గ్రీకుల గర్భనిరోధక మొక్క.. రెండువేల ఏళ్ల తర్వాత ప్రత్యక్షం | 2000 Year Old Extinct Miracle Plant Silphium Rediscovered in Turkey | Sakshi
Sakshi News home page

గ్రీకుల గర్భనిరోధక మొక్క.. రెండువేల ఏళ్ల తర్వాత ప్రత్యక్షం

Aug 20 2026 9:55 AM | Updated on Aug 20 2026 10:02 AM

2000 Year Old Extinct Miracle Plant Silphium Rediscovered in Turkey

పురాతన కాలంలో రోమన్లు, గ్రీకులు, ఈజిప్షియన్లు ఔషధంగా, గర్భనిరోధకంగా విరివిగా ఉపయోగించి, దాదాపు రెండు వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయిందని భావించిన అద్భుత మొక్క ‘సిల్ఫియం’ మళ్లీ వెలుగుచూసింది. టర్కీలోని ఇస్తాంబుల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహ్ముత్ మిస్కీ దీనిని కనుగొన్నట్లు ప్రకటించారు. మెడిటరేనియన్ ప్రాంతంలో వేల ఏళ్ల క్రితం అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ పసుపు రంగు పూల మొక్కను ప్రాచీన కాలంలో అనేక వ్యాధుల నివారణకు, వంటకాల్లో, అలాగే గర్భనిరోధక సాధనంగా వినియోగించేవారు.

జూలియస్ సీజర్ కాలంలో వెండితో సమానమైన విలువ కలిగిన ఈ మొక్కను వేల కిలోల పరిమాణంలో బంగారంతో పాటు ఖజానాలో భద్రపరిచేవారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. తొలుత ఆధునిక లిబియా తీర ప్రాంతాల్లో పెరిగిన ఈ మొక్క, క్రీస్తుశకం మొదటి శతాబ్దం నాటికి క్రమంగా కనుమరుగైంది. రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ నమోదు చేసిన వివరాల ప్రకారం, చివరగా లభించిన ఒకే ఒక కాండాన్ని చక్రవర్తి నీరోకు బహుకరించారు. ఆ తర్వాత మూడు ఖండాల్లో అన్వేషించినా ఇది లభించకపోవడంతో, భూమిపై అంతరించిపోయిన తొలి జాతుల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది.

అయితే టర్కీలోని హసన్ పర్వతంపై లభించే ‘ఫెరులా డ్రూడియానా’ అనే మొక్కే ప్రాచీన ‘సిల్ఫియం’ అని ప్రొఫెసర్ మిస్కీ పేర్కొంటున్నారు. ప్రాచీన గ్రీకు నాణేలపై ఉన్న చిత్రాలు, పురాతన గ్రంథాల్లోని వివరణలతో దీని వేర్లు, పసుపు పూలు పూర్తిగా సరిపోలుతున్నాయని ఆయన తెలిపారు. క్యారెట్, పార్స్లీ కుటుంబానికి చెందిన ఈ మొక్కలో క్యాన్సర్ నిరోధక, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, గర్భనిరోధక గుణాలు కలిగిన 30 రకాల ద్వితీయ జీవక్రియ ఉత్పత్తులు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ప్రాచీన సిల్ఫియం మాదిరిగానే గొర్రెలు, మేకలు దీనిని ఎంతో ఇష్టంగా మేస్తాయని స్థానికులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: పాక్‌కు భారత్ బిగ్ షాక్.. హైకమిషన్ బారికేడ్లు ధ్వంసం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement