‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే..’ పాటను ఏఐ సాంకేతికతతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వైరల్ చేయడంపై చిత్ర పరిశ్రమ తీవ్రంగా స్పందిస్తోంది. మహిళలను కించపరిచేలా ఇలాంటి కంటెంట్ రూపొందించడాన్ని పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూ తదితరులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కథానాయిక జాన్వీ కపూర్ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
మహిళలను కించపరిచేలా కంటెంట్
‘ఏఐ సాంకేతికతను ఉపయోగించి మహిళలను కించపరిచేలా కంటెంట్‌ను రూపొందించి, ప్రచారం చేయడం అత్యంత అవమానకరమైన విషయం. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. ఇది లైంగిక వేధింపులకు ఏమాత్రం తీసిపోని తీవ్రమైన ఉల్లంఘన. చిత్ర పరిశ్రమలోని ప్రతి నటి ఏదో ఒక రూపంలో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటూనే ఉంది.
ఒక మహిళకు, ఆమె శరీరానికి గౌరవం ఇవ్వడం మానవత్వంలో అత్యంత ప్రాథమికమైన విషయం. ఒక మహిళ ‘వద్దు’ అని చెబితే ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలి? తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత హక్కు. ఒక మహిళ మినీ స్కర్ట్ ధరించిందని, ఆమెను అసభ్యకరంగా చిత్రీకరించడానికి అనుమతి ఇచ్చినట్లు కాదు’ అని జాన్వీ పేర్కొన్నారు.
కొన్ని రోజులుగా ఎదురైన ఏఐ వీడియోల సమస్య..
తనకు గత కొన్ని రోజులుగా ఎదురైన ఏఐ వీడియోల సమస్యకే ఈ విషయం పరిమితం కాదని ఆమె అన్నారు. ‘నా కెరీర్ మొత్తంలో వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అనుభవాలకు కూడా ఇది సంబంధించినదే. మహిళలను ఇబ్బందికరంగా చూడటం, వారిని జడ్జ్ చేయడం, భద్రత విషయంలో రాజీపడాలని ఒత్తిడి చేయడం, వారి హద్దులను నిర్ణయించడం వంటివి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నిజ జీవితంలో మహిళలను వెంటాడుతున్న ఈ భయాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా వచ్చాయి.
‘మీ కూతురిని కాపాడుకోండి
ఇలాంటి పరిస్థితుల్లో ‘మీ కూతురిని కాపాడుకోండి’ అని చెప్పడం మాత్రమే పరిష్కారం కాదు. కుటుంబ సభ్యుల ఆలోచనా విధానం, పిల్లల పెంపకం, మన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితుల్లో మార్పు రావాలి. ఏది సరైనది? ఏది తప్పు? అనే విషయాలను స్పష్టంగా చెప్పేందుకు పురుషులు కూడా ముందుకు రావాలి’’ అని జాన్వీ రాసుకొచ్చారు. ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన ఎన్టీఆర్‌కు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ‘తనకు నేరుగా సంబంధం లేని విషయం గురించి కూడా స్పష్టంగా మాట్లాడిన వ్యక్తిని లక్షలాది మంది అభిమానిస్తారు.
అలాంటి వ్యక్తి మహిళలకు మద్దతుగా నిలవడం ఎంతో ధైర్యాన్నిస్తుంది. అలాగే చిరంజీవి సర్, విజయ్, ఖుష్బూ మేడమ్ ఇలాంటి అనైతిక చర్యలను ఖండిస్తూ మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక మహిళను కేవలం ఒక మనిషిగా చూసి, గౌరవించాలని కోరుకోవడం నిజంగా అంత పెద్ద కోరికేనా?’ అని జాన్వీ ప్రశ్నించారు.
Thank You All :) https://t.co/HTkFRIVwtM
— Jahnavi Kapoor (@JanhvikapoorFC_) October 4, 2026


