అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై వరుసగా మాట్లాడుతున్నారు. గత రెండేళ్లుగా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు, మానసిక వేధింపులు తనపై ఎంతటి ప్రభావం చూపాయో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలోనే మాజీ ప్రియుడి ప్రవర్తన కారణంగా ఒక నటిగా, మహిళగా తాను తీవ్రంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. తన మాజీ ప్రియుడు ప్రతిసారి తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడేవాడని తెలిపారు. తాను ఏదైనా విషయంపై అతడిని ప్రశ్నిస్తే.. ‘ఓహో.. నీకు పీరియడ్స్ సమయమా? ఇంకా రాలేదా? మూడ్ స్వింగ్స్ కదా’ అంటూ చులకనగా చూసేవాడని, ఇలాంటి మాటలు తనపై తీవ్ర ప్రభావం చూపించాయని చెప్పారు.
‘నేను నటినైనందుకు, ధైర్యంగా ఉన్నందుకు, ప్రతి నెలా పీరియడ్స్ వచ్చే ఒక మహిళనైనందుకు సిగ్గుపడే పరిస్థితిలోకి నెట్టేశాడు. ఆ మాటలు విన్న తర్వాత నాపై నాకే అసహ్యం వేసేది’అని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంబంధం తన వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కెరీర్‌పైనా ప్రభావం చూపిందని ఆమె వెల్లడించారు. షూటింగ్ సమయంలో కూడా ఆ బాధను నియంత్రించుకోలేక క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు.. చివరికి తన సొంత తమ్ముడితో చనువుగా ఉండటానికి కూడా భయపడే స్థాయికి తాను వెళ్లిపోయానని తెలిపారు.
‘ఒకప్పుడు నాకు పెద్ద కుటుంబం కావాలని, 11 మంది పిల్లలు ఉండాలని కలలు కనేదాన్ని. కానీ ఆ సంబంధంలో ఎదురైన అనుభవాల తర్వాత పిల్లలే వద్దనుకునే స్థాయికి నా ఆలోచనలు మారిపోయాయి. ఒక మహిళగా పుట్టినందుకే కదా ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది’ అనే భావన తనలో కలిగిందని అన్నారు.
అయితే, అనుపమ తన మాజీ ప్రియుడి పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆమె గతంలో ధ్రువ్ విక్రమ్‌తో ఉన్నట్లు ప్రచారం జరిగిన సంబంధాన్ని కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలకు ముడిపెడుతున్నారు. అయితే, అనుపమ మాత్రం తన మాజీ ప్రియుడి గుర్తింపును వెల్లడించలేదు. ఇటీవల బ్రేకప్ రూమర్లపై స్పందించిన ఆమె.. తన సోషల్ మీడియా పోస్టులు తన జీవితంలో ఓ మహిళగా తాను ఎదుర్కొన్న మార్పులు, స్వీయ అన్వేషణకు సంబంధించినవేనని స్పష్టం చేశారు.
ప్రేమమ్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’, ‘టిల్లు స్క్వేర్’, ‘డ్రాగన్’, ‘పరదా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.


