ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ‘జల్ బోర్డు’ మంటలు రాజుకున్నాయి. సెవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయన్న కేసులో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ కావడంతో.. ఇప్పుడు చర్చ అంతా ఎంపీ రాఘవ్ చద్దా చుట్టూనే తిరుగుతోంది. గతంలో DJB వైస్ చైర్మన్‌గా పనిచేసిన చద్దాను ఈ కేసుతో ఎందుకు ముడిపెడుతున్నారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే చద్దా వర్గాలు మాత్రం ఒక్క టైమ్‌లైన్‌తోనే ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. “అక్రమాలు జరిగినట్లు చెబుతున్న సమయానికి ఆయన పదవిలోనే లేరు” అనేది వారి వాదన.
అయితే చద్దా సన్నిహిత వర్గాలు మాత్రం ఆరోపణలను ఖండించాయి. చద్దా 2020 మార్చి 2 నుంచి 2022 మార్చి 3 వరకు ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్‌గా పనిచేశారని తెలిపాయి. ఆ పదవికి రెండేళ్ల కాలపరిమితి ఉంటుందని, 2022 మార్చిలోనే ఆయన ఢిల్లీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారని పేర్కొన్నాయి. అంటే.. చద్దా DJB వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న దాదాపు ఏడు నెలల తర్వాత ఈ వ్యవహారం జరిగినట్లు పేర్కొన్నాయి. ఈ టైమ్‌లైన్ చూస్తే చద్దాను కేసుతో ముడిపెట్టే ప్రయత్నం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆరోపించాయి.
ఆప్ ఆరోపణలు..
కాగా, ఆప్ నేత ప్రియాంక కక్కర్ మాత్రం.. “ఈ అక్రమాలకు రాఘవ్ చద్దానే కారణమని గతంలో బీజేపీ ఆరోపించింది. మరి ఆయనను ఎందుకు విచారించలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు?” అని ప్రశ్నించారు. బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీంతో సత్యేంద్ర జైన్ అరెస్ట్ వ్యవహారం కాస్తా.. రాఘవ్ చద్దా పాత్రపై పొలిటికల్ వార్‌గా మారిపోయింది. ఇక, దర్యాప్తు సంస్థ వివరాల్లో అప్పటి జలవనరుల మంత్రి, DJB ఎక్స్-అఫీషియో చైర్మన్, అప్పటి CEO, కన్సల్టెంట్, చీఫ్ ఇంజినీర్, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల పాత్రను ప్రస్తావించినట్లు చద్దా వర్గాలు చెబుతున్నాయి. అయితే రాఘవ్ చద్దాకు ఎలాంటి పాత్రను కేటాయించలేదని పేర్కొంటున్నాయి. రాజకీయ ఆరోపణల్లో పేరు ప్రస్తావించడం వేరు.. దర్యాప్తులో నిందితుడిగా తేలడం వేరు అని చద్దా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు DJB కేసులో ఏముంది?
ఢిల్లీ జల్ బోర్డు పరిధిలోని సెవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల విస్తరణ, ఆధునికీకరణకు సంబంధించిన టెండర్లలో నిబంధనలను మార్చడం, టెండర్ ప్రక్రియను ప్రభావితం చేయడం, అధికారులు-కన్సల్టెంట్లు-ప్రైవేటు సంస్థల మధ్య కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ డైరెక్టరేట్ ఫిర్యాదుతో 2024 మే 11న కేసు నమోదైంది. ఈ కేసులో ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ ఆరుగురిని అరెస్ట్ చేసింది. వారిలో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, మాజీ డీజీబీ CEO ఉదిత్ ప్రకాశ్ రాయ్ కూడా ఉన్నారు.
రూ.60 వేల కోట్ల స్కామ్?
ఇక ఈ కేసును బీజేపీ మరింత పెద్ద రాజకీయ అంశంగా మార్చింది. డీజేబీ ఖాతాలను పదేళ్లుగా ఆడిట్ చేయలేదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా ఆరోపించారు. దాదాపు రూ.60 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ పూర్తి దర్యాప్తు నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, బాన్సురీ స్వరాజ్ సహా పలువురు నేతలు గత ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యమునా ప్రక్షాళన కోసం ఖర్చు చేయాల్సిన ప్రజాధనం అవినీతికి గురైందని ఆరోపించారు. అయితే, చివరకు సత్యేంద్ర జైన్ అరెస్ట్‌తో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు రాఘవ్ చద్దా చుట్టూ కొత్త రాజకీయ మలుపు తీసుకుంది. దర్యాప్తులో బయటకు వచ్చే ఆధారాలే ఈ వివాదానికి అసలు సమాధానం చెప్పాల్సి ఉంది.


