దుబాయ్: భారతీయ స్టార్టప్‌లను యూఏఈ వ్యాపార, పెట్టుబడి వ్యవస్థతో అనుసంధానించేందుకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)కు చెందిన సెంట్రల్ ‘డెస్టినేషన్ ఎక్స్‌పాండ్ నార్త్ స్టార్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపికైన 100 మంది భారతీయ స్టార్టప్ వ్యవస్థాపకులకు దుబాయ్‌లో వారం రోజులపాటు వ్యాపార అవకాశాలు, పెట్టుబడిదారులతో సమావేశాలు, అంతర్జాతీయ మార్కెట్ పరిచయం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని భారతదేశానికి విస్తరించే క్రమంలో చెన్నై, బెంగళూరు, కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం నగరాల్లో సెంట్రల్ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. కేరళ ప్రభుత్వానికి చెందిన ఇన్ఫోపార్క్, సైబర్‌పార్క్, టెక్నోపార్క్, కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్‌తో పాటు హైలైట్ బిజినెస్ పార్క్, కాఫిట్, జీ-టెక్ తదితర సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాయి. స్టార్టప్ తమిళనాడుతో భాగస్వామ్యంపైనా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
దుబాయ్ మార్కెట్‌తో నేరుగా అనుసంధానం
ఎంపికయ్యే స్టార్టప్‌లకు దుబాయ్‌లోని కస్టమర్లు, కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులతో నేరుగా సమావేశమయ్యే అవకాశం లభిస్తుంది. తద్వారా భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను గల్ఫ్ మార్కెట్‌కు పరిచయం చేయడంతోపాటు యూఏఈ నుంచి ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించే అవకాశాలను అన్వేషించవచ్చు.
కార్యక్రమంలో ఎంపికైన 100 మంది వ్యవస్థాపకులు దుబాయ్‌లో జరిగే గైటెక్స్ గ్లోబల్, ఎక్స్‌పాండ్ నార్త్ స్టార్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందుతారని సెంట్రల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రఫీజ్ రహ్మతుల్లా తెలిపారు. సెంట్రల్ హబ్‌ను ఉపయోగించుకుని తమ కార్యకలాపాలను విస్తరించుకునే అవకాశాలు కూడా కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
డిసెంబరులో ఎక్స్‌పాండ్ నార్త్ స్టార్ 2026
ఎక్స్‌పాండ్ నార్త్ స్టార్ 2026 కార్యక్రమం డిసెంబర్ 8 నుంచి 10 వరకు దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీ దుబాయ్‌లో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ వ్యవస్థాపకులు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం.
ఈ ఏడాది కార్యక్రమంలో AI, డీప్‌టెక్, క్లైమేట్ టెక్, హెల్త్‌టెక్, కొత్త పెట్టుబడి మార్గాలు, GCC సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో స్టార్టప్‌ల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
కాగా, సెంట్రల్ దుబాయ్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తూ రెండు కొత్త బిజినెస్ సెంటర్లను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో భారతీయ స్టార్టప్‌లకు దుబాయ్‌లో తాత్కాలిక వ్యాపార ప్రవేశం నుంచి స్థానికంగా కార్యకలాపాలు ఏర్పాటు చేసుకునే వరకు మరింత విస్తృతమైన అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.


