ఉక్రెయిన్‌లో భారతీయ కంపెనీపై విరుచుకుపడ్డ రష్యా డ్రోన్లు | Indian Run Pharma Plant In Ukraine Destroyed In Russian Drone Attacks | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో భారతీయ కంపెనీపై విరుచుకుపడ్డ రష్యా డ్రోన్లు

Oct 4 2026 1:44 PM | Updated on Oct 4 2026 2:00 PM

Indian Run Pharma Plant In Ukraine Destroyed In Russian Drone Attacks

ఉక్రెయిన్‌లోని భారత్‌కు చెందిన కుసుమ్ గ్రూప్ ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్లు దాడి చేశాయి. సుమీ నగరంలో జరిగిన ఈ దాడిలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ దాడుల కారణంగా ఫార్మా ప్లాంట్‌లోని ప్రధాన భవనం భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ప్లాంట్ నుంచి పొగ భారీగా వ్యాపించింది.

కుసుమ్ గ్రూప్ 1994లో ఉక్రెయిన్‌కు భారతీయ ఔషధాలను ఎగుమతి చేసే డిస్ట్రిబ్యూటర్‌గా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థను భారతీయుడు రాజీవ్ గుప్తా నిర్వహిస్తున్నారు. 2002లో ఇతర కంపెనీల ఔషధాల పంపిణీని నిలిపివేసిన కుసుమ్ గ్రూప్.. సొంత బ్రాండ్లను మార్కెట్ చేయడం ప్రారంభించింది. అనంతరం ఔషధాల తయారీ రంగంలోకి ప్రవేశించింది. 2007లో భారత్‌లో తొలి తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. 2009లో ఉక్రెయిన్‌లోని సుమీలో మరో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత భారత్‌లో మరో రెండు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం ఈ సంస్థ 50కి పైగా ప్రధానంగా జనరిక్ ఔషధాలను తయారు చేస్తోంది. ఉక్రెయిన్‌తో పాటు ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, ఫిలిప్పీన్స్ తదితర తొమ్మిది దేశాలకు పైగా వీటిని విక్రయిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ సుమీ ప్లాంట్ ఇన్నాళ్లూ కార్యకలాపాలను కొనసాగించింది. అయితే తాజా డ్రోన్ దాడులతో ప్లాంట్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం విలువ కనీసం రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. ఉక్రెయిన్ ఈ వారంలో తొలిసారిగా దేశీయంగా తయారు చేసిన ఎఫ్‌పీ-7 బాలిస్టిక్ క్షిపణిని యుద్ధంలో ఉపయోగించినట్లు ప్రకటించింది. ఈ క్షిపణి సుమారు 250 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలదని సమాచారం.

ఇదీ చదవండి: అమెరికా రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement