స్పేస్‌ వాక్‌... లోపాల యాంటెన్నా తొలగింపు! | ISS Antenna Replacement Delayed After Anil Menon, Sophie Adenot Face Spacewalk Challenges, More Details Inside | Sakshi
Sakshi News home page

స్పేస్‌ వాక్‌... లోపాల యాంటెన్నా తొలగింపు!

Aug 20 2026 5:36 AM | Updated on Aug 20 2026 11:02 AM

ISS Antenna Replacement Delayed After Spacewalk Challenges

కొత్తది అమర్చేందుకు సమయాభావం 

భవిష్యత్తులో ఏర్పాటు చేస్తాం: నాసా 

విజయవంతంగా అనిల్‌ మీనన్‌ రెండో స్పేస్‌వాక్‌ 

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి సమాచారం పంపించేందుకు అవసరమైన యాంటెన్నాను మార్చే పని వాయిదా పడింది. తాజా స్పేస్‌ వాక్‌ ద్వారా వ్యోమగాములు అనిల్‌మీనన్, సోఫీ అడెనాట్‌లు ఈ యాంటెన్నాను మార్చాల్సి ఉన్నప్పటికీ తగినంత సమయం లేకపోవడంతో వాయిదా వేయాల్సి వచి్చంది. 

బుధవారం సుమారు ఆరుగంటల 23 నిమిషాల సమయం వీరిద్దరూ స్పేస్‌వాక్‌లో భాగంగా లోపాలతో కూడిన యాంటెన్నాను తొలగించడంలో విజయం సాధించారు కానీ మార్చడం మాత్రం కుదరలేదు. భారతీయ సంతతికి చెందిన అనిల్‌ మీనన్‌కు ఇది రెండో స్పేస్‌ వాక్‌ కాగా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన సోఫీకి మొదటిది. అయితే స్పేస్‌ వాక్‌ చేపట్టిన తొలి ఫ్రాన్స్‌ వ్యోమగామిగా సోఫీ రికార్డు సృష్టించింది.  

సక్రమంగా పనిచేయని యాంటెన్నాను తొలగించడం, కొత్తదాన్ని బిగించడం అన్న రెండు లక్ష్యాలతో ఇద్దరు వ్యోమగాములు తమ స్పేస్‌వాక్‌ను ప్రారంభించారు. అయితే విద్యుత్తు, డేటా కనెక్టర్లు బిగుసుకుపోయి ఉండటంతో తొలగింపు ఆలస్యమైంది. అంతేకాకుండా.. యాంటెన్నాలోని గింబల్‌ అసెంబ్లీలో లాకింగ్‌ పిన్స్‌ బిగించడం, యాంటెన్నాను బిగించిన బోల్టులను తొలగించడంలోనూ జాప్యం జరగడంతో కొత్త యంటెన్నా ఏర్పాటుకు సమయం దొరకలేదు. రాచెట్‌ సాయంతో యాంటెన్నాను తొలగించేందుకు వారు చాలా శ్రమించడాన్ని కూడా నాసా స్క్రీన్లపై కనిపించింది.

 ఈ నేపథ్యంలో పాడైన యాంటెన్నాను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు, కొత్త యాంటెన్నాను తీసుకుని బిగించేందుకు తగినంత సమయం లేదని మిషన్‌ కంట్రోల్‌ నిర్ణయించింది. కొత్త యాంటెన్నా బిగింపు భవిష్యత్తులో చేపడతామని నాసా ప్రకటించింది. హ్యూస్టన్‌లోని మిషన్‌ కంట్రోల్‌ నుంచి డేటా ప్రసారానికి ఈ యాంటెన్నా చాలా కీలకం. అయితే స్పేస్‌ టు గ్రౌండ్‌ యాంటెన్నా సాయంతో ఐఎస్‌ఎస్‌ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని నాసా తెలిపింది. ఐఎస్‌ఎస్‌ నిర్మాణం, నిర్వహణల్లో తాజా స్పేస్‌ వాక్‌ 282వది కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement