మెడికల్‌ పీజీ ఇన్‌ –సర్వీస్‌ కోటాకు కోత | Reduction in In Service Quota for Medical PG Seats | Sakshi
Sakshi News home page

మెడికల్‌ పీజీ ఇన్‌ –సర్వీస్‌ కోటాకు కోత

Oct 30 2026 4:58 AM | Updated on Oct 30 2026 4:58 AM

Reduction in In Service Quota for Medical PG Seats

సాక్షి, అమరావతి: గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించే ఎంబీబీఎస్‌ వైద్యులకు పీజీ ఇన్‌–సర్వీస్‌ కోటాలో చంద్రబాబు ప్రభుత్వం కత్తెర వేసింది. క్లినికల్‌ పీజీ కోర్సుల్లో కోటాను ఏకంగా 15 నుంచి 5 శాతం వరకు కోత పెట్టింది. ఈ మేరకు గురువారం వైద్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 2026–27 విద్యా సంవత్సరానికి మెడికల్‌ పీజీ ప్రవేశాల్లో అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఓబీజీ, జనరల్‌ మెడిసిన్, సర్జరీ, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియోథెరపి, న్యూక్లియర్‌ మెడిసిన్‌ విభాగాల్లో 15 శాతం ఇన్‌–సర్వీస్‌ కోటా కల్పించారు. 

హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, ప్రివెంటివ్‌ మెడిసిన్‌లలో 10 శాతం డీవీఎల్, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, సైకియాట్రీ విభాగాల్లో 5 శాతం చొప్పున కోటా కల్పించనున్నట్టు వివరించారు. మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ వంటి నాన్‌ క్లినికల్‌ కోర్సుల్లో 30 శాతం కోటా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచీ ఇన్‌–సర్వీస్‌ కోటాకు కోత పెడుతూనే వస్తోంది. గతేడాది క్లినికల్‌ కోర్సుల్లో 20 శాతం, నాన్‌ క్లినికల్‌ కోర్సుల్లో 30 శాతం మేర ఇన్‌సర్వీస్‌ కోటా ఇచ్చారు. 

ఈ దఫా అందులోనూ కోత పెట్టారు. ప్రస్తుతం పీజీ డిప్లొమా కోర్సులు చేసి ప్రభుత్వ సేవల్లో ఉన్న వైద్యులు పీజీ మెడికల్‌ డిగ్రీ చదవడానికి ఏడాది పాటు డిప్యుటేషన్‌కు అనుమతిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సవరించింది. ప్రభుత్వం స్పాన్సర్‌ చేయని పీజీ డిప్లొమా అర్హతతో ప్రభుత్వ సేవలో చేరిన వైద్యులు అదే స్పెషాలిటీలో పీజీ డిగ్రీ చేయడానికి రెండేళ్లు, వేరే స్పెషాలిటీలో అయితే 36 నెలలు డిప్యుటేషన్‌కు అనుమతించేలా నిబంధనల్లో సవరణ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement