ఎంపిక చేసిన కమ్యూనిటీలకు ప్రత్యేకంగా టవర్ల నిర్మాణం
హైదరాబాద్‌లోనూ మొదలైన ఉత్తరాది సంస్కృతి
కోకాపేట, పుప్పాలగూడ, నల్లగండ్లలో ఈ తరహా అపార్ట్‌మెంట్లు
సాక్షి, హైదరాబాద్: నగరాల్లో సాధారణంగా టులెట్ ఫర్ వెజ్ ఓన్లీ అనే బోర్డులను అద్దె ఇళ్లకు చూస్తుంటాం. కానీ భాగ్యనగర స్థిరాస్తి మార్కెట్‌లో అపార్ట్‌మెంట్ల విక్రయాల్లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. ముంబై, అహ్మదాబాద్, పుణే వంటి ఉత్తరాది నగరాల అపార్ట్‌మెంట్ల విక్రయాల్లో ఈ తరహా షరతులు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులు కస్టమర్ల ఆహార అలవాట్లనుబట్టి ఫ్లాట్ల విక్రయాలను చేపడుతున్నారు. ప్రధానంగా కోకాపేట, నల్లగండ్ల, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో నిర్మించే హైరైజ్ భవనాల్లోని ఫ్లాట్ల విక్రయాల్లో వెజిటేరియన్లకే ఇళ్లు అనే ధోరణి కనిపిస్తుంది. సంప్రదాయకంగా మాంసాహారం ఎక్కువగా తినే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ కొత్త ట్రెండ్ సామాజిక వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని బాచుపల్లికి చెందిన ఓ ప్రముఖ డెవలపర్ అన్నారు.
కమ్యూనిటీ బైలాస్‌లో షరతులు..
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక నివాసిత సంఘం ఏర్పడిన తర్వాత కమ్యూనిటీ బైలాస్‌లోనూ వెజ్ ఓన్లీ షరతులు చేరుస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు విధించడానికి హౌసింగ్ సొసైటీలు రెండు రకాల పద్ధతులను పాటిస్తున్నాయి. కేవలం శాకాహార కొనుగోలుదారులనే ఆహ్వానిస్తూ బహిరంగంగానే ప్రకటనలు ఇవ్వడం ఒకటైతే.. బ్రోకర్ల ద్వారా ముందే ఫిల్టర్ పెట్టడం, నాన్ వెజ్ వండితే వచ్చే వాసనలు, వ్యర్థాల నిర్వహణ నెపంతో ఇళ్లను నిరాకరించడం రెండోది. కొన్ని సొసైటీల్లో రాజీ మార్గంగా ఇళ్లలో నాన్ వెజ్ వండుకోవచ్చు కానీ కమ్యూనిటీ హాల్స్ లేదా కామన్ కిచెన్‌లలో కేవలం వెజ్ వంటకాలే చేయాలనే నిబంధనలు కూడా ఉంటున్నాయి.
కమ్యూనిటీ టవర్లు కూడా..
గేటెడ్ కమ్యూనిటీల్లో ఆలయ నిర్మాణానికి బిల్డర్లు స్థలాన్ని కేటాయిస్తే అదే కమ్యూనిటీలో ఉండే ఇతర వర్గాల నివాసితులు కూడా ప్రార్థనా స్థలాన్ని కేటాయించాలని బిల్డర్లపై ఒత్తిడి తేవడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. దీంతో బిల్డర్లు ఎంపిక చేసిన కమ్యూనిటీలకు ప్రత్యేకంగా యూనిట్ల నిర్మాణాలకు ముందుకొస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పలు కమ్యూనిటీలకు ప్రత్యేకంగా టవర్లు కూడా నిర్మిస్తున్నారు.
హైదరాబాద్‌లో స్థిరపడిన పలు ఉత్తరాది కుటుంబాలు బృందంగా ఏర్పడి 1–2 వేల గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో వారికి నచ్చినట్లుగా నిర్మాణం చేపట్టేందుకు బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుంటుంటారు. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్‌లో 120 మీటర్ల ఎత్తయిన భారీ టవర్ నిర్మాణానికి ఇలాగే ప్రణాళిక చేశారు. దీనికి సమీపంలోనే ముంబై, బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థలు ఎంపిక చేసిన కమ్యూనిటీలకు మాత్రమే ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్, నాంపల్లి, అబిడ్స్, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో రీ–డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లోనూ ఈ తరహా కమ్యూనిటీ యూనిట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.


