వాషింగ్టన్: దాదాపు మూడు దశాబ్దాలుగా నాసాలో సేవలందించిన సీనియర్ వ్యోమగామి మైక్ ఫింకె నాసాకు వీడ్కోలు పలికారు. ఆగస్టు-12 బుధవారంతో నాసాలో ఆయన సేవలు ముగిశాయని అమెరికా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. అయితే అంతరిక్ష పరిశోధనలు, అన్వేషణలో తన వంతు పాత్ర కొనసాగిస్తానని ఫింకె తెలిపారు.
1996లో నాసా వ్యోమగాముల బృందంలో చేరిన ఫింకె.. తన సుదీర్ఘ కెరీర్‌లో నాలుగు అంతరిక్ష యాత్రలు చేశారు. మొత్తం 549 రోజులు అంతరిక్షంలో గడిపిన ఆయన.. నాసా వ్యోమగాముల్లో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నారు. అలాగే తొమ్మిది సార్లు స్పేస్‌వాక్ నిర్వహించారు. ఆయన కెరీర్‌లో ఎక్కువ సమయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోనే గడిచింది.
అంతరిక్ష కేంద్రంలో అకస్మాత్తుగా అస్వస్థత..
ఇటీవల ఫింకె చేపట్టిన చివరి అంతరిక్ష యాత్ర మాత్రం అనూహ్య పరిణామాలతో ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఓ వైద్య సమస్య తలెత్తింది. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయినట్లు ఫింకె స్వయంగా వెల్లడించారు. ఆయన పరిస్థితిని గమనించిన సహచరులు వెంటనే స్పందించారు. కొన్ని సెకన్లలోనే మొత్తం బృందం అప్రమత్తమై వైద్య సహాయం అందించిందని ఆయన తెలిపారు. అయితే ఈ అస్వస్థతకు అసలు కారణం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదని, నాసా మరియు వైద్య పరిశోధకులు దానిపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
ముందుగానే భూమికి తిరుగు ప్రయాణం
ఫింకెతో పాటు స్పేస్‌ఎక్స్ క్రూ-11లో ఉన్న మరో ముగ్గురు సభ్యులు -నాసా వ్యోమగామి జీనా కార్డ్‌మన్, జపాన్‌కు చెందిన కిమియా యుయి, రష్యాకు చెందిన ఒలెగ్ ప్లాటోనోవ్ అనుకున్న సమయం కంటే కొన్ని వారాల ముందుగానే భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రంలో అందుబాటులో లేని అధునాతన వైద్య ఇమేజింగ్ సదుపాయాలను భూమిపై ఉపయోగించేందుకు సిబ్బందిని ముందుగానే వెనక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు నాసా తెలిపింది. ఈ ఘటన కారణంగా అంతరిక్ష కేంద్రంలో సిబ్బంది నిర్వహించాల్సిన ఓ స్పేస్‌వాక్‌ను కూడా రద్దు చేశారు. అలాగే, ఆరోగ్య కారణాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సిబ్బంది యాత్రను నాసా ముందుగానే ముగించాల్సిన పరిస్థితతి రావడం ఇదే తొలిసారి.
అంతరిక్ష సేవలకు కొనసాగింపు..
నాసా నుంచి వైదొలుగుతున్నప్పటికీ అంతరిక్ష అన్వేషణకు తన నిబద్ధత కొనసాగుతుందని ఫింకె పేర్కొన్నారు. భవిష్యత్‌లో చంద్రుడిపైకి మానవులను తిరిగి పంపడం, అంగారక గ్రహానికి ప్రయాణాలు, సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు, ఉపగ్రహాల అన్వేషణ వంటి కార్యక్రమాల్లో మానవాళి మరింత ముందుకు సాగుతుందని ఆయన ఆకాంక్షించారు.


