అణ్వాయుధాలపై జపాన్‌లో సంచలనం.. రక్షణ మంత్రి కీలక పిలుపు | Japan Calls For Taboo-Free Debate On Acquiring Nuclear Weapons Amid Rising Security Threats, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అణ్వాయుధాలపై జపాన్‌లో సంచలనం.. రక్షణ మంత్రి కీలక పిలుపు

Oct 1 2026 6:58 PM | Updated on Oct 1 2026 7:09 PM

Japan says its time taboo free discussions acquiring nuclear weapons

టోక్యో: చైనా, రష్యా, ఉత్తర కొరియాతో భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాలను సమకూర్చుకునే అంశంపై జపాన్‌లో బహిరంగ చర్చ జరగాలని ఆ దేశ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి పిలుపునిచ్చారు. భద్రతకు సంబంధించిన ఏ అవకాశాన్నీ ముందుగానే తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.

“ఈ అంశంపై చర్చించడానికి కూడా అనుమతి లేదనే ఆలోచన.. నా భావనకు కొంత విరుద్ధంగా ఉంది” అని సోమవారం టీవీ ఇంటర్వ్యూలో కొయిజుమి వ్యాఖ్యానించారు. అణు విధానంపై ఎలాంటి నిషేధాలు లేకుండా ఉండాలన్న విషయంపై చర్చించాలని ఆయన అన్నారు. ఇందులో జపాన్‌ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న అణురహిత విధానాలను పునఃపరిశీలించడం, అణుశక్తితో నడిచే జలాంతర్గాములను సమకూర్చుకునే అవకాశాన్ని పరిశీలించడం కూడా ఉన్నాయని తెలిపారు.

జపాన్‌ 3 సూత్రాలు ఏవి? 
జపాన్‌ 1967లో ఆమోదించిన మూడు అణురహిత సూత్రాల ప్రకారం.. అణ్వాయుధాలను కలిగి ఉండటం, తయారు చేయడం, దేశ భూభాగంలోకి వాటిని అనుమతించడం నిషేధం. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని కొయిజుమి స్పష్టం చేశారు. అయితే అన్ని అవకాశాలపై చర్చ పూర్తయ్యే వరకు వాటిని పక్కన పెట్టకూడదన్నారు. జపాన్‌ రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడికి గురైన ఏకైక దేశమని గుర్తుచేస్తూ, మారుతున్న భద్రతా పరిస్థితిని ప్రజలకు జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

“జపాన్‌ చుట్టూ ఉన్న భద్రతా పరిస్థితిపై ఆశావహంగా ఉండేందుకు అసలు ఎలాంటి కారణాలు లేవని చెప్పడం సురక్షితమే” అని కొయిజుమి పేర్కొన్నారు. చైనా, రష్యా అణు సామర్థ్యాలు, ఉత్తర కొరియా పెంచుకుంటున్న అణ్వాయుధ నిల్వలను ప్రస్తావించారు. ఫ్రాన్స్‌ అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు, ఫిన్లాండ్‌ తన భూభాగంలో అణ్వాయుధాల మోహరింపునకు చట్టపరమైన మార్పులు చేయడాన్ని కూడా ఆయన ఉదాహరణగా చూపారు.

ఈ ఏడాది చివరినాటికి జపాన్‌ ప్రభుత్వం 3 కీలక జాతీయ భద్రతా పత్రాలను సవరించనుంది. ఈ ప్రక్రియలో అణురహిత సూత్రాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అణ్వాయుధాలను దేశంలోకి అనుమతించకూడదనే 3వ సూత్రంపై చర్చ పెరిగింది. ప్రధాని సనాయే తకాయిచి మాత్రం జపాన్‌ ఆ సూత్రాలను కొనసాగిస్తోందని, అణ్వాయుధాలు లేని ప్రపంచానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే కొత్త భద్రతా పత్రాల్లో ఈ సూత్రాలను స్పష్టంగా చేర్చుతారా అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు.

ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రపంచం ​కోల్డ్‌ వార్‌ తర్వాత అత్యంత ప్రమాదకరమైన అణు పరిస్థితిని ఎదుర్కొంటోందని హెచ్చరించారు. అణ్వాయుధ నిల్వలు పెరుగుతూ, ఆధునికీకరణకు గురవుతున్నాయని చెప్పారు. జపాన్‌ ఐక్యరాజ్యసమితి రాయబారి కజుయుకి యమజాకి మాత్రం సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందానికి దేశం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక జపాన్‌ అణు విధానంపై ప్రభుత్వం చేపట్టే భద్రతా పత్రాల సమీక్ష కీలకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement