మానవులపై ఔషధ ప్రయోగాలు చేపట్టిన ‘పాప్‌వ్యాక్స్’
సాధారణ ఫ్రిజ్‌లలోనే నిల్వ ఉంచేలా వ్యాక్సిన్ రూపకల్పన
ప్రాణాంతక వ్యాధికి సరికొత్త ఎంఆర్‌ఎన్‌ఏ చికిత్స
సాక్షి,హైదరాబాద్: ప్రాణాంతక కేన్సర్ వ్యాధికి మందును అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పాప్‌వ్యాక్స్ అనే హైదరాబాదీ స్టార్టప్ సంస్థ ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ఇందుకోసం 100 మందికిపైగా శాస్త్రవేత్తలు, ఏఐ, రోబోటిక్స్ సాయంతో సరికొత్త వ్యాక్సిన్లు, మందులను సిద్ధం చేస్తున్నారు. సాధారణ వ్యాక్సిన్లలో బలహీనపర్చిన వైరస్‌లను శరీరంలోకి పంపి రోగనిరోధక శక్తిని పెంచుతారు. కానీ పాప్‌వ్యాక్స్ వాడుతున్న ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత పూర్తిగా భిన్నమైనది. ఇది శరీరంలోకి వైరస్‌ను పంపకుండానే వైరస్‌తో పోరాడటానికి అవసరమైన జన్యుపరమైన సూచనలను కణాలకు అందిస్తుంది. దీనివల్ల మానవ శరీరం స్వయంగా వ్యాధులతో పోరాడేలా తయారవుతుంది. ఈ సంస్థ ఇప్పటికే ఒక ప్రత్యేక టీకాను తయారు చేసింది. అలాగే సాధారణ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను అత్యంత శీతల ఉష్ణోగ్రతలలో భద్రపరచాల్సి ఉండగా పాప్‌వ్యాక్స్ మాత్రం సాధారణ ఫ్రిజ్‌లలోనే నిల్వ చేసుకోగల టీకాను అభివృద్ధి చేసింది.
ఆస్ట్రేలియాలో ప్రయోగాలు..
భారత్‌లో ఒక కొత్త మందుకు లేదా వ్యాక్సిన్‌కు అనుమతులు రావడానికి, నైతిక కమిటీల ఆమోదానికి చాలా నెలల సమయం పడుతుంది. కానీ ఆ్రస్టేలియాలో ఈ ప్రక్రియ 30 రోజుల్లోనే పూర్తవుతుంది. క్లినికల్ ట్రయల్స్ వేగంగా పూర్తి చేయడం పరిశోధనల్లో అత్యంత కీలకం. అందుకే ఈ సంస్థ తన తొలివిడత మానవ ప్రయోగాలను ఆ్రస్టేలియాలో నిర్వహిస్తోంది. అయితే భారత ప్రభుత్వం కూడా ఇటీవల నిబంధనలను సరళీకరిస్తూ కొత్త చట్టాలను తీసుకువచ్చింది. దీనివల్ల భవిష్యత్తులో దేశీయంగా కూడా ఇలాంటి ప్రయోగాలు చాలా వేగవంతం కానున్నాయి.
కేన్సర్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి..
కాలేయ కేన్సర్, ప్యాంక్రియాటిక్ కేన్సర్ వంటి వ్యాధులకు సరికొత్త రోగనిరోధక చికిత్సలను (ఇమ్యునోథెరపీ) పాప్‌వ్యాక్స్ అభివృద్ధి చేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి రోగి శరీర తత్వానికి తగ్గట్టుగా ఏఐ సాయంతో కొన్ని వారాల్లోనే ప్రత్యేకమైన వ్యక్తిగతీకరించిన చికిత్సను అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్, ఇతర ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి ఇప్పటివరకు సుమారు 30 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించింది. కరోనా వ్యాప్తి వేళ కేవలం ఇద్దరు వ్యక్తులతో ఒక చిన్న అద్దె ప్రయోగశాలలో ప్రారంభమైన పాప్‌వ్యాక్స్ ప్రయాణం.. ఈరోజు 10,000 చదరపు అడుగుల పెద్ద పరిశోధనా కేంద్రంగా ఎదిగింది. దీని వ్యవస్థాపకుడు సోహం శంకరన్.


