రూ.1.80 లక్షల కోట్ల కంపెనీకి సారధి జౌ ఖున్‌ఫీ
Hurun Richest Women in China 2026 : ఆమె చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పి, రోజుకు కేవలం రూ.100 కూలీ నుంచి . చైనాలో అత్యంత ధనవంతురాలైన మహిళా వ్యాపారవేత్తగా ఎదిగింది. నేడు లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఫ్యాక్టరీ కార్మికురాలిగా జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా మారిన 56 ఏళ్ల జౌ ఖున్‌ఫీ (Zhou Qunfei) సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
చైనాకు చెందిన జౌ అత్యంత సాధారణ స్థితినుంచి అపార సంపదతో రిచెస్ట్ విమెన్‌గా నిలిచిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. 1970లో హునాన్ ప్రాంతంలో జన్మించిన జౌ కుటుంబ పరిస్థితుల కారణంగా టీనేజ్‌లోనే బడి వదిలేయాల్సి వచ్చింది. అనంతరం షెన్‌జెన్‌లోని ఒక వాచ్‌గ్లాస్ తయారీ కర్మాగారంలో రోజుకు సుమారు రూ. 114 వేతనానికి కార్మికురాలిగా పనిచేసేవారు.
'లెన్స్ టెక్నాలజీ' స్థాపన
అక్కడ సాధించిన అనుభవంతో 23 ఏళ్ల వయస్సులో అడ్వాన్స్‌డ్ స్క్రీన్-ప్రింటింగ్, కర్వ్డ్-గ్లాస్ తయారీ మెళకువలు నేర్చుకుని సొంతంగా గ్లాస్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. సొంతంగా ఒక చిన్న గ్లాస్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. తరువాతి క్రమంలో ఆ చిన్న వర్క్‌షాపే 'లెన్స్ టెక్నాలజీ'గా మారింది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ గ్లాస్ తయారీలో తన ప్రతిభను చాటుకుంటూ టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది. ముఖ్యంగా 2007లో ఐఫోన్ల మొదటి మోడల్ కోసం ప్రొటెక్టివ్ గ్లాస్ కవర్లు అందించే పెద్ద కాంట్రాక్ట్ లభించడమే ఈమె వ్యాపార జీవితంలో అతిపెద్ద మలుపు. అక్కడి నుంచి వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంది. 'లెన్స్ టెక్నాలజీ' సంస్థ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ స్క్రీన్‌లను తయారు చేసే అగ్రగామి సంస్థలలో ఒకటిగా ఎదిగింది.
తాజాగా లెన్స్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలైన జౌ ఖున్‌ఫీ, సుమారు 127 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1.80 లక్షల కోట్లు) సంపదతో మళ్లీ చైనాలో అత్యంత ధనవంతురాలిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 2015 మార్చిలో షెన్‌జెన్ స్టాక్ మార్కెట్‌లో లెన్స్ టెక్నాలజీ లిస్టింగ్ తరువాత జౌ ఖున్‌ఫై తొలిసారి చైనాలోనే అత్యంత ధనిక మహిళగా నిలిచారు.
2018లో యూఎస్-చైనా వాణిజ్య యుద్ధం, యాపిల్ విక్రయాల మందగమనం వల్ల కంపెనీ షేర్ల ధరలు బాగా పడిపోయాయి. వ్యాపార విస్తరణ నిధుల కోసం హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో 2025లో రెండోసారి లిస్టింగ్ సాధించారు. అలాగే తన వ్యాపారిన్ని కేవలం స్మార్ట్‌ఫోన్లకే పరిమితం కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హార్డ్‌వేర్, రోబోటిక్స్ రంగానికి విస్తరించారు.
గ్లోబల్ గుర్తింపు
బీజింగ్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో జౌ ఖున్‌ఫైకి ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. ఈ విందులో ఆమె యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మరియు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్నారు.
'ది ఇండిపెండెంట్' నివేదిక ప్రకారం, అక్టోబర్ 28న విడుదలైన 'హురున్ చైనా రిచెస్ట్ ఉమెన్' (Hurun Richest Women in China) జాబితాలో, గత ఏడాదితో పోలిస్తే ఆమె సంపద 15 శాతం పెరిగింది. హాన్‌సో ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకురాలు జంగ్ హుయిజువాన్‌ను అధిగమించి, చైనాలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా జౌ ఖున్‌ఫీ నిలిచారు. హురున్ నివేదిక ప్రకారం చైనాలోని టాప్ 50 ధనిక మహిళల్లో దాదాపు 65శాతం మంది స్వయంకృషితో పైకి వచ్చిన వారే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: 5 స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో షాక్ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం


