నిధులిస్తూనే... కళ్ళేలూ వేయాలి! | Sakshi Guest Column On Space launch vehicle, Deep tech sector | Sakshi
Sakshi News home page

నిధులిస్తూనే... కళ్ళేలూ వేయాలి!

Oct 1 2026 12:49 AM | Updated on Oct 1 2026 12:49 AM

Sakshi Guest Column On Space launch vehicle, Deep tech sector

విశ్లేషణ

పునర్వినియోగానికి వీలైన అంతరిక్ష వాహక నౌకను (ఆర్‌ఎల్వీ) లేదా రాకెట్‌ను తయారు చేయడం అత్యంత క్లిష్టమైన, అదే సమయంలో అత్యంత వాంఛనీయమైన విషయం. అటువంటి పనికి అగ్ని కుల్‌ కాస్మోస్‌ అనే ప్రైవేటు అంతరిక్ష సంస్థ శ్రీకారం చుట్టింది. దానికయ్యే వ్యయంలో రూ. 200 కోట్లను పంచుకునేందుకు శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ (డీఎస్టీ) ఇటీవల ఆ సంస్థతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. పరిశోధన–అభివృద్ధికి చెందిన నవీకరణ (ఆర్డీఐ) నిధి నుంచి డీఎస్టీ ఆ ద్రవ్యాన్ని అందించనుంది. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే తయారీ, ప్రయోగ వ్యయాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. అంతరిక్షంలో శకలాల బెడదను కూడా పనిలో పనిగా తగ్గించుకున్నట్లవుతుంది. 

పుష్పక్‌–అగ్నిబాణ్‌
ఈ విషయంలో చైనా, జపాన్‌ ముందడుగు వేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో, భారత్‌ కూడా ఆ దిశగా నడుం బిగించింది. పునర్వినియోగ రాకెట్‌ టెక్నాలజీని చైనా ఈ ఏడాది జూలైలో ప్రదర్శించింది. లాంగ్‌ మార్చ్‌ 10బి రాకెట్‌ ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత, ఆ రాకెట్‌కు చెందిన మొదటి దశను చైనా రికవర్‌ చేయగలిగింది. నియమిత వేగంతో సముద్రంలోని ఒక వేదికపై దిగేటట్లుగా ఆ రాకెట్‌కు రూపకల్పన చేశారు. దాంతో ఆర్బి టల్‌–క్లాస్‌ రాకెట్‌ను నిలువుగా దిగేటట్లు చేసిన ఘనతను, అమెరికా తర్వాత సాధించిన రెండవ దేశంగా చైనా అవతరించింది. ఎలాన్‌ మస్క్‌ నెలకొల్పిన స్పేస్‌ ఎక్స్‌ అటువంటి ల్యాండింగ్‌లను డజన్లకొద్దీ ప్రదర్శించి, అంతరిక్ష రవాణా ఖర్చును తగ్గించుకుంది. 

చైనా జెండా ఎగరేసిన కొద్ది రోజుల తర్వాత, తన ఆర్‌ఎల్వీ నమూనాను జపాన్‌ పరీక్షించింది. ఫ్రాన్స్‌, జర్మనీ అంతరిక్ష సంస్థ లతో కలసి జపాన్‌ అంతరిక్ష సంస్థ మిత్సుబిషి సంయుక్తగా ఆ ప్రోటోటైప్‌ను తయారు చేసి ప్రయోగించి చూసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆర్‌ఎల్వీ ప్రాజెక్టునకు 2012లో ఆమోదం లభించింది. అప్పటి నుంచి అటాన మస్‌ ల్యాండింగ్, సూపర్‌ సోనిక్‌ ఫ్లైట్, పవర్డ్‌ క్రూజ్‌ ఫ్లైట్‌ వంటి వివిధ టెక్నాలజీలను ఇస్రో అభివృద్ధి చేసి, ప్రయోగాల ద్వారా వాటిని మదింపు చేసింది. ఈ ఆర్‌ఎల్వీకి 2024లో పుష్పక్‌ అని పేరు పెట్టారు. అగ్నికుల్‌ సంస్థ రాకెట్‌ను అగ్నిబాణ్‌గా పిలుస్తున్నారు. 

ప్రైవేటుకు మద్దతు ఇస్తారు సరే...
ఇపుడు అగ్నికుల్‌కు రూ. 200 కోట్ల ఆర్థిక మద్దతు అందించేందుకు ముందుకు రావడం వల్ల, ప్రభుత్వానికి చెందిన ఒక పరిశోధన–అభివృద్ధి సంస్థతో ప్రత్యక్షంగా పోటీపడుతున్న ఒక ప్రైవేటు కంపెనీకి, బహుశా మొదటిసారిగా, ప్రభుత్వం చేదోడుగా నిలుస్తోందనే అభిప్రాయం కలుగవచ్చు. కానీ, ఇక్కడో సంగతి గుర్తుంచు కోవాలి. ఒక ప్రైవేటు సంస్థకు నిధులిస్తున్నంత మాత్రాన ఇస్రో ఆర్‌ఎల్వీ ప్రాజెక్టును ఆకలితో అలమటింటేటట్లు చేయడం కాదు. ఒక్కొక్క మైలురాయిని చేరుకుంటున్న కొద్దీ దానికి నిధులు అందు తూనే ఉంటాయి. పైగా, ఈ రెండు ఆర్‌ఎల్వీ ప్రాజెక్టులను సరి పోల్చడం సమంజసం కాదు. అవి రెండూ భిన్నమైన టెక్నాలజీ రూపాలను అనుసరిస్తున్నాయి. తుది వినియోగంలో కూడా తేడాలుండవచ్చు. అయినా, ఇస్రోకు చెందిన ఆర్‌ఎల్వీ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని తగ్గించే అభిమతం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడం మంచిది. ప్రైవేటుకు ద్వారాలు తెరవడంపై సైంటిస్టుల యూనియన్ల నుంచి ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఇది మరింత అవసరం. 

జాతీయ ప్రాధాన్యం కలిగిన డీప్‌ టెక్నాలజీ విభాగంలో రెండు సమాంతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సమతూకంతోనే వ్యవహరిస్తూ ఉండవచ్చు. పెట్టుబడులను అమలు పరచే తీరు కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వ నిధులను అంత పెద్ద యెత్తున అందుకుంటున్న ప్రైవేటు ప్రాజెక్టు అగ్నికుల్‌ ఒక్కటే కాదు. గణనీయంగా నిధులు అందించే మరో రెండు ఒప్పందాలపై కూడా ఇటీవల సంతకాలు జరిగాయి. బెంగళూరుకు చెందిన గెలాక్స్‌ ఐ స్పేస్‌ సొల్యూషన్స్‌కు రూ. 63.84 కోట్లు అందనున్నాయి. అది హై–రిజొల్యూషన్‌ ఇమేజింగ్‌ సామర్థ్యం కలిగిన మల్టీ–సెన్సర్‌ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయనుంది. ఎయిర్‌ ట్యాక్సీగా ఉపయోగించదగిన చిన్న ఎలక్ట్రిక్‌ విమానాన్ని తయారు చేసేందుకు (అయ్యే మొత్తం రూ. 570 కోట్ల వ్యయంలో) యుబిఫ్లై టెక్నాలజీస్‌కు రూ. 285 కోట్లు ఇవ్వనున్నారు. 

ఇలాంటి ప్రాజెక్టులు చాలావాటికి ప్రభుత్వమిచ్చే నిధుల వాటా, వాటి మొత్తం వ్యయంలో దాదాపు 50 శాతం మేరకు లేదా అంతకుమించి ఉంటోంది. ఈక్విటీ రూపంలో ఈ నిధులు అందిస్తే కనుక, ఆ అంకుర సంస్థలలో ప్రభుత్వం మెజారిటీ వాటాదారు అవుతుంది. వాటి పాలనలోనూ దాని మాటకు విలువ ఉంటుంది. కానీ, ప్రభుత్వం వాటికిస్తున్న నిధులు ఐచ్ఛిక పరివర్తనీయ రుణ పత్రాల రూపంలో ఉంటున్నాయి. అంటే, ప్రభుత్వం ఆ ద్రవ్యాన్ని అప్పుగా ఇస్తోందన్నమాట. మున్ముందు దాన్ని ఈక్విటీగా మార్చు కుంటే మార్చుకోవచ్చు. 

వ్యాక్సీన్‌ కంపెనీల గుణపాఠం
రుణ రూపంలో ఆది మూలధనాన్ని ప్రభుత్వం సమకూర్చి నప్పటికీ, ప్రైవేటు కంపెనీలు సాదారణంగా వాటి ఇన్వెస్టర్లకు, వాటాదారులకు జవాబుదారీగా ఉంటాయి. ప్రభుత్వం మాట విని తీరాలన్న రూలేమీ లేదు. లాభాలు గడించేందుకు విలీనాలు, టెక్నా లజీ బదలాయింపులు వంటివాటికెళ్ళడం ప్రైవేటురంగంలో సాధారణం. ఇక్కడే చిక్కుంది. డీఎస్టీ సమకూర్చే ప్రజా నిధులతో ఒక వ్యూహాత్మక టెక్నాలజీని అభివృద్ధి చేసిన కంపెనీని రేపు ఏ బహుళజాతి కంపెనీయో లేదా అంతకన్నా పెద్ద ప్రత్యర్థి సంస్థో స్వాధీనం చేసుకుంటే, ప్రభుత్వ నిధులతో వ్యూహా త్మక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడంలోని ప్రయోజనమే దెబ్బ తినవచ్చు. 

వ్యాక్సీన్ల తయారీలో 1990ల చివరలో ఇలాంటి పరిస్థితే ఉత్పన్నమైంది. ఇపుడు అగ్నికుల్, యుబిఫ్లైలకు డీఎస్టీకి చెందిన ఏ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డు అయితే నిధులు ఇస్తోందో అదే బోర్డు, బహుళజాతి టీకా సరఫరాదారుల గుత్తాధిపత్యాన్ని బ్రేక్‌ చేసేందుకు, బయోటెక్‌ అంకుర సంస్థలకు నిధులు ఇచ్చింది. పరిశోధన–అభివృద్ధికి డీఎస్టీ ఉదారంగా ఇచ్చిన గ్రాంట్లతో రెండు భారతీయ కంపెనీలు హెపటైటిస్‌ వ్యాక్సీన్‌ ధరలను అంతర్జాతీయంగా విజయవంతంగా తగ్గించగలిగాయి. అయితే, ఆ తర్వాత, ఆ రెండు కంపెనీల్లో ఒకదానిని ఒక పోటీదాయక బహుళజాతి సంస్థ స్వాధీనం చేసుకుంది. డీఎస్టీకానీ, ప్రభుత్వంకానీ దాన్ని ఆపలేకపోయాయి. ఒక ముఖ్యమైన అవసరాన్ని తీర్చే సామర్థ్యాన్ని నిర్మించడంలో ప్రభుత్వ తోడ్పాటును అందుకున్న సంస్థ చివరకు ఒక బహుళజాతి వ్యాక్సీన్‌ కంపెనీ పరమైంది. డీప్‌ టెక్‌ రంగంలో మనం తిరిగి అలాంటి స్థితిలో చిక్కుకోకూడదు. ఏ ప్రైవేటు ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తున్నా ప్రభుత్వం తప్పనిసరిగా కొన్ని నియంత్రణలు చేతిలో పెట్టుకుని సమతుల్యతలను పాటించాలి. ఎందుకంటే, నిధుల స్థాయులు, ఇమిడివున్న టెక్నాలజీల వ్యూహాత్మక ప్రాధాన్యం రెండింటిలోనూ పెడుతున్న పణం ఎక్కువగా ఉంది. 

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement