మహిళలపైనా బైండోవర్‌ అస్త్రం! | Attacks on YSRCP candidates filing of false cases and attempts to initiate bind over proceedings | Sakshi
Sakshi News home page

మహిళలపైనా బైండోవర్‌ అస్త్రం!

Oct 30 2026 5:48 AM | Updated on Oct 30 2026 5:48 AM

Attacks on YSRCP candidates filing of false cases and attempts to initiate bind over proceedings

చిప్పగిరి ఎస్‌ఐ తీరుకు నిరసనగా ఆలూరు–గుంతకల్లు ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న నగరడోణ మహిళలు

స్థానిక ఎన్నికల వేళ పోలీసుల దాష్టీకం 

కర్నూలు జిల్లా చిప్పగిరిలో నగరడోణలో మహిళలపై దాడి, బైండోవర్‌ యత్నం 

వెన్నుపోటు పార్టీకి వెన్నుదన్నుగా పోలీసుల చర్యలు 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులు 

వెన్నుపోటు పార్టీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న వారిని కత్తులతో పొడుస్తామంటూ బెదిరింపులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వారి అనుచరులపై టీడీపీ గూండాలతో కలిసి దాష్టీకాలకు పాల్పడ్డ పోలీసులు.. ఇప్పుడు అరాచకాలను మరో స్థాయికి పెంచి, అభ్యర్థుల ఇళ్లపై పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకోవాలంటూ టీడీపీ గూండాలు, కొందరు పోలీసు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల దగ్గర కనిపిస్తే చంపేస్తామని అభ్యర్థులను, వారి ఏజెంట్లను బెదిరిస్తున్నారు. 

అభ్యర్థుల ఇళ్లపైకీ తెగబడుతున్నారు. ఇళ్లలోకి చొరబడి, మహిళలను కూడా బయటకు లాగి, బూతులు తిడుతూ పోలీసు స్టేషన్లకు లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలపైనా బైండోవర్‌ కేసులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ, అప్రజాస్వామిక రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నిస్సిగ్గుగా అమలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గూండాలు, పోలీసుల తాజా అరాచకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.  

సాక్షి, అమరావతి/ఆలూరు రూరల్‌: ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారు. వెన్నుపోటుపార్టీకి వెన్నుదన్నుగా నిలిచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడుగడుగునా అడ్డుకుంటు­న్నారు. చివరకు మహిళలపైనా బైండోవర్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నగరడోణ గ్రామానికి చెందిన మహిళలపై గురువారం బైండోవర్‌ చర్యలకు చిప్పగిరి ఎస్సై ప్రయత్నించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, శ్రేణులపై దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు కొనసాగుతున్నాయి. టీడీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న వారిని దారి కాచి మరీ టీడీపీ గూండాలు కత్తులతో పొడుస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. 

వైఎస్సార్‌సీపీ నేత ఇంట్లో సోదాలు 
అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత నాగార్జునరెడ్డి ఇంట్లో సోదాల పేరుతో రాద్ధాంతం చేశారు. ఓటరు జాబితాను స్లిప్పుల రూపంలో ఇవ్వొద్దని ఆంక్షలు పెట్టారు. అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. మంత్రి సత్యకుమార్‌ ఆదేశాలతోనే అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై కక్ష సా«ధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

ఘటనాస్థలికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌ మునిసిపల్‌ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్లకు సమాచారం ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు. డబుల్‌ ఓట్లు కలిగిన టీడీపీ, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంత్రి సత్యకుమార్‌ ఆదేశాలతో పని చేయవద్దని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.  

విస్సన్నపేటలో అర్ధరాత్రి బెదిరింపులు 
ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేటలో పచ్చ మూకలు అర్థరాత్రి వేళ బెదిరింపులకు దిగాయి. విస్సన్నపేట సెగ్మెంట్‌–1 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి చెరుకు సుజాత ఇంటి తలుపులను బాదుతూ టీడీపీ గూండాలు భయాందోళనలు సృష్టించారు. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన పోలీసులు బాత్రూంలో దాక్కున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు ఎవరనే విషయం పోలీసులు చెప్పడంలేదని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సుజాత నామినేషన్‌ వేసినప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా దాడికే తెగబడ్డారు. పద్మశాలి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.  

విజయవాడలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై దాడికి యత్నం 
విజయవాడ 43వ డివిజన్‌లో పచ్చ మూకలు ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై దాడికి యత్నించారు. పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్న మహిళలను బుధవారం రాత్రి బైక్‌లతో అడ్డగించి టీడీపీ అభ్యర్థి భర్త గుర్రంకొండకు చెందిన మనుషులు బెదిరించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్న ఆటోను అడ్డుకుని పెన్‌డ్రైవ్‌ ఎత్తుకెళ్లిపోయారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి(ఆర్వో)కి గురువారం ఫిర్యాదు చేసేందుకు ర్యాలీగా వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కర్నాటి రమాదేవి, భర్త కర్నాటి రాంబాబు, కార్యకర్తలను గర్రంకొండ మనుషులు అడ్డుకొని అసభ్య పదజాలంతో బూతులు తిట్టారు.   

కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని దౌర్జన్యాలు 
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రలోభాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. కళ్యాణదుర్గం మండలం కొండాపురం గ్రామంలో టీడీపీ నేతలు బరితెగించి వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆంజనేయులు బైక్‌ను తగలబెట్టారు. టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం పట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దొడగట్ట గ్రామంలో ప్రజలు రెండున్నరేళ్లుగా తాగునీటి సమస్య చెబుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయన అనుచరులతో బోరు వేయించి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 

వినుకొండలో పచ్చనేతల అరాచకం 
పల్నాడు జిల్లా వినుకొండలో పచ్చ గూండాల అరాచకాలు అడ్డుఅదుపులేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలపై భౌతికదాడులకు దిగుతున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు రషీద్‌ను కూటమి మూకలు నడిరోడ్డుపై నరికి చంపాయి. రషీద్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి టీడీపీ ఛైర్మన్‌ అభ్యర్థిత్వం ఇవ్వడం హత్యారాజకీయాలను ప్రోత్సహించినట్టే అయ్యింది. టీడీపీ అభ్యర్థి షమీమ్‌ ఖాన్‌కు పోటీగా వైఎస్సార్‌సీపీ పీఎస్‌ ఖాన్‌ను రంగంలోకి దింపింది. ఇదే సమయంలో టీడీపీ ఛైర్మన్‌ అభ్యర్థిపై  ఆర్యవైశ్యులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. దీంతో టౌన్‌ సీఐ ప్రభాకరరావు టీడీపీ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న ఆర్యవైశ్యులతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరిస్తున్నారు. చివరకు  ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనా కేసులు పెడతానని బెదిరిస్తున్నారు. సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరుతున్నారు.  

ఏజెంట్‌ ఫారాలు ఇవ్వకుండా పచ్చమూకల దౌర్జన్యం 
మాచర్ల మున్సిపల్‌ పోలింగ్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లుగా ఉండేవాళ్లు ఎన్నికల అధికారికి ఏజెంట్‌ ఫారాలు ఇవ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నారు. ఏజెంట్‌ ఫారాలు ఇవ్వడానికి మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లిన వారిని 200 మందికిపైగా టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి చేసి వారి వద్ద ఉన్న ఫారాలు లాక్కుని చించేశారు. పోలీసుల సమక్షంలోనే పచ్చ మూకలు దాడులు చేసినా ప్రేక్షకపాత్ర పోషించారు. పోలింగ్‌ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేసి రిగ్గింగ్‌కు పాల్పడే కుట్రతో పచ్చ గూండాలు ఇలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వైఎస్సార్‌సీపీ నేతలకు సీఐ వేధింపులు 
వినుకొండ మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కీలక నేతలకు వినుకొండ సీఐ ప్రభాకర్‌ వేధింపులు తీవ్రమయ్యాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వినుకొండలో ఉన్న 22 మంది వైఎస్సార్‌సీపీ నాయకులకు ఫోన్లు చేసి చెప్పినట్టు వినకపోతే బైండోవర్‌ చేస్తామంటూ సీఐ బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. బైండోవర్‌ చేస్తాం శుక్రవారం ఉదయం10 గంటలకల్లా 22 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఉండాలని ఆయన హుకుం జారీ చేశారు. స్టేషన్‌కు రాకపోతే ఎక్కడ కనబడితే అక్కడ కొట్టుకుంటూ తీసుకు వస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. టౌన్‌ సీఐ ప్రభాకరరావు వేధింపులపై జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు ఎస్‌ఈసీకి కూడా వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. వినుకొండ టౌన్‌ సీఐ ప్రభాకరరావును ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది.  

మహిళల బైండోవర్‌కు అభ్యర్థి ఇంటి వద్ద పోలీసుల రభస
తాము చెప్పినా పోటీ నుంచి విరమించుకోవడం లేదన్న అక్కసుతో కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో నగరడోణ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఆంజినేయులు కుటుంబంలోని మహిళలు, గ్రామ మహిళలపైనా బైండోవర్‌ అస్త్రాన్ని ప్రయోగించేందుకు పోలీసులు బరితెగించారు. ఇందుకోసం గురువారం అభ్యర్థి ఇంటి వద్ద చిప్పగిరి ఎస్సై నర్సింహులు, పోలీసులు పెద్ద రభసే సృష్టించారు. ఆంజినేయులు నామినేçషన్‌ వేసినప్పటి నుంచి విరమించుకోవాలని టీడీపీ గూండాలు, పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. 

అయినా ఆయన ససేమిరా అనడంతో వారం రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా నగరడోణలోని ఆయన ఇంటి వద్దకు వెళ్లి పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. గురువారం ఆంజినేయులు లేని సమయంలో చిప్పగిరి ఎస్సై నర్సింహులు, పోలీసులు ఆయన ఇంటిపై పడ్డారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లి మహిళలను బూతులు తిడుతూ బయటకు లాగి, బైండోవర్‌ కోసం స్టేషన్‌కు, తహసీల్దార్‌ కార్యాలయానికి రావాలని దబాయించారు. వారు ఒప్పుకోకపోవడంతో ఆంజినేయులు భార్య ఎల్లమ్మ, కుమార్తె శైలమ్మ, కుమారుడు జయరాముడిని, మరికొందరు గ్రామ మహిళలను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. మహిళలని చూడకుండా చితకబాదారు. ఈ దాడిలో శైలమ్మకు గాయాలయ్యాయి. 

పోలీసుల దాడిని గమనించిన గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎస్‌ఐ నర్సింహులు, పోలీసులను గట్టిగా ఎదిరించారు. వారం రోజులుగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఆంజినేయులు కుటుంబాన్ని  పోలీసులు వేధిస్తుండటం, మహిళలపైనా దాడికి దిగడంతో ఆగ్రహించిన నగరడోణ గ్రామస్థులు మండల కేంద్రం చిప్పగిరికి తరలివెళ్లారు. తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్‌ను ఎందుకు బైండోవర్‌ చేస్తారంటూ నిలదీశారు. ఎస్‌ఐ, పోలీసుల తీరును నిరసిస్తూ ఆంజినేయులు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులంతా చిప్పగిరిలోని ఆలూరు–గుంతకల్లు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఎస్‌ఐ వేధింపుల నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్‌ చేశారు. చివరకు సీఐ రవిశంకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు. 

పోలీసుల తీరుపై ఎమ్మెల్యే మండిపాటు 
ఎన్నికల్లో పోలీసులు అవలంబిస్తున్న తీరుపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని, పోలీసుల జులుం నశించాలని అన్నారు. నగరడోణ ఎంపీటీసీ అభ్యర్థి ఆంజినేయులు కుటుంబ సభ్యులపై దాడి చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలు, అక్కాచెల్లెమ్మలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. 

బైండోవర్‌  ‘ఎలా’ చేస్తారు? 
వాస్తవానికి బైండోవర్‌ అనేది సాధారణ చర్య కాదు. సంబంధిత వ్యక్తి నుంచి శాంతిభద్రతలకు ముప్పు ఉందనే కారణాలు చూపాలి. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ఈ చర్యలను ఉపయోగిస్తే అది అధికార దుర్వినియోగమే. నగరడోణ మహిళల విషయంలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించకుండా బైండోవర్‌ పేరుతో బెదిరింపులకు దిగడం విమర్శలకు తావిస్తోంది. మహిళలపై బైండోవర్‌ చర్యలకు ప్రతిపాదించిన కారణాలేమిటి? వారిని తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లే ముందు ఎలాంటి నోటీసులు ఇచ్చారు? సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ముందు ఏ నివేదిక సమర్పించారు? ఈ వివరాలను పోలీసులు ఎందుకు వెల్లడించలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పెట్టిన బైండోవర్‌ కేసులు పరిశీలిస్తే వెన్నుపోటు పార్టీ ప్రయోజనాల కోసమే వారు పనిచేస్తున్నారనే విషయం తేటతెల్లమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement