జెరూసలేం: అమెరికన్లు, ఇజ్రాయిల్ దేశస్థులే లక్షంగా చేసుకొని విమానాలపై దాడులు చేయాలని ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా తన అనుకూల పత్రిక ద్వారా బహిరంగంగా పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఫ్లై దుబాయ్ కాక్‌పిట్ దాడి ఉదంతం, అలాగే చారిత్రాత్మక 9/11 ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ ఈ తాజా బెదిరింపులకు పాల్పడింది.
జూలైలో ఆల్‌ఖైదా అనుకూల మద్దతుదారులు ప్రారంభించిన ‘అల్బయాన్’ వారపత్రిక తాజా సంచికలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో-పైలట్ హమాం అల్ హమామి, భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కాక్‌పిట్‌లో జరిగిన దాడిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. 2001, సెప్టెంబర్ 11 నాటి దాడుల తరహాలోనే విమానాలను హైజాక్ చేయడం, కూల్చివేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడాలని పిలుపునిచ్చింది.
అరబిక్ కథనంలోని హెచ్చరికలు ఏంటంటే?
అల్బయాన్ పత్రికలోని అరబిక్ కథనంలో యుద్ధం ఇంకా ముగియలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జియోనిస్టులు, అమెరికన్లు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న వారు ప్రయాణిస్తున్న విమానాలు ఇప్పటికీ ఆకాశంలోనే ఉన్నాయి. 9/11 జరిగినట్లుగా వాటిని ఎప్పుడైనా లక్ష్యంగా చేసుకోవచ్చు అని అందులో పేర్కొన్నారు. ఈ బెదిరింపు సందేశంతో పాటు న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌ను విమానం ఢీకొంటున్న 9/11 నాటి చిత్రంతో పాటు, ఫ్లై దుబాయ్ ఘటనను సూచించే గ్రాఫిక్స్ ప్రచురించడం కలకలం రేపుతోంది.
కో-పైలట్ ఉగ్ర నేపథ్యంపై ముమ్మర దర్యాప్తు
సెప్టెంబర్ 30 నాటి ఘటనలో విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించి ప్రస్తుతం యూఏఈ అధికారుల అదుపులో ఉన్న కో-పైలట్ హమాం అల్ హమామి నేపథ్యంపై ఇప్పుడు తీవ్రమైన దర్యాప్తు జరుగుతోంది. అంతకుముందు ఒమన్ ఎయిర్‌లో పనిచేసిన సమయంలో ఇతని తీవ్రవాద భావజాలం కారణంగా అధికారులు పక్కన పెట్టినట్లు సమాచారం వెలువడింది.
అంతేకాకుండా, అతని సోషల్ మీడియా ఖాతాలలో ఒసామా బిన్ లాడెన్, అయమాన్ అల్ జవహరీ వంటి ఆల్‌ఖైదా అగ్రనేతలకు సంబంధించిన కంటెంట్ లభించడంతో ఈ కుట్ర కోణంపై నిఘా వర్గాలు కూపీ లాగుతున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ విమానయాన భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుండగా, ఇజ్రాయెల్, అమెరికా సహా పలు దేశాల భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.


