ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు అమెరికా ఇక నేరుగా రంగంలోకి దిగింది! టెహ్రాన్‌ను మాత్రమే కాదు.. దానికి అండగా నిలిచే దేశాలు, సంస్థలను కూడా టార్గెట్ చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. ఇరాన్‌కు డబ్బు అందించినా.. వ్యాపారం చేసినా.. చమురు తరలింపులో సహకరించినా భారీ ఆర్థిక మూల్యం చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పారు. ఇరాన్‌ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా వేరుచేసేలా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో టెహ్రాన్‌కు అండగా నిలిచే దేశాలపై కూడా అమెరికా ఆంక్షల పిడుగు పడబోతోందా? అన్న ఉత్కంఠ మొదలైంది.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన పోస్టులో.. ఇరాన్‌కు ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థలు ఎలాంటి సహాయం చేసినా ఆయా దేశాలు “భారీ ఆర్థిక పరిణామాలు” ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏ దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇరాన్‌కు సహాయం చేసే మార్గాలపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా హెచ్చరించారు. చమురు అక్రమ రవాణా, ఆర్థిక స్వాప్ ఒప్పందాలు, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, నౌకల రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీల ద్వారా టెహ్రాన్‌కు మద్దతు ఇచ్చినా అమెరికా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. అంటే ఇరాన్‌తో నేరుగా వ్యాపారం చేసే సంస్థలతో పాటు పరోక్షంగా ఆ దేశానికి ఆర్థిక చేయూత అందించే వ్యవస్థలపైనా అమెరికా కన్నేయనుంది.
ఇరాన్‌తో ఒప్పందం చేసుకునేందుకు తన ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ టెహ్రాన్ వాటిని ఉపయోగించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఇరాన్‌పై అపూర్వ స్థాయిలో ఆర్థిక యుద్ధం, అంతర్జాతీయ ఒంటరితనం ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. అమెరికా మిత్రదేశాలు కూడా ఈ చర్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ అన్నారు. ఆ దేశ నౌకాదళం ధ్వంసమైందని, వైమానిక దళం బలహీనపడిందని, సైనిక కర్మాగారాలు భారీగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉందని పేర్కొన్న ఆయన.. కొత్త చర్యలతో టెహ్రాన్ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం మరింత తగ్గిపోతుందని అన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమంపైనా ట్రంప్ మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేశారు. “ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు” అంటూ తన పరిపాలన వైఖరిని పునరుద్ఘాటించారు. ట్రంప్ తాజా హెచ్చరికతో ఇప్పుడు అసలు ప్రశ్న ఇరాన్ గురించే కాదు.. ఇరాన్‌కు అండగా నిలిచే దేశాల సంగతేంటి? అన్నదే. టెహ్రాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా చర్యలు మొదలుపెడితే అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. దీంతో ఇరాన్‌ను ఒంటరి చేయాలన్న ట్రంప్ వ్యూహం.. ఇప్పుడు ఆ దేశానికి మద్దతిచ్చే వారిని కూడా చుట్టుముట్టే స్థాయికి చేరిందా? అన్న చర్చ మొదలైంది.


