ఓ తల్లి పిల్లల కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోగలదని. వాళ్లని పోషించుకోవడమే ఆమె ధ్యేయం అని చాటిచెప్పిన ఉదంతం. అంతేగాదు సమానత్వ హక్కు ప్రాముఖ్యత తోపాటు తన ఉపాధి హక్కుని ఎలా పొందాలో చెప్పే ఉదంతం. తలుచుకుంటే ఒక సామాన్యురాలు సైతం చట్టాన్నే మార్చగలదని, ఏకంగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆమెకు మద్దతిస్తుందని నిరూపించిన కేసు ఇది.
అసలేం జరిగిందంటే..కేరళలోని ఇరింజలకుడకు చెందిన గృహకార్మికురాలు సోఫియా కుంజిపాలు. ఆమె భర్త ఒక కల్లు దుకాణంలో మేనేజర్‌గా పనిచేసేవారు. అయితే 2024లో ఆయన గుండెపోటుతో మరణించారు. దాంతో ఇంటి భారం తనపై పడటంతో ఆయన పనిచేసే చోటే తను కూడా ఉపాధి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ దుకాణం లైసెన్సుదారుడిని ఆ విషయమై అడిగారు. తన భర్త ఉద్యోగాన్ని తనకు ఇవ్వాల్సిందిగా ఆమె అభ్యర్థించింది.
కేరళ అబ్కారీ షాప్స్ డిస్పోజల్ రూల్స్ 2002'లోని రూల్ 7(37) ప్రకారం కల్లు దుకాణాల్లో మహిళలు పనిచేయడాన్ని నిషేధించింది. దాన్నే సాకుగా చూపిస్తూ అతడు సోఫియా అభ్యర్థనను తిరస్కరించాడు. దాంతో ఆమె ఈ విషయంపై హైకోర్టులో పోరాడాలని డిసైడ్ అయ్యింది. అందుకు యూనియన్ సభ్యులు మద్దతిచ్చారు. ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ వేసింది. కేరళ అబ్కారీ షాప్స్ డిస్పోజల్ రూల్స్, 2002'లోని రూల్ 7(37) కొట్టివేసి, కల్లు దుకాణాల్లో మహిళలు పనిచేసే అవకాశం ఇవ్వాలని కోర్టుని అభ్యర్థించింది.
అంతేగాదు ఆమె తరుఫు న్యాయవాది రంజిత్ తంపన్ మాట్లాడుతూ, పురుషాధిక్యత ఉన్న రంగంలో ఒక మహిళ అడ్డంకులను ఛేదించినందుకు ఇది ఒక చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు. అలాగే విదేశీ మద్యం నిబంధనలలో ఇలాంటి నిబంధనను హైకోర్టు గతంలో కొట్టివేసిన ఘటనను గుర్తు చేశారు. అయితే పని ప్రదేశంలో మహిళలు దోపిడీకి, ఎలాంటి వేధింపులకు గురికాకుండా కాపాడటానికే ఈ నిబంధన ఉద్దేశించబడిందని ప్రభుత్వ తరుఫు న్యాయవాది పేర్కొన్నారు. అలాగే కల్లు దుకాణాలు తరచుగా చాలా మారుమూల ప్రదేశాలలో ఉంటాయని, వారి భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి అటువంటి కల్లు దుకాణాలలో మహిళలను నియమించకుండా నిబంధనలు రూపొందించినట్లు ప్రభుత్వ న్యాయవాది ఎత్తి చూపారు.
కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ నైట్ వాచ్‌మన్ పోస్టుకు మహిళలను పరిగణనలోకి తీసుకోకుండా మినహాయించవచ్చని అభిప్రాయపడింది. అంతేగాదు కేరళ అబ్కారీ షాప్స్ డిస్పోజల్ రూల్స్, 2002'లోని రూల్ 7(37)ని కొట్టివేసింది. పైగా 2002 నిబంధనలలోని రూల్ 7(37) రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21లను ఉల్లంఘిస్తోందని హైకోర్టు న్యాయమూర్తి గోపీనాథ్ పేర్కొన్నారు.
అలాగే మహిళ సాధికారతకు అర్థం చెప్పేలా తన ఉపాధి హక్కు కోసం పోరాడిన సోఫియాను కూడా మెచ్చుకుంటూ కల్లు దుకాణంలో ఉద్యోగం కోసం పోరాడేందుకు ముందుకొచ్చి ఒక విప్లవత్మాక అడుగు వేసిందని కొనియాడింది. ఇక సోఫియా ఈ నవంబర్ 1వ తేదీ నుంచే ఇరింజలకుడ పరిధిలోని పొంజనంలో ఉన్న ఒక కల్లు దుకాణంలో ఉద్యోగిగా చేరనుంది. ఒక రకంగా ఈ న్యాయపోరాటం సోషియాకు ఉపాధి హక్కుకు సబంధించిన విషయంగా మారడం విశేషం.
ఇక ఆమె కుమార్తె చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) చదువుతుండగా, కుమారుడు 11వ తరగతి చదువుతున్నాడు. తాను తన పిల్లలను పెంచాలని, అందుకోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటానని చెప్పుకొచ్చిందామె. ప్రస్తుతం ఈ హైకోర్టు తీర్పుతో చాలామంది మహిళలు కల్లు దుకాణంలో పనిచేస్తామంటూ తనకు ఫోన్ చేస్తున్నారని ఆనందంగా చెబుతోంది.
ఈ న్యాయపోరాటంలో గెలవడానికి అతిపెద్ద మద్దతు తన కుమారుడే ఇచ్చాడని అంటోంది సోఫియా. ఎందుకంటే మీ అమ్మ కల్లు దుకాణంలో పనికెళ్తుందని చెప్పుకోగలవా అని ప్రశ్నించగా..పర్వాలేదని, ప్రతి ఉద్యోగానికి ఒక గౌరవం ఉంటుదని బదులిచ్చాడని తెలిపింది. అదే తనకు ఈ న్యాయపోరాటం చేసేందుకు కొండంత శక్తిని ఇచ్చిందని సంతోషంగా చెప్పుకొచ్చింది. కాగా, ఈ తీర్పు ప్రశంసనీయమని, కల్లు దుకాణాలలో మహిళలకు ఉపాధి కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నామని కేరళ కల్లు లైసెన్సుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి అజిత్ బాబు పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: షాకింగ్: మూడేళ్లుగా కడుపులోనే ‘రాతి శిశువు’


