వాడేసిన రాకెట్‌ మళ్లీ ల్యాండైంది  | China Successfully Lands Zhuque-3 Rocket Booster in Reusable Launch | Sakshi
Sakshi News home page

వాడేసిన రాకెట్‌ మళ్లీ ల్యాండైంది 

Aug 20 2026 5:42 AM | Updated on Aug 20 2026 5:42 AM

China Successfully Lands Zhuque-3 Rocket Booster in Reusable Launch

చైనా కంపెనీ ఘనత 

చివరి క్షణంలో మంటలు 

తరువాత కుప్పకూలిపోయింది! 

బీజింగ్‌: రాకెట్ల పునర్వినియోగం విషయంలో చైనా కీలకమైన ముందడుగు వేసింది. మొట్టమొదటిసారి వాడేసిన ఒక రాకెట్‌ తొలిదశను భూమిపై సేకరించి వెనక్కు తీసుకు రాగలిగామని చైనా మీడియా బుధవారం తెలిపింది. అయితే ల్యాండ్‌ అయిన కొంత సేపటికి ఈ రాకెట్‌ దశ నుంచి మంటలు చెలరేగడంతో ప్రయోగం విజయవంతంపై కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. 

ఝూక్యూ–3ని బుధవారమే ప్రయోగించగా ఆ తరువాత ఎక్కడో పడిపోయిన రాకెట్‌ తొలిదశ గోబీ ఎడారి ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. కానీ అందులోని ఇంధనం మండిపోయింది. అడుగు భాగం నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో కార్బన్‌ ఫైబర్‌తో తయారైన నాలుగు కాళ్లు బలహీన పడినట్లు తెలిసింది. బూస్టర్‌ కూడా మంటల్లో చిక్కుకుపోవడంతో అది కుప్పకూలినట్లు సమాచారం. 

మిన్‌కిన్‌ ప్రాంతంలో ఈ రాకెట్‌ దశ ల్యాండైన వీడియోలో ముందు బూస్టర్‌ నిట్టనిలువుగా ల్యాండ్‌ అయిన దృశ్యాలు కనిపించాయి. నేలవాలడం పూర్తయి అది నాలుగు ల్యాండింగ్‌ కాళ్లపై నిలబడింది కూడా. అయితే కొంత సమయం తరువాత మాత్రం మంటలంటుకున్నట్లు తెలిసింది. ల్యాండ్‌ స్పేస్‌ అనే ప్రైవేట్‌ సంస్థ ఈ రాకెట్‌ను తయారు చేసింది. డాంగ్‌ఫెంగ్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగికేగిన తరువాత 137 సెకన్లకు రాకెట్‌ రెండోదశ విడిపోయింది. తరువాతి దశ రాకెట్‌ ద్వారా హోంఝూ–03 ఉపగ్రహం కక్ష్యలోకి విజయవంతంగా చేరడం విశేషం.  

ఈలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ 2015 నుంచి వాడేసిన రాకెట్‌ దశలను మళ్లీ సేకరిస్తోంది. తద్వారా ప్రయోగాల ఖర్చును తగ్గించుకుంటోంది. చైనా బుధవారం సేకరించిన రాకెట్‌ దశలో ల్యాండింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం విశేషం. పునర్వినియోగ రాకెట్ల విషయంలో ఇదో పెద్ద విజయమని చైనా మీడియా సంస్థలు ప్రకటించాయి. ఈ ఏడాది జూలై పదవ తేదీ చైనా వాడేసిన రాకెట్‌ దశను సముద్ర ఉపరితలంపై నుంచి ఒడిసిపట్టుకున్న విషయం తెలిసిందే. లాంగ్‌మార్చ్‌–10 ప్రయోగం తరువాత విడిపోయిన రెండో దశ సముద్ర ఉపరితలంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థకు చేరింది. ఆ తరువాతి రోజు అంటే జూలై 11న జపాన్‌ మొట్టమొదటి పునిర్వనియోగ రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement