చాలా మంది తమ చిన్నతనం నుంచి కన్న కలలను సాకారం చేసుకుంటూ.. తమకు నచ్చిన వృత్తిని ఎంచుకుంటారు. అయితే.. ఫ్లైదుబాయ్ ఫ్లైట్ FZ1073లో.. గాలిలో కోపైలట్ చేతిలో కత్తిపోటుకు గురైనప్పటికీ, 174 మంది ప్రయాణికులను సమర్థంగా కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ మాత్రం పైలట్ కావడం తన చిన్ననాటి కల కానే కాదంటున్నారు. ఫ్లైదుబాయ్ ఘటన తర్వాత గూగుల్, సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారిన స్మిత్ మచ్చర్ జీవితంలో ఎన్నెన్నో మలుపులున్నాయి. గత ఏడాది యూట్యూబర్ జలక్ మెహతాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిట్ ఆ విశేషాలను పంచుకున్నారు.
స్మిత్ మచ్చర్ కుటుంబానికి వస్త్రవ్యాపారం నేపథ్యం ఉంది. అందుకే స్మిత్ కూడా చిన్నతనం నుంచి తన కుటుంబ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కలలు కనేవాడు. అందుకే ఆయన టెక్స్‌టైల్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత సమర్థంగా వ్యాపారాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ముంబైలోని వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చేరి, తన స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. కానీ, మేనేజ్‌మెంట్ కోర్సులో భాగంగా విమానయానానికి సంబంధించిన ఓ సెమినార్‌కు హాజరైన స్మిత్ ఆ క్షణంలో తాను 9750 ఫ్లైయింగ్ గంటల మేర వాణిజ్య విమానాలను నడుపుతానని కలలో కూడా ఊహించలేదు. అప్పుడు అతని వయసు 19 సంవత్సరాలు. ఆ ఒక్క సెమినార్ అతని లక్ష్యాన్ని నిర్దేశించింది.
దాంతో అతను పైలట్ శిక్షణ కోసం న్యూజిలాండ్ వెళ్లారు. శిక్షణ ముగియగానే.. అంటే.. 2011లో ఆయన స్పైస్‌జెట్‌లో చేరారు. అంతే.. అక్కడి నుంచి తిరిగి వెనక్కి చూడలేదు. బోయింగ్ 737లో మొదటి సారి కోపైలట్‌గా తన జర్నీని ప్రారంభించారు. ఆ విమానం బెంగళూరు-ఢిల్లీ మధ్య తిరిగేది. స్పైస్ జెట్‌లో ఆయన 11 సంవత్సరాలు సేవలందించారు. అక్కడే కెరీర్ ప్రారంభించిన స్మిట్.. క్రమంగా సీనియర్ కమాండర్ ర్యాంక్‌కు.. ఆ తర్వాత.. అంటే 2020లో లైన్ ట్రైనింగ్ కెప్టెన్ పదవులను అధిరోహించారు.
బోయింగ్ 737 విమానాల్లో 737-800, 737 మ్యాక్స్ 8, 9 విమానాల్లో స్మిట్‌కు 9,750 గంటల ప్రయాణ అనుభవం ఉంది. స్పైస్ జెట్ కెరీర్ లో 6,400 గంటలకు పైగా పైలట్-ఇన్-కమాండ్ గా పనిచేశారు. జూన్ 20221లో ఆయన డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా ఫ్లైదుబాయ్‌లో చేరారు. ఆయన గత ఏడాది ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్‌లో.. ఫ్లైట్ ప్రయాణికుల్లో డాక్టర్లు ఉండడం ఎంత అవసరమో వివరించారు. ‘‘మనం గాల్లో ఉన్నప్పుడు అనుకోనిది జరిగితే..? పరిస్థితి ఏమిటి? ప్రయాణికుల్లో డాక్టర్లు, నర్సులు ఉంటే ఆ ఆపద తొలుగుతుంది. వారు వైద్యంలో బాగా శిక్షణ పొందినవారు. అలాంటి వారు ఎప్పుడూ ఫ్లైట్‌లో ఉంటారని చెప్పలేం’’ అని ఆ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు.
సరిగ్గా ఏడాది గడిచాక.. అలాంటి అనుభవాన్నే ఆయన ఎదుర్కొన్నారు.దుబాయ్ నుంచి టెల్‌అవీవ్ వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసేందుకు యత్నించిన ఒమన్ జాతీయుడైన కోపైలట్.. అతణ్ని కత్తితో పొడిచాడు. ఫ్లైట్‌లో ఉన్న వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. ఆ క్షణంలో వైద్యులు లేకపోతే పరిస్థితి ఏంటి? గాల్లో 14వేల అడుగలకు పడిపోయిన విమానాన్ని తిరిగి నడిపించేవారే ఉండేవారు కాదు. అప్పటికే ఆయన హైజాక్ కోడ్‌ను విడుదల చేశారు. ప్రథమ చికిత్సతో కాస్త ఓపిక తెచ్చుకున్న స్మిత్ .. ఆ విమానాన్ని సురక్షితంగా సౌదీలోని తబుక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయగలిగారు. ప్రస్తుతం సౌదీ ఆస్పత్రిలో స్మిత్ కోలుకుంటున్నారు. 174 మంది ప్రాణాలను కాపాడిన స్మిత్.. మన భారతీయుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది కదా? స్మిత్ సాహసంపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


