ఎవరికైనా ఏమైనా చెప్పాల్సింది ఉందా సమంత!? | Hyderabad Tragedy, Financial Distress Suspected As Couple And Two Year Old Daughter Found Dead In KPHB Colony | Sakshi
Sakshi News home page

‘అందరికీ థ్యాంక్యూ చెప్పండి’.. లేఖలో సమంత ప్రస్తావన

Oct 28 2026 9:14 AM | Updated on Oct 28 2026 10:13 AM

Family Ends Life In Financial Difficulties At Hyderabad

హైదరాబాద్‌: ఆ చిన్నారికి లోకమంటే ఏమిటో కూడా తెలియదు. అమ్మానాన్నలే తన ప్రపంచం. వారి చేతులు పట్టుకుని నడవడం, వారి ఒడిలో ఆడుకోవడం తప్ప జీవితంలో ఇంకేమీ తెలియని రెండేళ్ల పసిపాప. కానీ ఆ తల్లిదండ్రులే తమ బిడ్డను చంపి..ఆపై తామూ తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండిపోయింది. ఆర్థ్ధిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ కుటుంబం తీసుకున్న తీవ్ర నిర్ణయం మూడు ప్రాణాలను బలిగొంది. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటన మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కలవారు ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు ఫోన్‌ చేయగా వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టడంతో విషయం బయటపడింది. 

వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమబెంగాల్‌కు చెందిన దంపతులు గోపీనాథ్‌ (31), సమంత (26)లు తన రెండేళ్ల కుమార్తె స్నిగ్ధ (2)తో కలిసి కేపీహెచ్‌బీకాలనీ రమ్యాగ్రౌండ్‌ సమీపంలో నివాసముంటున్నారు. గోపీనాథ్‌ బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితమే నగరానికి రాగా మూడేళ్ల కిందట కుటుంబంతో కలిసి కేపీహెచ్‌బీకి వచ్చాడు. గోపీనాథ్‌ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుండగా సమంత గృహిణి. అయితే గత కొంతకాలంగా ఆర్థ్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు వారి కుటుంబసభ్యుల ద్వారా తెలిసింది. ఆ కారణంగానే వారు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. తొలుత చిన్నారిని హతమార్చే క్రమంలో ఆహారపదార్థంలో గుర్తుతెలియని విషం కలిపి పెట్టారు. కుమార్తె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత దంపతులిద్దరూ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

గోడపై ఆఖరి సందేశం... 
‘ఇది చాలా కాలం క్రితమే మేము తీసుకున్న నిర్ణయం. దీనికి మరెవరూ బాధ్యులు కారు. ఈ నిర్ణయాన్ని మేమే తీసుకున్నాం. కాబట్టి దయచేసి మా సిబ్బందిని గానీ లేదా స్నేహితులను గానీ దీని గురించి అడగకండి. మేము తప్పు చేస్తున్నామని మాకు తెలుసు. కానీ మాకు వేరే మార్గం లేదు. మమ్మల్ని క్షమించండి.. గుర్తుంచుకోండి.. మేము దీన్ని సొంతంగానే చేశాం. కాబట్టి దయజేసి ఎవరినీ ఏమీ అడగకండి’అంటూ గోడలపై సందేశం రాశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసులకు లభ్యమైన మరో లేఖ.. 
గోపీనాథ్‌ రాసి ఉన్న మరో లేఖ సైతం పోలీసులకు లభ్యమైంది. ‘మేము లేకపోతే బేబీ జీవితం చాలా కష్టంగా గడుస్తుందని సమంత చెప్పింది. ఎవరికైనా ఏమైనా చెప్పాల్సింది ఉందా? అని సమంతను అడిగితే, ఆమె కూడా ఎవరికీ ఏమి చెప్పాల్సింది లేదు..అందరికీ థ్యాంక్యూ చెప్పండి అని చెప్పింది. అందుకే మేము బేబీని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాం. మీరందరూ బాగుండాలి.’అని రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. అలాగే ఆ లేఖలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో కూడా రాసి ఉంది. ఈ లేఖతో ఆర్థ్ధిక ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు మరింత బలం చేకూరినట్లయ్యింది. గోపీనాథ్, సమంతల కుటుంబసభ్యులను పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement