మా నామినేషన్ల తిరస్కరణ ఓ పెద్ద కుట్ర!
చంద్రబాబు కనుసన్నల్లో ఆర్వోల మోసం.. అమ్ముడుపోయిన ఆర్వోల వల్లే పోటీలో లేకుండా పోయాం
పత్రాలు చించేసి.. అవి లేవని తిరస్కరించారు.. సంతకం సరిపోలేదంటూ కుదరదన్నారు
పేజీలకు పేజీలు మాయం చేసేశారు
పత్రాల్లో ముందు లేని కొట్టివేతలు సృష్టించారు.. అప్పీలుకు అవకాశం లేకుండా జాప్యం చేశారు
మా సంతకాలు ఫోర్జరీ చేసి విత్‌డ్రాలు చేసేశారు
రిటర్నింగ్ అధికారుల తీరుపై తిరస్కరించిన అభ్యర్థుల ఆగ్రహం!
ఈ అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్
ఈ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లనీయకుండా కిరాయి గూండాలను, గంజాయి ముఠాలను, పోలీసులను చంద్రబాబు అండ్ కో యథేచ్ఛగా వాడడాన్ని రాష్ట్రమంతా చూసింది. ఇవన్నీ దాటుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని రిటర్నింగ్ అధికారుల చేతిలో నామినేషన్ పత్రాలు పెట్టినా పోలీసుల కళ్లెదుటే టీడీపీ గూండాలు వాటిని చించి ముక్కలు చేశారు. అసలు పోలింగ్ కేంద్రాలలోకి అంతమంది గూండాలు ఎలా చేరుకున్నారు? కలెక్టర్లకు ఫిర్యాదు చేసి వారిని అడ్డుకోవలసిన ఆర్వోలు ఎందుకు మిన్నకుండా ఉండిపోయారు? వాటిని కూడా దాటుకుని ఎలాగోలా పత్రాలను అందించాం కదా అని కొందరు అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నా అమ్ముడుపోయిన అధికారులు చాలాచోట్ల అసలు పోటీయే లేకుండా చేశారు.
అధికార పార్టీకి ఏకగ్రీవాలు అందించడానికి నీతి నిజాయితీలను వదిలేశారు. చెక్‌లిస్ట్ ఇచ్చి అన్నీ బాగున్నాయని చెప్పి సంతకం చేసి మరీ అక్‌నాలెడ్జ్ స్లిప్పులు ఇచ్చి.. ఆతర్వాత కొన్ని పత్రాలు చించేసి అవిలేవంటూ నామినేషన్లు తిరస్కరించారు. అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి విత్‌డ్రాలు చేసేశారు. ఇంత నీచనికృష్ట పనులకు దిగజారిన అధికారులను ఏమనాలి? చంద్రబాబు ఒత్తిడికి రిటర్నింగ్ అధికారులు తలొగ్గితే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడ? నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీకి కీలుబొమ్మలుగా మారితే ఇక ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా ఎలా జరుగుతాయి? పోలింగ్ కేంద్రాలలో జరిగిన మోసాలు, అమ్ముడుపోయిన ఆర్వోల చేసిన దిగజారుడు పనుల గురించి తిరస్కరణకు గురైన అభ్యర్థులేమంటున్నారో చూద్దామా..
దొంగ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ..!
‘‘మాతో ఎన్నికల్లో పోటీ పడలేక టీడీపీ నాయకులు, ఆర్వోతో కుమ్మక్కయి దొంగ సంతకాలతో మా నామినేషన్లను ఉపసంహరించినట్టు నాటకాలు ఆడారు. నామినేషన్లు వేసిన తర్వాత మేం ఆర్‌ఓ కార్యాలయానికి వెళ్లలేదు. ప్రజల్లో ప్రచారంలో ఉంటే, మా ప్రమేయం లేకుండానే ఉపసంహరణ చేసుకున్నట్టు ఎలా ప్రకటిస్తారు? కూటమి నాయకులతో చేతులు కలిపి రిటర్నింగ్ అధికారులు మా అభ్యర్థిత్వాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. మహిళా అభ్యర్థులతో కూడా పోటీలో గెలవలేక ఫోర్జరీ సంతకాలతో అడ్డదారులు తొక్కడం సిగ్గుచేటు.
మా సంతకాలు లేకుండా నామినేషన్లను ఎలా ఉపసంహరించారు? ఎవరు ఫోర్జరీ చేశారు? సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడితే సామాన్యులకు న్యాయం ఎక్కడ? ఈ అన్యాయాన్ని వదిలిపెట్టేది లేదు. కోర్టును ఆశ్రయించి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తాం!’’ – కాలెపు శ్రీదేవి, పొందూరు–3, పప్పల రాజ్యలక్ష్మీ, బాణాం, కూన శోభారాణి, కోటిపల్లి, లింగాల అరుణకుమారి, నందివాడ, ఎచ్చెర్ల పద్మావతి, రాపాక–1, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు, శ్రీకాకుళం జిల్లా
న్యాయస్థానాన్ని ఆశ్రయించేఅవకాశం కూడా లేకుండా చేశారు..
‘‘నేను వైఎస్సార్‌సీపీ తరఫున శేకూరు–1 ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. స్క్రూటినీ సమయంలో టీడీపీ నాయకులు రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చి నా నామినేషన్‌ను తిరస్కరించేలా చేశారు. తెనాలి, శేకూరు రెండు చోట్ల ఓటు హక్కు ఉందనే కారణాన్ని చూపించి నా నామినేషన్‌ను తిరస్కరించారు. దీనిపై తెనాలిలో అప్పీలు చేసినా నాకు న్యాయం జరగలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా లేకుండా ఉదయం నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అర్ధరాత్రి దాటిన తర్వాత నా నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీకి మంచి పట్టు ఉంది. ఇక్కడ గెలవలేమన్న భయంతోనే టీడీపీ నాయకులు అధికారులను అడ్డుపెట్టుకుని నా నామినేషన్‌ను తిరస్కరించే కుట్రకు పాల్పడ్డారు.’’ – మన్నెం ఉషారాణివైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని, శేకూరు–1, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా
నా పత్రాల్లో కొట్టివేతల కుట్ర!
‘‘నేను వైఎస్సార్‌సీపీ తరఫున కాకర్ల ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మొదటిరోజు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అర్జున్ నాయక్‌కు ఇచ్చాను. కొన్ని పత్రాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని నింపుకుని రావాలని చెప్పారు. న్యాయవాది సలహా మేరకు అన్ని పత్రాలను పూర్తిగా నింపి నామినేషన్ కేంద్రంలో సమర్పించాను. కొట్టివేతలు ఉన్నాయనే సాకుతో నా నామినేషన్‌ను తిరస్కరించారు. కానీ నేను ముందుగా జిరాక్స్ తీసుకున్న నామినేషన్ పత్రాల్లో ఎలాంటి కొట్టివేతలు లేవు. మరి నేను తీసుకున్న పత్రాల్లో లేని కొట్టివేతలు, అధికారులు పరిశీలించిన పత్రాల్లోకి ఎలా వచ్చాయి? ఎవరు ఆ మార్పులు చేశారు? ఎప్పుడు చేశారు? ఇది సాధారణ తప్పిదం కాదు.. నా అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవడానికి జరిగిన వ్యవహారం.
కూటమి నాయకులు, అధికారులు కుమ్మక్కై నా నామినేషన్‌ను తిరస్కరించేందుకు కుట్ర చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన నన్ను, పత్రాల్లో కొట్టివేతల పేరుతో ఎన్నికల బరి నుంచి తప్పించారు. నా నామినేషన్ పత్రాల్లో జరిగిన మార్పులపై సమగ్ర విచారణ జరపాలి. అసలు పత్రాలను, నేను తీసుకున్న జిరాక్స్ ప్రతులను పోల్చి చూసి నిజానిజాలు బయటపెట్టాలి. నా నామినేషన్ తిరస్కరణ వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి.’’– మునపాటి నరసింహారావు, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, కాకర్ల, మర్రిపూడి మండలం, ప్రకాశం జిల్లా
టీడీపీ అభ్యర్థికి ఒక న్యాయం.. నాకు మరో న్యాయమా?
‘‘పోలీసుల ఎదుటే టీడీపీ వాళ్లు నా ఒరిజినల్ కులధ్రువీకరణ పత్రాన్ని చింపేశారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పి జిరాక్స్ ప్రతిని సమర్పించాను. స్క్రూటినీ సమయానికి ఒరిజినల్ తీసుకురావాలని అధికారులు నోటిమాటగా చెప్పడంతో అలాగే తీసుకెళ్లాను. అయినా నా నామినేషన్‌ను తిరస్కరించారు. ఆర్డీఓకు అప్పీలు చేసినా న్యాయం జరగలేదు. ఇదే సమస్య ఉన్న టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను మాత్రం ఆమోదించారు. టీడీపీ అభ్యర్థికి ఒక న్యాయం.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మరో న్యాయమా? అందరినీ సమానంగా చూడాల్సిన అధికారులు అధికార పార్టీ అభ్యర్థికి ఒకలా, నాకు మరోలా ఎందుకు వ్యవహరించారు? నా నామినేషన్ విషయంలో జరిగిన అన్యాయానికి ఎవరు సమాధానం చెబుతారు? నాకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టను!’’– కామక్కగారి మురళీ, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, కందుకూరు–1, అనంతపురం రూరల్ మండలం
సంతకం మ్యాచ్ కాలేదనే సాకుతో..!
‘‘నేను ఎంఎస్సీ మ్యాథ్స్ చదువుకున్నాను. ప్రొద్దుటూరు మండలం గోపవరం–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేశాను. స్క్రూటినీ సమయంలో నా సంతకం మ్యాచ్ కావడం లేదనే కారణంతో నామినేషన్ తిరస్కరించారు. పీజీ చదువుకున్న నాకు నా సంతకం పెట్టడం రాదా? సంతకం సరిపోలేదనే సాకుతో నా నామినేషన్‌ను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు. నా అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించినఅధికారుల నిర్ణయానికి ఎవరు సమాధానం చెబుతారు? నా నామినేషన్ తిరస్కరణపై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి!’’ – సాకే ఉమామహేశ్వరి, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, గోపవరం–1, ప్రొద్దుటూరు మండలం
కారణం కూడా చెప్పలేదు !
‘‘నేను, నా సోదరుడు పిట్టు కృష్ణారెడ్డి అగతవరపాడు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి నామినేషన్లు వేశాం. మేం గెలుస్తామనే భయంతోనే కక్షగట్టి మా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. మరోవైపు, మా గ్రామంలో ఓటు ఉండి గుంటూరులో నివసిస్తున్న వ్యక్తితో టీడీపీ వాళ్లు నామినేషన్ వేయించారు. మా నామినేషన్లు ఎందుకు తిరస్కరించారో అధికారులు సరైన కారణం చెప్పలేదు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తే రెండు రోజులు కాలయాపన చేసి అక్కడా తిరస్కరించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎన్నికలు పూర్తయ్యాక రావాల్సిందని చెప్పి రెండో రోజే మా పిటిషన్‌ను కొట్టివేశారు.’’ – పిట్టు దుర్గారెడ్డి, అగతవరపాడు ఎంపీటీసీ అభ్యర్థి, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా
రాత్రికి రాత్రి పత్రాలు మాయం!
‘‘నామినేషన్ వేయడానికి వెళ్తుంటే గూండాలు, రౌడీలు మా కారుపై పడి నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు. ఎలాగోలా నామినేషన్ కేంద్రానికి చేరుకుని పత్రాలను అధికారులకు సమర్పించాను. అన్ని పత్రాలను పరిశీలించిన అధికారులు అన్నీ సరిగ్గానే ఉన్నాయని చెప్పి పంపించారు. మరుసటి రోజు ఫామ్–2 ఇవ్వలేదనే కారణంతో నా నామినేషన్‌ను తిరస్కరించారు. ముందురోజు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయని చెప్పిన అధికారులు, మరుసటి రోజే ఫామ్–2 పేరుతో నా నామినేషన్ ఎలా తిరస్కరించారు? రాత్రికి రాత్రే మా పత్రాలను మాయం చేసి, ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకున్నారు. ఆర్డీఓ కోర్టును ఆశ్రయించినా న్యాయం జరగలేదు. జరిగిన వ్యవహారంపై విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలి!’’ – అరవ లక్ష్మీ ప్రసన్న, ఎంపీటీసీ అభ్యర్థి,ముక్కావారిపల్లి, ఓబులవారిపల్లి మండలం, తిరుపతి జిల్లా
నామినేషన్ రోజు ఇచ్చిన ఎస్సీ సర్టిఫికెట్ మరుసటి రోజు మాయం!
‘‘నా 64 ఏళ్ల జీవితంలో ఇలాంటి దౌర్జన్యాలు, హింసాకాండ ఎప్పుడూ చూడలేదు. దొంగచాటుగా నామినేషన్ వేయాల్సిన పరిస్థితి కల్పించారు. నేను అన్ని నామినేషన్ పత్రాలతో పాటుఎస్సీ కులధ్రువీకరణ పత్రాన్ని కూడా అధికారులకు సమర్పించాను. అయినా ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదనే కారణంతో నా నామినేషన్‌ను తిరస్కరించారు. నామినేషన్ రోజు అధికారులకు ఇచ్చిన ఎస్సీ సర్టిఫికెట్ మరుసటి రోజు ఎక్కడికి పోయింది?
పత్రాలు సమర్పించినా లేవని చెప్పి నా నామినేషన్‌ను ఎలా తిరస్కరిస్తారు? ఆర్డీఓకు అప్పీలు చేసినా న్యాయం జరగలేదు. రిటర్నింగ్ అధికారి అక్కడే ఉండి నా నామినేషన్ తిరస్కరణ చేయించారు. టీడీపీ నాయకులకు ఎన్నికల్లో గెలిచే ధైర్యం ఉంటే ప్రజల్లో పోటీ చేసి గెలవాలి. పత్రాలు మాయం చేయడం, నామినేషన్లు తిరస్కరించడం ఎందుకు? నా నామినేషన్ తిరస్కరణపై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి!’’ – పాణ్యం జయరాం, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, చిన్నంపల్లి, ఓబులవారిపల్లి మండలం, తిరుపతి జిల్లా
ప్రతిపాదకుడి సంతకం లేదంటూ తిరస్కరించారు!
‘‘నామినేషన్ కేంద్రం బయట కూటమి నాయకులు ఇతర ప్రాంతాల నుంచి వందలాది మంది రౌడీలు, గూండాలను మోహరించి నా నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చించేశారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని, హడావుడిగా మరోసారి పత్రాలు సమర్పించాను. అయినా ప్రతిపాదకుడి సంతకం లేదనే కారణంతో అధికారులు నా నామినేషన్‌ను తిరస్కరించారు. కూటమి నాయకుల మనుషులు నా పత్రాలను చించేస్తే నేను ఏం చేయాలి?
ఆ దాడిని పట్టించుకోకుండా, సంతకం లేదనే సాకుతో నా నామినేషన్ ఎలా తిరస్కరిస్తారు? వైఎస్సార్‌సీపీ అభ్యర్థిననే కారణంతోనే నాపై వివక్ష చూపించారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితురాలినైన నన్నే ఎన్నికలకు దూరం చేయడం ఏమిటి? ఎన్నికల్లో నాతో పోటీ పడాలి కానీ, నామినేషన్ పత్రాలు చించేసి నన్ను అడ్డుకోవడం ఏం ప్రజాస్వామ్యం? నా నామినేషన్ తిరస్కరణపై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి!’’ – ఎల్. స్వాతి, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, బొమ్మవరం, ఓబులవారిపల్లి మండలం, తిరుపతి జిల్లా
పత్రాలు చించేసి నామినేషన్ తిరస్కరించారు!
‘‘బండారుపల్లి ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్తుంటే ఏర్పేడు నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ గుండాలు రాళ్లతో దాడి చేశారు. ప్రాణభయంతో నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. మరుసటి రోజు ఎట్టకేలకు నామినేషన్ వేశాను. కానీ స్క్రూటినీ సమయంలో నా నామినేషన్ పత్రాల్లో ఒక పేపర్‌ను చించేసి, దాని స్థానంలో ఖాళీ ఫారం పెట్టి, సంతకం లేదనే కారణంతో నా నామినేషన్‌ను తిరస్కరించారు. నామినేషన్ పత్రాలను మార్చేసి, సంతకం లేదనే సాకుతో నన్ను ఎన్నికల బరి నుంచి తప్పించారు. నామినేషన్ కేంద్రంలోనే దాడులు.. ఆ తర్వాత పత్రాలపై అనుమానాస్పద వ్యవహారం.. చివరకు టీడీపీకి ఏకగ్రీవం! ఎన్నికల్లో పోటీ చేసే హక్కును ఇలా అడ్డుకుంటే ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ? నా నామినేషన్ పత్రాలపై జరిగిన వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి!’’ – టి. జనార్ధన్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, బండారుపల్లి, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా
నా వివరణ వినే అవకాశం కూడా ఇవ్వలేదు
‘‘నారాయణవనం మండలం పాలమంగళం నార్త్ ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేశాను. అన్ని వివరాలు పూర్తి చేసినా, నామినేషన్ ఫారం సరైన ప్రింటెడ్ ఫార్మాట్‌లో లేదనే సాకుతో నా నామినేషన్‌ను తిరస్కరించారు. కనీసం నా వివరణ వినే అవకాశం కూడా ఇవ్వలేదు. పేరున్న లాయర్ తయారు చేసిన పత్రంలో ప్రింటెడ్ కాలమ్ హెడ్డింగ్ అసంపూర్తిగా ఉందంటూ నన్ను వెనక్కి పంపించారు.
పత్రాల్లో చిన్న లోపం ఉందనే కారణంతో నా నామినేషన్‌ను తిరస్కరించిన అధికారులు, టీడీపీ అభ్యర్థుల పత్రాలను మాత్రం పరిశీలించకుండానే ఎలా ఆమోదించారు? ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తలొగ్గి పనిచేస్తే ప్రతిపక్ష అభ్యర్థులకు న్యాయం ఎక్కడ? నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించాలి. నా నామినేషన్ తిరస్కరణపై విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలి!’’ – ఉదయకుమార్, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, పాలమంగళం నార్త్, నారాయణవనం మండలం, తిరుపతి జిల్లా
నా సంతకం వాళ్లే చేసి విత్‌డ్రా!
‘‘నేను అరికెర గ్రామ ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేశాను. మంగళవారం బీ–ఫారం ఇవ్వడానికి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే, అక్కడే ఉన్న ఆలూరు ఎస్‌ఐ మన్మథ విజయ్ నన్ను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. నా ఇష్టంతో సంబంధం లేకుండా, నా ప్రమేయం లేకుండానే రిటర్నింగ్ అధికారి ఆనంద్ రాజ్‌కుమార్ పోలీసుల సమక్షంలో నా సంతకం వాళ్లే చేసి నా నామినేషన్‌ను విత్‌డ్రా చేశారు. నా సంతకంతో ఉపసంహరణ జరిగినట్లు చూపించడానికి వీళ్లకు ఎవరు అనుమతి ఇచ్చారు? నా నామినేషన్ ఉపసంహరణతో అరికెర ఎంపీటీసీ స్థానం టీడీపీకి ఏకగ్రీవమైంది. నా ఎన్నికల హక్కును కాలరాసిన ఈ వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి!’’ – తిమ్మప్ప, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, అరికెర, కర్నూలు జిల్లా
నామినేషన్ ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు..
‘‘నేను ఆలూరు ఎంపీటీసీ–3 స్థానానికి నామినేషన్ వేశాను. శనివారం (అక్టోబర్ 24) మధ్యాహ్నం నా నామినేషన్‌ను పరిశీలించిన అధికారులు, పత్రాల్లో తప్పులున్నాయని చెప్పి మరుసటి రోజు చెక్‌లిస్ట్, ఫారం–5 ఇస్తామని చెప్పారు. కానీ నా నామినేషన్‌ను ఏ కారణంతో తిరస్కరిస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు. ఆదివారం (అక్టోబర్ 25) సాయంత్రం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్వో ఆనంద్ రాజ్‌కుమార్ నాకు ఫారం–5 ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ఇచ్చిన ఫారం–5పై శనివారం తేదీ ఎందుకు ఉంది? నామినేషన్ తిరస్కరణకు కారణాలను ముందే ఎందుకు తెలియజేయలేదు?ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలి!’’ – వినోద్ కుమార్, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, ఆలూరు–3, కర్నూలు జిల్లా
టీడీపీకి ఒక న్యాయం.. మాకు మరో న్యాయమా?
‘‘నేను కోటబొమ్మాళి మండలం దంత ఎంపీటీసీ ప్రాదేశికం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. పరిశీలన కోసం మండల పరిషత్ కార్యాలయానికి పిలిచి, పత్రాల్లో చిన్నచిన్న కారణాలు చూపిస్తూ నా నామినేషన్‌ను తిరస్కరించారు. కానీ టీడీపీ అభ్యర్థుల పత్రాల్లో తప్పులుంటే అక్కడికక్కడే సరిచేసుకునే అవకాశం కల్పించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నామినేషన్ తిరస్కరణ.. టీడీపీ అభ్యర్థులకు తప్పులు సరిదిద్దుకునే వెసులుబాటు... ఇదేనా ఎన్నికల న్యాయం? కోటబొమ్మాళి ఆర్‌ఓ కె. జగన్మోహన్‌రావు అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరించారు.
చిన్నసాన, పెద్దబమ్మిడి ప్రాదేశికాల్లోనూ ఎన్నికల నిబంధనలను పక్కనపెట్టారు. అభ్యర్థుల జాబితాలను సైతం సక్రమంగా ఇవ్వలేకపోయారు. గతంలో నామినేషన్ పత్రాల్లో ఖాళీలు ఉంటే పరిశీలన సమయంలో సరిచేసుకునే అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష అభ్యర్థుల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ, టీడీపీ అభ్యర్థులకు మినహాయింపులు ఇచ్చారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా కాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి. నా నామినేషన్ తిరస్కరణపై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి!’’ – సంపతిరావు హేమసుందర్‌రాజు, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, దంత ప్రాదేశికం, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా
అధికారుల మాట నమ్మితే పోటీ నుంచే దూరం చేశారు!
‘‘నేను కోటబొమ్మాళి మండలం చిన్నసాన ప్రాదేశికం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. నా పేరుతో వేర్వేరు ప్రతిపాదనలతో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఏదో ఒకటి విత్‌డ్రా చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ఒక నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాను. కానీ బీ–ఫారం అందజేయడానికి వెళ్తే నా నామినేషన్ పూర్తిగా తిరస్కరించినట్లు చెప్పారు. ఒక నామినేషన్ విత్‌డ్రా చేసుకోమని చెప్పి, చివరకు మొత్తం నామినేషన్‌నే రద్దు చేయడం ఏమిటి?
అధికారుల మాట నమ్మినందుకు నన్ను ఎన్నికల పోటీకి దూరం చేస్తారా?రిటర్నింగ్ అధికారి కె. జగన్మోహన్‌రావు వ్యవహారశైలితోనే నేను నామినేషన్ కోల్పోయాను. విత్‌డ్రా విషయంలో తప్పుదారి పట్టించి నా అభ్యర్థిత్వాన్ని దెబ్బతీశారు. ఎన్నికల అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తే న్యాయం ఎక్కడ? నా నామినేషన్ తిరస్కరణపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి!’’ – రొక్కం శ్రావణి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, చిన్నసాన ప్రాదేశికం, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా


