిగా సాగాయి. అధికార టీవీకే ప్రభుత్వం, ప్రతిపక్ష డీఎంకే మధ్య రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరాయి. ఒకానొక టైంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌, మంత్రి సీటీఆర్‌ నిర్మల్‌ కుమార్‌ మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం సభలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకరిపై ఒకరు వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకోవడంతో స్పీకర్‌ జోక్యం చేసుకుని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాల్సి వచ్చింది.

శాసనసభలో టీవీకే సర్కార్‌పై ఉదయ్‌నిధి స్టాలిన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలకు కార్లు గిఫ్ట్‌ ఇచ్చే ప్రకటన చేశాక.. టీవీకే ఎమ్మెల్యే సింధు ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రశంసిస్తూ ఎంజీఆర్‌ చిత్రంలోని పాట పాడడంపై ఉదయనిధి స్పందించారు. ‘‘మనం అసెంబ్లీకి వచ్చామా? లేదంటే సూపర్‌ సింగర్‌ కార్యక్రమానికి వచ్చామా? అనే సందేహం వస్తోంది’’ అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఎమ్మెల్యేలకు కారు అనేది అనవసరమైన ఖర్చు అని, తమ 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు అవి అక్కర్లేదంటూ సీఎం విజయ్‌ ప్రకటనను తిరస్కరించారు.

అలాగే అసెంబ్లీ సమావేశాల్ని లైవ్‌ ప్రసారం చేయకపోవడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే రికార్డుల నుంచి కొన్ని వ్యాఖ్యలను తొలగించినా.. అవి సోషల్‌ మీడియాలో రీల్స్‌ రూపంలో వైరల్‌ అవుతున్నాయని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విజయ్‌ సర్కార్‌కు ఆయన ఓ సవాల్‌ సైతం విసిరారు.

సినిమా డైలాగులొద్దు..
ఇటీవల సీఎం విజయ్‌.. గత డీఎంకే ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి ఫైళ్లు తన వద్ద ఉన్నాయని అన్నారు. ఆ వ్యాఖ్యలను ఉదయనిధి ప్రస్తావిస్తూ.. ‘‘ఆ ఫైళ్లను బయటపెట్టండి. సినిమా పంచ్‌ డైలాగులు వద్దు’’ అంటూ విజయ్‌కు సవాల్‌ విసిరారు. ‘‘ఆధారాలు ఉంటే విడుదల చేయండి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోండి. డీఎంకే ఎలాంటి బెదిరింపులకు భయపడదు’’ అని అన్నారు.

నిర్మల్‌ వ్యాఖ్యలతో దుమారం.. 
సభలో మంత్రి సీటీఆర్‌ నిర్మల్‌ కుమార్‌ ఉదయనిధి స్టాలిన్‌ను ప్రస్తావిస్తూ తొలుత ‘‘గౌరవనీయ కరూర్‌ ఎమ్మెల్యే’’ అని అన్నారు. వెంటనే దాన్ని సరిదిద్దుతూ ‘‘కోయంబత్తూరు సౌత్‌ ఎమ్మెల్యే’’ అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలతో సీఎం విజయ్‌ సహా ఎమ్మెల్యేల్లో కొందరు నవ్వుకున్నారు. కరూర్‌కు గతంలో.. ప్రస్తుతం కోయంబత్తూరు సౌత్‌ ఎమ్మెల్యేగా ఉంది బాలాజీ సెంథిల్‌. అవినీతి ఆరోపణల్లో ఆయన అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కరూర్‌ గ్యాంగ్‌’ను డీఎంకే అధిష్టానం రక్షిస్తుందంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుంటారు. నిర్మల్‌ కుమార్‌ ఆ కోణంలోనే అలా మాట్లాడి ఉంటారని అంతా భావిస్తున్నారు.

అయితే నిర్మల్‌  స్పందించిన ఉదయనిధి వ్యంగ్యంగా.. ‘‘గౌరవనీయ సంఘీ మంత్రి’’ అంటూ వ్యాఖ్యానించి, ఆ వెంటనే  ‘‘విద్యుత్‌ మంత్రి’’ అని సరిదిద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలపై టీవీకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మల్‌ కుమార్‌ గతంలో.. బీజేపీకి పని చేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరి.. కిందటి ఏడాది టీవీకే కండువా కప్పుకున్నారు. బహుశా ఈ కోణంలోనే ఉదయనిధి  పంచ్‌ వేశారు.

అయితే.. ఈ సెటైర్ల సంగ్రామం ఇక్కడే ఆగిపోలేదు. నిర్మల్‌ కుమార్‌ మరోసారి లేచి.. ‘‘సాధారణంగా ఎవరైనా బాత్రూమ్‌లో 5 నుంచి 10 నిమిషాలు ఉంటారు. కానీ మూడు గంటలు బాత్రూమ్‌లో ఉన్న గౌరవనీయ మంత్రి’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

 కావేరీ నీటి వివాదం సమయంలో.. నటి త్రిష మీద ఉదయనిధి స్టాలిన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో.. ఉదయనిధిని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినప్పుడు ఆయన భార్య కిరుతిగా ‘‘ఆయన బాత్రూమ్‌లో ఉన్నారు.. కొంత సమయం ఇవ్వండి’’ అని చెప్పిన వీడియోలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ఉదయనిధిపై నెట్టింట ట్రోలింగ్‌ కూడా నడిచింది. ఆ ఘటనను ఉద్దేశించే నిర్మల్‌ కుమార్‌ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది.

 

దీనిపై ఉదయనిధి కూడా స్పందిస్తూ.. ‘‘బాత్రూమ్‌లో ఎవరు, ఎంతసేపు ఉంటారో లెక్కించే ప్రత్యేక శాఖను తమిళనాడులో ఏర్పాటు చేశారా?’’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో సభ తప్పుదోవ పడుతుందని గుర్తించిన స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌.. ఇరు పక్షాలను సముదాయించి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

మరి బంగ్లా ఎందుకో?
అయితే.. ఉదయనిధి వ్యాఖ్యలకు టీవీకే కీలక నేత, మంత్రి ఆధవ్‌ అర్జునా కౌంటర్‌ ఇచ్చారు. సీఎం విజయ్‌ ఎమ్మెల్యేలందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే కార్ల ప్రకటన చేశారని స్పష్టం చేశారు. చిన్న పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు వాహనం అవసరమని పేర్కొన్నారు. ఇది విలాసం కాదని, ప్రాథమిక అవసరమని అన్నారు.

‘‘ఇప్పటికే కారు ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వ వాహనానికి దరఖాస్తు చేయరు. టీవీకే విధానం స్పష్టంగా ఉంది. అందరికీ ఒకే విధమైన అవకాశం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం’’ అని ఆధవ్‌ అర్జునా తెలిపారు.

అదే సమయంలో ఉదయనిధిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘‘కారు వద్దంటున్న ప్రతిపక్ష నేత.. ఇప్పటికే మూడు బంగ్లాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఎందుకు ఉంటున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు వాహనాల కేటాయింపు అనేది ప్రోటోకాల్‌లో భాగమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: విజయ్‌ సరెండర్‌.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement