పల్లెల్లోనూ అదే పైత్యం | TDP continues to attack YSRCP ranks in the Panchayat elections | Sakshi
Sakshi News home page

పల్లెల్లోనూ అదే పైత్యం

Nov 16 2026 2:59 AM | Updated on Nov 16 2026 3:07 AM

TDP continues to attack YSRCP ranks in the Panchayat elections

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని సిబ్యాలలో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలు

మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల తరహాలో పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ దాష్టీకం

వైఎస్సార్‌సీపీకి బలమైన గ్రామాలే లక్ష్యంగా అడ్డగింతలు, దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు

చంద్రబాబు పాలనలో ఎన్నికల్లో పోటీ చేసే పౌర హక్కుకు సంకెళ్లు

అభ్యర్థులను అడ్డుకునేందుకు బయటి ప్రాంతాల నుంచి రౌడీ మూకల దిగుమతి     

నామినేషన్‌ కేంద్రాల వద్ద మకాం.. పోలీసుల కళ్లెదుటే దౌర్జన్యం  

అభ్యర్థులకు రక్షణ కచాల్సిందిపోయి బాధితులపైనే కళ్లెర్రజేస్తున్న పోలీసులు 

పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్‌ బాంబులు, మారణాయుధాలు 

నరసరావుపేట మండలం ఇస్సపాలెంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జి 

ఇస్సపాలెం, పెట్లూరివారిపాలెంలో నామినేషన్లు వేయకుండా అడ్డగింత 

రాయచోటి నియోజకవర్గంలో స్వయంగా ప్రత్యర్థుల నామినేషన్‌ పత్రాలు చించేసిన మంత్రి మండిపల్లి  

నామినేషన్లు వేయడానికి వచ్చిన మహిళా అభ్యర్థులపైనా దాడులు   

శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న అరాచకం.. టీడీపీ మూకల స్వైర విహారం

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించిన అధికార టీడీపీ ముఠా పల్లెపోరులోను పేట్రేగిపోతోంది. సుప్రీంకో­ర్టు ఆదేశాలను, హైకోర్టు సూచనలను సైతం బేఖా­తరు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పచ్చ మూకలు చెలరేగిపోతున్నాయి. తొలుత మున్సిపల్‌ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను ప్రయోగించి బైండోవర్లు, నామినేషన్లు అడ్డుకోవడం, పరిశీలనలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నామినేషన్‌ లేకుండా చేయడం, బలవంతంగా నామినేషను ఉపసంహరించుకునేలా బెదిరించడం.. పోలింగ్, కౌంటింగ్‌ రోజున ఏకపక్షంగా వ్యవహరించి అడ్డగోలుగా విజయాన్ని చేజిక్కించుకున్న విష­యం తెలిసిందే. ఇప్పుడు ఇదే పంథాను పంచా­యతీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తోంది. పోలీసులను ప్రయోగించి దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసుల­తో ఈ ఎన్నికల్లో సైతం రెచ్చిపోతోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 23 పుర/నగర పాలక సంస్థలకు, పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఆదివారం అనేక చోట్ల నామినేషన్లు వేయనీయకుండా పచ్చ మూకలు చెలరేగిపోయాయి. అధికార టీడీపీకి ఎదురు నిలిచే అభ్యర్థులను గుర్తించి అడ్డుకోవడం, వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న గ్రామా­ల నామినేషన్‌ కేంద్రాల వద్ద బయటి ప్రాంతాల మూకలను మోహరించడం, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై ఒత్తిడి తేవడం ప్రతి జిల్లాలోనూ కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో స్వేచ్ఛగా నామినేషన్‌ వేయ­డం కూడా నేరంగా మారిందా? అని రాష్ట్రంలోని ప్రజలు మండిపడుతున్నారు. 

రాయచోటి మండలం సిబ్యాల గ్రామంలో ప్రతిపక్ష మద్దతుదారులపై దాడికి కట్టెలు, రాడ్లతో పరుగులు తీస్తున్న టీడీపీ మూకలు 

అభ్య­ర్థికి నామినేషన్‌ దాఖలు చేసే రాజ్యాంగ బద్ధమైన హక్కును కాపా­డాల్సిన పోలీసులు అధికార పార్టీకి జీ హుజూర్‌ అంటున్నారు. పోటీ చేసే పౌర హక్కు­ను కాలరాసే పచ్చ మూకలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నా­రని ఎస్‌ఈసీని ప్రశ్నిస్తు­న్నారు. రాయలసీమ జిల్లా­లతో పాటు పల్నాడులో వైఎస్సా­ర్‌­సీపీ అభ్యర్థులను నామినేషన్‌ దశలోనే అణచి వేసే­లా పచ్చ రౌడీలు దౌర్జన్యాలు, దాడులు చేయడం ఎంత మాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తు­న్నా­రు. నామినేషన్‌ దశ నుంచే ప్రతిపక్షాన్ని అడ్డుకుని, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి పోటీ నుంచి తప్పించడం, అధికార పార్టీకి అనుకూల వాతా­వరణం సృష్టించడం వంటివి ప్రజాస్వామ్యాన్ని ఖూ­నీ చేయడమేనని విశ్లేషకులు తప్పు పడుతున్నారు.  

పల్నాడు జిల్లా విప్పర్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పెట్రోల్‌ బాంబులు 

పల్నాడులో పచ్చమూకల ముట్టడి?
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం నామినే­షన్‌ కేంద్రాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్‌సీపీకి బలమైన గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో బయటి ప్రాంతాల నుంచి టీడీపీ మూకలను తీసుకొచ్చారు. దీనిపై పా­లపాడు వైఎస్సార్‌సీపీ నాయకులు సత్యనారాయణ­రెడ్డి, చెంచురెడ్డి, టీడీపీ అసమ్మతి నేత సామిరెడ్డి నరసరావు­పేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నామినేషన్లను అడ్డుకునేందుకు బయట ప్రాంతాల నుంచి వ్యక్తులు వస్తున్నారని పోలీసుల దృష్టికి తీసు­కెళ్లారు. 

వైఎస్సార్‌సీపీకి బలమైన ఉప్ప­లపాడు, చి­న్నతురకపాలెం, గోనేపూడి గ్రామాలకు ఎలమంద నామినేషన్‌ కేంద్రంగా ఉంది. ఈ కేంద్రా­న్ని లక్ష్యంగా చేసుకుని ఎలమందలోని కళ్యాణ మండపంలో మాచర్ల ప్రాంతానికి చెందిన సుమారు వంద మంది రౌడీషీటర్లు, అసాంఘిక మూకలు మకాం వేసినట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎ­న్నికల నా­మినేషన్‌ కేంద్రానికి ఇంత భారీగా బయటి వ్యక్తులు ఎందుకు వచ్చారు? వారి వెనుక ఎవరి అండ ఉంది? అన్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమా­ధానం చెప్పాల్సి ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పల్నాడు జిల్లా ఇస్సపాలెంలో ప్రతిపక్షం బలపరిచిన అభ్యర్థులపై లాఠీచార్జి చేస్తున్న ఎస్‌ఐ కిషోర్‌ 

పోలీసుల ముందే అడ్డగింతలు.. బాధితులపైనే లాఠీలు?
పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ తొలిరోజే నరస­రావుపేటలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. వైఎ­స్సా­ర్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను నామినేషన్‌ వేయ­కుండా పోలీసుల అండతో అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్‌­లను తీసుకొచ్చి నామినేషన్‌ కేంద్రాల వద్ద మోహ­రించారు. దీంతో నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పించాలని ఇస్సపాలెంలో ములకలూ­రు గ్రామ­స్తులు రాస్తారోకో నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లికి ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌ చేసినా ఆయన నుంచి స్పందన లేదు. ములకలూరు పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ కేంద్రాన్ని టీడీపీకి బలమైన గ్రామంగా ఉన్న ఇస్సపాలెంలో ఏర్పాటు చేశారు.

అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో పచ్చమూకల దాడిలో గాయపడ్డ ఉసేన్‌మియా  

వైఎస్సార్‌సీపీ బలపరిచిన ములకలూరు సర్పంచి అభ్యర్థి షేక్‌ మస్తాన్‌బీతో పాటు వార్డు సభ్యులు, మద్దతుదారులు నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇస్స­పాలేనికి వచ్చారు. వీరిని టీడీపీ మూకలు నామినే­షన్‌ కేంద్రంలోకి వెళ్లనివ్వలేదు. పోలీసుల్ని వేడుకు­న్నా వారు స్పందించకపోవడంతో నరసరా­వుపేట­–సత్తెనపల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు. నా­మినేషన్‌కు అవకాశం కల్పిస్తామని పోలీసులు చెప్ప­డంతో ఆందోళన విరమించారు. అనంతరం నామి­నే­షన్‌ కేంద్రం వైపునకు వెళ్లగా, అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న వంద మందికి పైగా టీడీపీ గూండాలు దాడికి ప్రయత్నించారు. 

నామినేషన్‌ పత్రాల­ను లాక్కుని చించివేశారు. ఈ అన్యాయంపై నిలదీ­యడంతో పోలీసులు బాధితులపైనే లాఠీచార్జ్‌ చేశా­రు. రూరల్‌ ఎస్‌ఐ వీరిని అడ్డుకుని నామినేషన్‌ వేయినిచ్చేది లేదని చెప్పారు. మాట్లాడుకుని రాజీ కావాలని చెబుతూ అక్కడి నుంచి బలవంతంగా పంపించివేశారు. కాకానిలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన పెట్లూరివారిపాలెం సర్పంచి అభ్యర్థి కందుకూరి వెంకాయమ్మ, బలపరిచే అభ్యర్థి సరిమెళ్ల నాగయ్యపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి.

పల్నాడు జిల్లా ఇస్సపాలెంలో నామినేషన్‌కు అనుమతించాలంటూ ఎస్‌ఐ కిషోర్‌కు దండంపెట్టి వేడుకుంటున్న అభ్యర్థి 

నామినేషన్‌ పత్రాలు సమర్పించి రుసుం చెల్లించిన తరువాత పచ్చమూకలు కేంద్రంలోకి ప్రవేశించాయి. సర్పంచి అభ్యర్థి వద్ద నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారు. నాగయ్యపై దాడికి పాల్ప­డ్డారు. సుమారు గంట పాటు నామినేషన్‌ కేంద్రంలోనే వారిని నిర్బంధించారు. ఇదంతా పోలీసుల సాక్షిగా జరుగుతున్నా వారు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. కాకాని గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెల­కొంది. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైఎస్సా­ర్‌సీపీ బలపరిచిన అభ్యర్థి నుంచి పత్రాలను లాక్కొని కూ­ట­మి నేతలు చించి­వేయడం వివాదానికి దారితీసింది. 50 మందికిపైగా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తిష్ట వేయడం కలకలం రేపుతోంది. 

విప్పర్లలో పెట్రోల్‌ బాంబులు.. మారణాయుధాలు
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లలో ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నామినేషన్‌ వేయడానికి కేంద్రానికి వచ్చిన టీడీపీలోని ఇమ్మిడిశెట్టి కాసయ్య, రామిశెట్టి కోటయ్య వర్గాలు ఒక్కసారిగా నామినేషన్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఓ వర్గం నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించగా, మరో వర్గం దాన్ని అ­డ్డుకునేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇరు­వ­ర్గాల మధ్య మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది. 

పల్నాడు జిల్లా కాకానిలో నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పెట్లూరివారిపాలెం అభ్యర్థి వెంకాయమ్మ 

అనంతరం మారణాయుధాలతో పరస్ప­రం దాడులకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అదనపు ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి ఘటనా స్థలానికి చేరుకొని అనుమానిత ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. నామి­నేషన్‌ కేంద్రానికి కూతవేటు దూరంలోని టీడీపీ నేత గుండా సత్యనారాయణ ఇంట్లో పెట్రోల్‌ బాంబు­లు, కత్తులు, బాంబుల తయారీకి వినియోగించే ము­డి పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకు­న్నా­రు. ఏఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు.

నామినేషన్‌ వేయకుండా వెనుతిరిగిన పల్నాడు జిల్లా ములకలూరు అభ్యర్థి షేక్‌ మస్తాన్‌బీ 

శ్రీకాళహస్తిలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
» శ్రీకాళహస్తి మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలోనూ టీడీపీ మూకలు రెచ్చిపోయా యి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేసి పైకి విసురుతూ రాక్షసానందం పొందారు. టీడీపీ మూకల దౌర్జన్యంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆ వీడియోలను పంపి ఫిర్యాదు చేశారు. ఆదివారం టీడీపీ గూండాలు భారీగా శ్రీకాళహస్తికి చేరుకున్నారు. ఒక్కో నామినేషన్‌ కేంద్రం వద్ద 200 నుంచి 500 మంది చొప్పున మోహరించారు. ఈ క్రమంలో 10వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. అభ్యర్థి చేతిలో ఉన్న నామినేషన్‌ పత్రాలను లాగేసుకుని చింపేశారు.     

» శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పెద్దకన్నలి నామినేషన్‌ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తకండ్రిగ సర్పంచ్‌ అభ్యర్థి రామచంద్రారెడ్డి, వార్డు మెంబర్లు నామినేషన్‌ వేసేందుకు పెద్దకన్నలి కేంద్రా­నికి చేరుకున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న టీడీపీ మూకలు వారిని అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు రమేష్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారు. అంతటితో ఆగని టీడీపీ మూకలు సుబ్బరాయు­డురెడ్డిపై దాడిచేశారు. అడ్డుకునేందుకు ప్రయ­త్నించిన వారిపైనా దాడులకు తెగబడ్డారు. 

»  శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి నామినేషన్‌ కేంద్రం వద్ద స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పీఏ శ్రీనివాసులు సర్పంచ్‌ అభ్యర్థి వద్ద ఉన్న ఇంటిపన్ను రసీదును లాక్కుని చించివేశారు. అంతకు ముందు రోజు అక్కుర్తి సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు ఇంటి పన్ను రసీదు కోసం పంచాయతీ సెక్రెటరీని కలిశారు. పన్ను రసీదు ఇచ్చి కావాలనే సంతకం చేయకుండా పంపివేసినట్లు తెలిసింది. సెక్రటరీ సంతకం లేదని సర్పంచ్‌ అభ్యర్థి గ్రహించారు. మళ్లీ సెక్రటరీని కలిసి ఇంటిపన్ను రసీదుపై సంతకం తీసుకుని నామినేషన్‌ కేంద్రానికి చేరుకు­న్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే పీఏ ఆ రసీదును బలవంతంగా లాక్కుని చించి­వేశా­డు. ఆపై అభ్యర్థిపైనా, వారి కుటుంబ సభ్యుల­పైన దౌర్జన్యానికి దిగాడు.

» టీడీపీ గూండాల అరాచకాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, భూమ­న అభినయరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రం సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

రాయచోటిలో మంత్రి మండిపల్లి అరాచకం
» స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్ర­బాబు ఇస్తున్న డైరెక్షన్‌లో పచ్చముఠాలు బరితెగిస్తున్నాయనేందుకు మంత్రి రాంప్రసాద్‌ తీరు అద్దం పడుతోంది. ఓటమి భయంతో ప్రజా తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక ప్రత్యర్థు­లను పోటీకి దూరం చేయడమే లక్ష్యంగా కుట్రలకు తెరతీశారు. 

» అన్నమయ్య జిల్లా రాయచోటిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల మొదటి రోజున మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, ఆయన అను­చరులు అరాచకాలు, దౌర్జన్యాలతో బీభత్సం సృష్టించారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులపై రెచ్చిపోయారు. మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి, ఆయన సోదరుడు లక్ష్మీప్రసాద్‌ రెడ్డిల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ రౌడీ మూకలు విచక్షణ రహితంగా, విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డాయి. ఆది­వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్‌ కేంద్రాల వద్ద దాడులు, దౌర్జన్యా­లు దాష్టీకాలకు ఒడిగట్టారు. 

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో టీడీపీ గూండాల అరాచకాలపై డీఎస్పీ కృష్ణమోహన్‌ను నిలదీస్తున్న వైఎస్సార్‌సీపీ నేత జల్లా సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ అభ్యర్థులు 

» లక్కిరెడ్డిపల్లి, రామాపురం, రాయచోటి మండ­లాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాల్లోకి మంత్రి మండిపల్లి స్వయంగా వెళ్లి హల్‌చల్‌ చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట నామినేషన్ల కేంద్రంలోకి వెళ్లి దప్పేపల్లి పంచాయతీకి దాఖలైన వైఎస్సార్‌సీపీ మద్దతు­దారుల నామినేషన్లను చింపేశారు. రామా­పురం మండలం చిట్లూరు, రాయచోటి మండలం సిబ్యాల నామినేషన్ల కేంద్రాల్లోకి వెళ్లి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అడ్డుకో­వా లంటూ తన పార్టీ నాయకులకు హుకుం జారీ చేశారు. కోనంపేట పంచాయతీ పరిధిలో వార్డులకు నామినేషన్లు వేయడానికి వచ్చిన మహిళలపై టీడీపీ మూకలు నడిరోడ్డుపై దాడులకు తెగబడ్డాయి. 

అన్నమయ్య జిల్లా గాలివీడు గోరాన్‌ చెరువులో టీడీపీ మూకల దౌర్జన్యం 

» గాలివీడు మండలం వెలిగల్లులో మంత్రి సోద­రుడు లక్ష్మీప్రసాద్‌ రెడ్డి రౌడీయిజం చేశారు. తూముకుంట సర్పంచ్‌ స్థానానికి దాఖలు చేస్తు­న్న వారి నామినేషన్లను లాక్కొని చించేశారు. నూలివీడులో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను నామి­నేషన్ల కేంద్రాల వద్దకు రానివ్వకుండా వంద లాది మంది టీడీపీ గూండాలు స్వైర విహారం చేశారు. వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు సుదర్శన్‌ రెడ్డి ఇంటిపై పచ్చ గూండాలు దాడికి తెగబడ్డారు.

» రాయచోటి మండల పరిధిలోని సిబ్యాల నామి­నేషన్‌ కేంద్రానికి వస్తున్న పెమ్మాడపల్లి వైఎస్సా­ర్‌సీపీ మద్దతుదారులైన సర్పంచ్‌ అభ్యర్థులపై వందల మంది టీడీపీ గూండాలు కర్రలు, రా­డ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో పలు­వురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. చెన్నముక్కపల్లి, మాధవరం నామినేషన్‌ కేంద్రం వద్ద వందలాది మంది టీడీపీ గూండాలు, గంజాయి బ్యాచ్‌తో వైఎస్సార్‌సీపీ మద్దతుదా­రు­లను రానివ్వకుండా పహారా కాశారు. సంబేపల్లి మండలం గిరిగింజకుంట నామినేషన్‌ కేంద్రం వద్ద గున్నికుంట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతు దారులను టీడీపీ గూండాలు రానివ్వలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

» మంత్రి సొంత మండలం అయిన చిన్నమండెం మండలంలో నామినేషన్ల ప్రక్రియ భయం భయంగా సాగింది. మండల వ్యాప్తంగా ఉన్న నామినేషన్ల కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు, గంజాయి బ్యాచ్‌లు తిష్ట వేసి, నామినేషన్‌ వేసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాకుండా అడ్డుకున్నాయి. విచ్చలవిడిగా తిరుగుతున్న రౌడీ మూకలను నివారించాల్సిన పోలీసులు ఏమాత్రం స్పందించక పోవడంపై ప్రజలు ఎక్కడికక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఇంతగా రెచ్చిపోతుంటే వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఆర్‌ రమేష్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ లీగల్‌ సెల్‌ నేత జల్లా సుదర్శన్‌ రెడ్డిని ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement