డీఎన్‌ఏ పరీక్షకు ఆమోదించడం అంత ఈజీ కాదు | DNA Test Not a Routine Option in Paternity Disputes Kerala High Court | Sakshi
Sakshi News home page

డీఎన్‌ఏ పరీక్షకు ఆమోదించడం అంత ఈజీ కాదు

Oct 5 2026 2:52 PM | Updated on Oct 5 2026 3:08 PM

DNA Test Not a Routine Option in Paternity Disputes Kerala High Court

వివాహ బంధంలో పుట్టిన చిన్నారి పితృత్వంపై అనుమానం వ్యక్తం చేసినంత మాత్రాన డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తలు బిడ్డను కనే అవకాశం ఉన్న సమయంలో ఒకరినొకరు శారీరకంగా కలిసే అవకాశం లేదని చూపించే నిర్దిష్ట వాదనలు, ప్రాథమిక ఆధారాలు ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. జస్టిస్‌ జాబిన్‌ సెబాస్టియన్‌ ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించారు.

కేసు నేపథ్యం

ఈ కేసులో దంపతుల మధ్య వివాదం నేపథ్యంలో పుట్టిన చిన్నారికి డీఎన్‌ఏ పరీక్ష జరిపించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తును వడక్కంచెరి మేజిస్ట్రేట్ కోర్టు గతంలో తిరస్కరించింది. ఆ ఉత్తర్వును సవాలు చేస్తూ బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ జోబిన్ సెబాస్టియన్.. ‘గర్భధారణ సమయంలో భార్యాభర్తల మధ్య ఎటువంటి సంబంధం లేదని నిరూపించే ఎలాంటి బలమైన ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచలేదు. అలాంటప్పుడు సాక్ష్యాధారాల చట్టం ప్రకారం వివాహ బంధంలో పుట్టిన బిడ్డ చట్టబద్ధమైన సంతానమే అవుతుంది’ అని పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ కోర్టు నిర్ణయంలో ఎలాంటి చట్టపరమైన లోపం లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. భర్త మరో వాదనలో మధ్యవర్తిత్వ సమయంలో ఇరుపక్షాలు డీఎన్‌ఏ పరీక్షకు అంగీకరించారని పేర్కొన్నాడు. కానీ ఆ అంగీకారం ఉన్నంత మాత్రాన డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే, చెల్లుబాటు అయ్యే వివాహ బంధం కొనసాగుతున్న సమయంలో పుట్టిన బిడ్డకు చట్టబద్ధతపై బలమైన ప్రిసమ్షన్‌(ఊహ) ఉంటుందని కోర్టు గుర్తుచేసింది. భార్యాభర్తలకు సంబంధిత సమయంలో పరస్పర సహవాసం జరగలేదని చూపితేనే ఈ ఊహను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇరుపక్షాల మధ్యవర్తిత్వ ఒప్పందం ఉన్నంత మాత్రాన చట్టానికి, ప్రజా విధానానికి విరుద్ధమైన ఆదేశాన్ని కోర్టు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పితృత్వ నిర్ధారణ కంటే గృహహింస కేసులో చట్టపరమైన ఉపశమనాలే ప్రధాన అంశాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: పసిడి ధరలపై ఓ లుక్కేయండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement