విజయ్‌-త్రిష బంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు | Sanjjanaa Galrani Supports To Trisha And Vijay | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌ విషయంలో అదే జరుగుతోంది : నటి సంజన

Aug 20 2026 10:41 AM | Updated on Aug 20 2026 10:55 AM

Sanjjanaa Galrani Supports To Trisha And Vijay

విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హీరోయిన్‌ త్రిష పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్‌కు త్రిష సెల్యూట్‌ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా నటి సంజన స్పందించారు. విజయ్‌ పాలనపై మాట్లాడే ధైర్యం లేకే కొందరు వ్యక్తిగత అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆమె విమర్శించారు.

విజయ్‌ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సంజన ప్రశంసించారు. ప్రజా సమస్యలపై ఆయన వేగంగా స్పందిస్తూ.. తన పాలనతో ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. విజయ్‌ పరిపాలనలో లోపాలు చూపించలేకే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు.

‘విజయ్‌ రాష్ట్రాన్ని సమర్థంగా పరిపాలిస్తున్నారు కాబట్టి.. ఆయనపై ఆరోపణలు చేయలేకపోతున్నారు. వృత్తిపరంగా ఎలాంటి లోపాలు కనిపించనప్పుడు వ్యక్తిగత ఎజెండాను వెతకడానికి ప్రయత్నిస్తారు. వారి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కించపరచాలని చూస్తారు. విజయ్‌ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. మహిళలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి రాజకీయాలు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు’ అని సంజన వ్యాఖ్యానించారు.

ఇక త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఎంతో గొప్ప నటి అని సంజన అన్నారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు. విజయ్‌, త్రిష మధ్య ఉన్న బంధం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇద్దరి సాన్నిహిత్యాన్ని చూసి వారి బంధం గురించి ఓ నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడ్డారు. విజయ్‌ సీఎం అయిన తర్వాత త్రిష పేరు ఆయనతో ముడిపెట్టి సోషల్‌ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. సంజన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement