సీజన్
నవంబర్, డిసెంబర్ వస్తోందంటే సాహిత్య సంబరాలు, పుస్తక ప్రదర్శనలు, లిట్ ఫెస్ట్‌లు, కొత్త పుస్తకాల రిలీజులు... భేష్. కాని 15 కోట్ల మంది తెలుగువారికి రెండు మూడు నెలల సీజనేనా కావాల్సింది? కేరళలోని కోజికోడ్ మన దేశంలో యునెస్కో గుర్తించిన ఏకైక ‘సిటీ ఆఫ్ లిటరేచర్’. ఆ ఊరు ఎందుకు గొప్ప? మన హైదరాబాద్, విజయవాడ ఎందులో తక్కువ?
‘హైదరాబాద్ బుక్‌ఫెయిర్ వచ్చింది... ఫోటోలు దిగుదామా’... అనో, ‘విజయవాడ బుక్‌ఫెయిర్ వచ్చింది అప్పడాలు తిందామా’ అనో జోకులేసుకునేవారు ఉన్నారు. తెలుగు వాళ్లు ఇలాంటి ఘనులు. కాని అందరూ మనలా ఉండరు. కొందరు అసలు ఉండరు. పుస్తకం లేని ఇల్లు దీపం లేని తావు లాంటిది. సాహిత్యం చదవని డాక్టరేట్‌ని నిరక్షరాస్యుడిగా గణించే చదువరులు ఉన్నారు. మనం మారాలంటే పుస్తకాలను మందుగా స్వీకరించాలి. పుస్తకాల పైకప్పు కట్టుకోవాలి. పుస్తకాల ఆహారాన్ని భుజించాలి.
చలికాలం రాగానే మనకు పుస్తకాల సీజన్ మొదలైపోతుంది. రెండు మూడు నెలల హడావిడి జరిగి ముగిసిపోతుంది. కానీ సాహిత్యం ఇలా కొన్ని నెలల ‘సీజన్’కు మాత్రమే పరిమితం కావాలా? 15 కోట్ల తెలుగు వారికి కావాల్సింది ఏడాది పొడవునా సాగే అక్షర వికాసం కాదా? మన తెలుగు నేలపై సాహిత్యాన్ని ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లేందుకు, వికాసం సాధించేందుకు అన్ని అవకాశాలూ, అపారమైన చరిత్ర ఉన్నాయి. కాని అలాంటి ప్రయత్నం జరగడం లేదు. పక్క రాష్ట్రంలోని కోజికోడ్ నగరం నుంచి మాత్రం భారతదేశంలోనే యునెస్కో గుర్తించిన ఏకైక ‘సిటీ ఆఫ్ లిటరేచర్’గా నిలిచి ఘనత అందుకుంటూ ఉంటుంది. మన హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ కంటే ఏం గొప్ప అది? ఆ ఊరి ఘనతలను అధ్యయనం చేస్తే వివరాలు తెలుస్తాయి.
ఎందుకు ’సిటీ ఆఫ్ లిటరేచర్’ ?
కేరళలోని కోజికోడ్ (కాలికట్) నగరానికి యునెస్కో అంతర్జాతీయ గౌరవం ఊరికే దక్కలేదు. అక్కడ దాదాపు ఇంటికో లైబ్రరీ ఉంది. అక్కడ ప్రతి వ్యక్తీ పుస్తకాలు కొంటాడు. చదువుతాడు. చాలక కోజికోడ్ పరిధిలో 62 పబ్లిక్ లైబ్రరీలు ఉన్నాయి. జిల్లాలో 545కి పైగా యాక్టివ్ గ్రంథాలయాలు ఉన్నాయి. అక్కడ ఒక పౌరుడికి సగటున కేవలం 1.2 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక రీడింగ్ రూమ్ అందుబాటులో ఉంటుంది.
అక్కడ పుస్తకాల సీజన్ ఉండదు. ఏడాది పొడవునా పుస్తకంతో పాటుగా జీవన విధానం ఉంటుంది. ఆ ఊళ్లోని 70కి పైగా పబ్లిషింగ్ హౌస్‌లు నిరంతరం కొత్త పుస్తకాలను ముద్రిస్తూనే ఉంటాయి. ఎస్.కె. పొట్టెక్కాట్, వైకోమ్ ముహమ్మద్ బషీర్ వంటి దిగ్గజాలు నడియాడిన ఆ నేలపై, ఇప్పటికీ ప్రతి వారాంతంలో వీధి కూడళ్లలో బహిరంగ కవితా పఠనాలు, పుస్తక చర్చలు నిరంతరం జరుగుతుంటాయి. ఇలా మన దగ్గర జరుగుతోందా?
మన నగరాలు ఆ స్థాయికి చేరాలంటే?
సాహిత్య చరిత్రలో మన తెలుగు నగరాలు ఎందులోనూ తక్కువ కాదు. హైదరాబాద్‌కు కుతుబ్ షాహీల కవితా దార్శనికత, చారిత్రక అఫ్జల్‌గంజ్ సెంట్రల్ లైబ్రరీ ఉన్నాయి. విజయవాడ ఒకప్పుడు పబ్లిషింగ్ హబ్:. వరంగల్‌కు పోతన, కాళోజీల వారసత్వం ఉంది. తిరుపతి ఆధ్యాత్మిక సాహిత్య కేంద్రం. కానీ ఇవన్నీ యునెస్కో స్థాయికి చేరాలంటే మనం కొన్ని పనులు చేయాలి:
→ నగరాల్లో ప్రతి డివిజన్ లేదా వార్డులో వై–ఫై సదుపాయంతో కూడిన మోడరన్ పబ్లిక్ రీడింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి.
→ కేవలం డిసెంబర్ పుస్తక ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ప్రతి నెలా స్థానిక పార్కులు, చెరువుల గట్లపై ’వీధి సాహిత్య ఉత్సవాలు’, ఓపెన్ మైక్ సెషన్లు నిర్వహించాలి.
→ నగరాల్లో చారిత్రక కవుల విగ్రహాలు, వారి నివాసాలను కలుపుతూ ’సాహిత్య పర్యాటక కారిడార్లు’ అభివృద్ధి చేయాలి.
ఇళ్లల్లో, బడుల్లో అక్షర బీజాలు
మంచి సమాజం కావాలంటే పిల్లల్లో డిజిటల్ స్క్రీన్ల అడిక్షన్ ను తగ్గించి, పుస్తకాలతో స్నేహం చేయించాలి. దీనికోసం ఇళ్లు, బడులు వేదికలు కావాలి. ప్రతి తల్లిదండ్రులూ తమ ఇంట్లో ఒక చిన్న పుస్తకాల అరను ఏర్పాటు చేయాలి. పిల్లల పుట్టినరోజులకు గ్యాడ్జెట్లు కాకుండా పుస్తకాలను బహుమతిగా ఇచ్చే సంస్కృతి రావాలి. రోజులో కనీసం అరగంట సేపు పిల్లలతో కలిసి పుస్తకాలు చదవడం లేదా పాతకాలపు కథలను చర్చించడం అలవాటు చేయాలి. విద్యాసంస్థలు కేవలం ర్యాంకుల కోసం కాకుండా, వారంలో కనీసం రెండు గంటల సమయాన్ని కేవలం జనరల్ బుక్స్, నవలలు, కథల పుస్తకాలు చదవడానికి కేటాయించాలి. స్కూళ్లలో రీడింగ్ క్లబ్‌లను ఏర్పాటు చేసి ఉత్తమ పాఠకులకు అవార్డులు ఇవ్వాలి.
పుస్తకం మనిషిని ఒంటరితనం నుంచి కాపాడుతుంది, సమాజాన్ని ఉన్మాదం నుంచి రక్షిస్తుంది. కోజికోడ్ నగరం మనకు నేర్పుతున్న పాఠం ఒక్కటే – సాహిత్యం అనేది కొందరి మేధావుల సొత్తు కాదు, అది ప్రజా బాహుళ్యంలో భాగం కావాలి. తెలుగు సమాజంలో సాహిత్య వికాసానికి కావలసిన సంస్కృతి, వనరులు పుష్కలంగా ఉన్నాయి. కావాల్సిందల్లా ఒక అడుగు. సీజన్లతో సంబంధం లేకుండా మన తెలుగు నగరాలు నిత్య సాహిత్య వేదికలుగా మారినప్పుడే అక్షర నిధులుగా మన తెలుగు నేల విశ్వవ్యాప్తం అవుతుంది.
– కె


